పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, ఆగస్టు 2012, శుక్రవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! ఉగ్రవాదం ఉరుముతోంది !!


అప్పుడెప్పుడో అవని పుట్టకముందు
అగ్నిగుండం ఒకటి బ్రద్దలయ్యి
జీవానికి విత్తనాలు చల్లింది

ఎందుకు మోలిచిందో
ఎలా మొలిచిందో ఓ మొక్క
మహావ్రుక్షమయ్యింది
ఊపిరిని శాసిస్తోంది

అది నలు దిక్కులను తాకిన నీడ

నల్లగా నవ్వుతుంది
ఎర్రగా పాడుతుంది
ఆకాశం విరిగి పడేట్లు అరుస్తుంది

వినాడానికి భయం వేసే చప్పుడు
చెవులను కొరుకుతుంది
చాలాకాలం నుండి

అదొక ఉగ్ర నేత్రం
అంతమే దాని అంతిమ వాదం

ఆ నోటికి
ఎన్ని నాలుకలో
దాహం ఇంకా తీరినట్లు లేదు

బలి అవుతున్నవి మాత్రం మూగ జీవాలు కాదు
ఆలోచనల అల్లికలతో
ఆశల పల్లకిలో
ఎంతో కొంత ప్రేమను
ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ
కన్నీళ్లను తుడుచుకుంటూ
కలలను బ్రతికించుకుంటూ
కాలంతో కాపురం చేసుకుంటున్న
మామూలు జీవన చిత్రాలు .

వాడొక ఉగ్ర నేత్రం
అంతమే వాడి అంతిమ వాదం
పుట్టినప్పటి నుండి మెలకువతోనే
వాడు ఏ తల్లి జోల పాటను విననివాడు
ప్రపంచాన్ని జో కొడదామనుకుంటున్నాడు
జీవాన్ని మృత్యువుకు విత్తనంగా చేసుకుంటూ

నేనున్నాననే
మనం నిలబెట్టిన నీడ కూడా
ఎంగిలికే అలవాటు పడింది

ఉగ్రవాదం ఉరుముతుంటే
ఉనికే ప్రశ్నార్థకం అవుతుంటే
గురి చూసి కొడదాం ' మన ' ఆయుధంతో

30-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి