పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

నీ ||మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!! ||


మా ఊరంటే బస్సే గుర్తొస్తుంది..!

చదువుకోటానికి నానా అగచాట్లు పడేప్పుడు

ఫ్రీ-పాసులిచ్చి పదికిలోమీటర్లు పట్టుకెళ్ళి,
అక్షరాలు నేర్పిన "అదే"గుర్తొస్తుంది.

ఊటుకూరు పొలంలో కోటేరుని,
కొణిజర్లలో స్మసానం లో తగలబడుతున్న శవాన్ని..
ఒళ్ళోకూర్చోబెట్టుకుని కళ్ళారా చూపిచ్చిన బస్సు గుర్తొస్తుంది.!
కిటికీకి గడ్డం ఆనిచ్చిన చిన్నతనం,
సీటెనుక పదేళ్ళప్పుడు రాసిన కవిత్వం గుర్తొస్తుంది.!

బస్సంటే నన్ను చంకనెత్తుకున్న్న అవ్వ,
బస్సంటే నావరకు గోరుముద్దలు తినిపించిన అమ్మ!

మా ఊరి మోటుజనపు నేలవిమానం బస్సు

ఎవడో చుట్టంగాడి పెళ్ళికి అందరూ..
చిన్నకార్లలొ,మోటారుసైకిల్లలో వస్తే..
మా గరీబు నాన్న ఎక్కించిన ఎర్రబస్సు గొప్పగా గుర్తొస్తంది !

ఎదో పనిమీదెళ్తే..
దిల్-సుఖ్-నగర్ రోడ్డుమీద మా బస్సు కనిపిస్తే
ఎదురెళ్ళి ముఖం మీద ముద్దుపెట్టుకోబుద్దయ్యేది,
ఒక పాత స్నేహితుణ్ణి చూసినట్టో..
ఏదో విషాదం గుండె అడుగునుంచి కారుతున్నట్టొ వుండేది!

* * *
ఎవడో చదువుకున్నోడట బస్సుని రాళ్ళతో బద్దలు కొడుతున్నాడు!
కసాయిలా కిరసనాయులు పోసి కాల్చేస్తునాడు!
ఎవడొ.. దయామయి బస్సుని ధ్వంసం చేస్తున్నాడు!

ఇప్పుడెందుకో బస్సుకి గొంతుంటే బాగుండనిపిస్తుంది నాకు!

మావూరి మట్టిరోడ్డుమీద బస్సుపోతున్నట్లు
నా ముఖం మీద కన్నీళ్ళు పోతున్నాయి

తగలబడుతున్న బస్సుల మధ్య కూలబడి
విజ్ఞానులనే అజ్ఞానుల ఉన్మాదాన్ని వార్తలు చేసుకుంటున్నా..,

అయినా సరె..
కారుతున్న నా కన్నీళ్ళని సీసాలో పట్టుంచా..
తిలక్ ఓసారి ఇలావచ్చి తగలబడుతున్న బస్సుమీద పోసెళ్ళు..

ఇంతకుముండె..
మావూరి బస్సొచ్చి నాతో కన్నీళ్ళు పెట్టుకుంది!!

*29.8.2012 

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి