పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

శ్రీకాంత్ కాంటేకార్ || మానవత్వం ఖాయిల పడ్డ కార్ఖానా ||

మానవత్వమే ఓ ఖాయిల పడ్డ కార్ఖానా
ఇంకా మనిషికి విలువ ఏ పాటి?
కల్లోల జీవన సాగరంలో అనునిత్యం
ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సామాన్యుడిని చూసి చలించదేవరు?
నీతి బాట వీడక
కత్తుల వంతెనపై పడుతూ లేస్తూ
నెత్తురోడుతూ
గాయాలను ఓర్చుకుంటూ
బతుకు బండి లాగుతున్న ఒంటరిజీవి గుర్తున్నాడా?
తడారిపోయిన నీ హృదయ చలిమెల్లో
రెండు కన్నీటిబొట్లయినా అతడి కోసం మిగిలివున్నాయా?
నయా అభివృద్ధి ముసుగులో
రంగురంగుల విద్యుత్ వెలుగులో
సంపన్నవర్గాలను, విజేతలను మాత్రమే
కీర్తిస్తున్న నీలో ఇంకా అతడి గురించి భావాలు ఊరుతున్నయా?
అతడి జీవితం సంఘర్షణభరితం
తప్పు చేసే అవకాశం ఉన్నా
గీత దాటే గుండె ధైర్యం లేదు
బహుశా అమ్మ చెప్పిన నీతికథాసారం
చెవుల్లో మారుమోగుతున్నదేమో
పాపపు కూడుతో పైకి రాలేవన్న
బడిపంతుల పాఠాలు గుర్తుకొచ్చెనేమో!
పాపభీతి.. పైవాడు గమనిస్తున్నాడన్న భయం వెంటాడుతుందేమో!
(అందుకోసమే సామాన్యుడిగా మిగిలాడనుకుంటే
ఈ సమాజంలో మంచితనపు చివరిజ్యోతి కూడా ఆరినట్టే
అంతటా అన్యాయం అంధకారమే)

అటు చూడు చెడి బతికిన వాడి వైభవం
వాడి చుట్టూ చేరిన భజనమేళా సందోహం
వాడు ఎందరికి చెరుపు చేశాడో ఎవడికి పట్టింది
ఎన్ని అడ్డదారులు తొక్కి పైకి వచ్చాడో
ఎవడు అడుగుతాడు
ఎవడికి మాత్రం అంత ధైర్యం తీరిక ఉన్నాయి కనుక

వాడు విజయం సాధించాడా లేదా? అన్నదే కావాలి
ఎంతమంది నోళ్లు కొట్టి
ఎందరి జీవితాలను బలిపెట్టి
ఎన్ని గుడిసెలకు అగ్గిపెట్టి
తన మహాసౌధాలను నిర్మించుకున్నాడో
ఎవడు మాత్రం శోధించి కనుక్కోగలడు

ఎందరి వెన్నెముకలు విరిచి
ఎంతమంది ఆశలను చిదిమేసి
తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడో
నువ్వేమైనా ఎరుగుదవా

మృగరూపం దాచేసి
సాధు తోలు కప్పుకొని
చెబుతున్న నీతి మాటలకు
మైమరచిపోతున్న మానవుడా
రాజకీయమే రాచబాటగా
అధికారమే ఆలంబనగా
నిర్మించిన మహా సామ్రాజ్యాల కింద
ఎన్ని జీవితాలు విధ్వంసమయ్యాయో
ఎన్ని బతుకులు బలిపీఠం ఎక్కాయో

నీకూ నాకూ మాత్రం ఎందుకు పట్టింపు
నువ్వు నేను బాగానే ఉన్నాం
తగలబడుతున్న సమాజం
మన గుడిసెల దాకా రాలేదు కదా
మన కాలి కింద నేల కదిలిపోవడం లేదు కదా
అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసం
నువ్వూ నేనూ రుచి చూడలేదు కదా
అందుకే స్పందించొద్దు
నరనరాలలో ఉడుకు నెత్తురు మరగకూడదు
పక్కవాడి అన్యాయంపై మన రోమాలు నిక్కబొడుచుకోవద్దు
అయినా నాకెందుకొచ్చిన గొడవ
పక్కవాడి గుడిసెగా తగలబడుతోంది
రేపొద్దున నీ పక్కవాడు కూడా ఇలాగే అనుకుంటాడు
కాంటేకార్ శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి