పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఆగస్టు 2012, బుధవారం

జయశ్రీ నాయుడు //నిరంతర చెలిమి//


డైరీ లో పేజీలు తిప్పి చూసుకుంటే
నాలో నడిచి వచ్చిన అనుభవాలు
ఎన్నో మనసుల పాత్ర వుంది
అనుభవాల ఉలి దెబ్బలున్నాయి..
ఎన్నొ హృదయాల ఓదార్పు వుంది!
ఈత నేర్పిన కాల ప్రవాహం వుంది

నమ్మకం అపనమ్మకాల పగుళ్ళలొ
ఇరుక్కున్న విశ్వాసపు పందిరికి
ఆత్మని పూయించాలని ఒక్కో
కొమ్మకూ కాలపు చిగురు అతికిస్తూ
ఆలోచనల వర్షం కురిపిస్తూ
ఆకాశంలా సాక్షీ భూత స్థితికి
ఒక్కో మెట్టూ లెక్కిస్తూ నేను

అంతరంగం అన్నిటికన్నా లోతైన పసిఫిక్
ముందువెనుక వూగిసలాటల చేపలు
తలపులై మింగేసే అజ్ఞాన తిమింగలాలు
గమ్యాలుగా బయలుదేరిన చిట్టి పడవలూ
ఎంత కొలాహల హాలాహల సముద్రమిది

లయం కావాలి
ఆలయం కావాలి
భావనలన్నీ లయించే తీరం లో
ఇసుకరేణువులూ కానని సముద్రం అవ్వాలి

చుక్కల వెలుగు పోగు చేసి
పాలపుంతే కళ్ళు చేసుకుని
విప్పార్చి చూస్తున్నా
అఖండంగా వెలుగుతున్నావు
నావెలుగూ నీ పులుగే కదా

ప్రయాణం ఆగదు జీవన వినోదం మారదు
మోద ఖేదాలు గుండె చప్పుళ్ళే
ఆశల అలలు దాటిన సముద్రం
కన్నీళ్ళు లేని కళ్ళు మెరిసే ప్రయాణం
నేనే నా నౌక - విశ్వాసమే నా తెరచాప
నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నా
నీతో నిరంతర చెలిమికి అవకాశంగా మలుచుకుంటున్నా!

28-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి