మిత్రులారా, నాకు మన కవిసంగమంలో పోస్టుచేసిన కవితలు చదువుతుంటే ఈ క్రింది అభిప్రాయం కలిగింది. అది మీతో పంచుకుందామనుకుంటున్నాను. ఇది ఎవ్వరినీ కించపరచడానికో, నిందించడానికో వ్రాస్తున్నది కాదు. ఇది పదిమంది చర్చిస్తే, కవిసంగమంలో సామాజిక బాధ్యతగల కవులుగా, మీరు దిశానిర్దేశనం చేసుకుందికీ, వీలయితే ఒక Manifesto తయారుచేసుకుని తదనుగుణంగా వ్రాయడానికీ ఉపకరిస్తుందన్న నమ్మకంతో మీముందు ఉంచుతున్నాను.
పాశ్చాత్యదేశాల్లో, ముఖ్యంగా యూరోపులో ఈ క్రిందచెప్పబోయే ఉద్యమాలన్నీ కవిత్వంలోనూ, కళలలోనూ వచ్చి సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు రావడనికి దోహదపడ్డాయి. వాటి ఛాయలు ఇంకా తెలుగు సాహిత్యంలో ఉండడం హర్షించదగినవే అయినా, మనదేశకాలపరిస్థితులకు అనుగుణంగా కవిత్వంలో కూడా మార్పులు రావలసి ఉంది. వస్తాయి కూడా. అయితే ఆ మార్పులు కాకతాళీయంగా రావడం కంటే, కవులు ప్రయత్నపూర్వకంగా తీసుకురావడం, వాళ్ళ పరిణతినీ, భావ సారూప్యతనీ సూచిస్తుంది... కనీసం ఈ ఉద్యమం విషయంలో.
కొందరు ఇంకా రొమాంటిసిస్టులు (Romanticists). అంటే, వాళ్ళు అనుభూతి కంటే కల్పనకి ప్రాధాన్యతకి ఇస్తారు. రొమాంటిస్టులు అన్న మాట ఆ నిర్ణీతార్థంలోనే వాడుతున్నాను. లేకపోతే రొమాంటిసిస్టులకి అన్యాయం చేసినట్టే. ఎందుకంటే నిజానికి వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ "ప్రజలభాషలో, ప్రజలదగ్గరికి, ఏ అలంకారాలూ (అంటే ఉపమలూ, ఉత్ప్రేక్షలూ) లేకుండా చెబుతూ, అంతవరకు కావ్యగౌరవం దక్కని అన్ని విషయాలూ, వస్తువులూ, వ్యక్తులమీదా కవిత్వం" చెబుతామని తీర్మానం చేసుకుని వ్రాసిన వాళ్ళు. (శ్రీ శ్రీ చెప్పిన కుక్కపిల్లా సబ్బుబిళ్ళా అగ్గిపుల్లా అక్షరాలా అదే). కొందరు Naturalistలు లేదా Realistలు. వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ... ఒక matter-of -fact గా చిత్రించడానికి ప్రయత్నిస్తారు. అందులో కల్పనలూ అలంకారాలూ ఉంటాయి కాని, అవి ప్రథాన విషాయనికి అనుబంధంగా ఉంటాయి తప్ప మీద చెప్పిన వాళ్ళలా వస్తువుని మింగేసి సౌందర్యంగా కవిత్వం ఉండదు. ఇంకొందరు impressionistలు అంటే వాళ్ళు చేతలను గాని, వస్తువునిగాని వర్ణించడం, దానిలోతులలోకి వెళ్లడం కంటే, చెప్పదలుచుకున్న సందర్భంతో వాటికిగల అనుబంధాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ, మనసుమీద ఆ చర్యగాని, ఆ వస్తువుగాని గాఢమైన ముద్ర వేసేలా చూస్తారు. చాలా మంది Expressionistలు. వీళ్ళు పైనచెప్పినవాళ్లందరికీ భిన్నంగా పాఠకులని రంజింపజెయ్యడం కంటే, కవిగా తమ పరిశీలనలను ఒక రన్నింగ్ కామెంటరీలా ఇస్తారు. వీళ్లు వస్తువులకి లోతైన వివరణలు వర్ణనలూ ఇవ్వడానికి బదులు చెబుతున్న సందర్భంలో వాటి ప్రతిపత్తి (perception)నిమాత్రమే మనముందు ఉంచుతారు. ఇవిగాక మన కవిత్వ ఉద్యమాల ఛాయలూ... దిగంబర, స్త్రీవాద, దళితవాద ఛాయలన్నీ ఉన్నాయి. ఇంత విస్తృతమైన వస్తువైవిధ్యం ఆరోగ్యకరమైన పరిణామమే. అయితే, శివారెడ్డి అమ్మగురించి చెబుతూ, ""నేను అమ్మను కాలేను, ఎందుకంటే నాకు అమ్మతనం అంటే తెలీదు కనుక" అని ప్రారంభించి, "కలం పట్టినతర్వాతనైనా నేను కవిని కాకపోతే ఎలా?" అని ముగించినట్టు, కవులు జీవితాంతం కవిత్వం రాయడానికి నిశ్చయించుకుని ఈ వ్యవసాయం లోకి దిగేరుగనుక, వ్యవసాయం నుండివచ్చే పంటనుకూడ దృష్టిలోపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. మన అస్థిత్వవాదాలు, అఫ్సర్ చెప్పినట్టు మన ఉనికిని ఎలా చాటుతున్నాయో, మనకవిత్వం మనలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని ఒక అస్థిత్వంగా ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఈ దిశలో కవులు సమాజంలోని రుగ్మతలకు తమదైన, ఒక ఆచరణత్మకమైన, ప్రజలకు దగ్గరగా ఉండగల ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కావలసిన తాత్త్విక చింతననూ, అభిప్రాయవ్యక్తీకరణను ప్రోత్సహించి, ఒక ఆరోగ్యకరమైన చర్చకి తెరతీస్తారని మనసారా కోరుకుంటున్నాను.
కవిసంగమం గ్రూపు చర్చను అప్ టూ డేట్ చూడాలన్నా పాల్గొనాలన్నా ఈ లింకు నుండి చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి