ll యాడుంటివి మామా ll యాడనుంటువి మామా ? కోడికూయక మునుపే సంతకని పోతివే? సద్దికూడును మరిసి, ఏకువెంటే తరలిపోతివే? గొడ్డును తెచ్చి కాడికి కడతనంటివే? కొత్త రైక తెత్తనంటివే ముత్తెమంత ముక్కెర ముద్దంటివే మువ్వల గజ్జలతో మురిపిత్తనంటివే మువ్వన్నెలకోక నీకంటివే సిలిపిగా ఈలలేసి గోలసేసే గాలిసుడిగాడు మరుల పూలగందమేసి పోయే వనరేడు సినుకులతో సిటికలేసే వానదేముడు కనుగీటి సైగసేసె కోరమీసాల సక్కనోడు తుంటరి మల్లెలు వలపు అత్తరులేసి పోయే గండుతుమ్మెదలు గుంపుగా సేరి గుసగుసలు రేపే కొంటె కందిరీగ బుగ్గ గిల్లిపోయే మొగలిపొదమాటున నాగులలసి సొమ్మసిల్లిపోయే యెరుకతొచ్చి ఏమో సెప్పిపోయే సిలక జోసెమంతా..ఇప్పిపోయే పావురాయి పిట్ట పిలుపు ఇనకపోయే కాకమ్మయినా కబురు తేకపోయే ఆసలన్నీ సిసిరాలై రాలిపోయే ఊసులన్నీ వసంతాలనే నింపిపోయే ఊహలన్నీ సెరత్తులై సిగురులేసే బాసలన్నీ గీస్మతాపాలై గుబులురేపే యెన్నెలమ్మొచ్చి ఎలుగు కల్లాపి సల్లిపోయే తారలమ్మలొచ్చి సుక్కలనే దిద్దిపోయే మెరుపులమ్మ మేనాదిగి ముగ్గులల్లిపోయే ఏడురంగుల దీపమొచ్చి రంగులద్ది పోయే మినుగురుల దీపమెట్టి ఎతుకుతున్నా సాగిపోయే ఏరులనే ఆరాలడుగుతున్నా జింకపిల్ల యెంటపడి మతిసెడి పరుగులెడుతున్నా ఒడ్దు సేరే పతి నావ నడుగుతున్నా గోదూలి ఏలైపోయే లేగదూడలన్నీ ఇంటికి సేరిపోయే గువ్వలన్నీ గూడుసేరే వాడంత కునుకుతీసే సిరుగాలి సంగీతాలతో జోలలు పాడే తమలపాకు సేతులేమో కమిలిపోయే పూల పుప్పొడి పారానులేమో రాలిపోయే సిలకసుట్ట ఇసిగి ఎలిసి పోయే దూపమలిగి దూరతీరం సేరి పోయే మబ్బుసాటున సెందరయ్య తొంగిసూసి ఇసిగిపోయే జాబిలమ్మ యెన్నెల దీపమెట్టి అలిగిపోయే ముసురుపట్టి కనులేమో ఏరులాయే మాపుటేలకైనా మరలిరాకపోయే మురిపాల మిరియాల జున్ను సేసుంచినా మినప సున్నుతో ఉట్టినంత నింపి పెట్టినా దిబ్బరొట్టి పానకాలే దాసి పెట్టినా కొర్రమేను పులుసు కమ్మగా వండి పెట్టినా నాటుకోడి కూర గాటుగా వండినా సిల్లుగారెలేసి అదిమి పెట్టినా తెల్లనైన వరిబువ్వ వార్చిపెట్టినా ఇప్పపూల సార సేకరించి తెచ్చినా పొన్నపూల పానుపేసి ఉంచినా నాగమల్లి పూల పక్క పరిసినా జాజిపూల దండ కొప్పులో తురిమినా మొగలిపూల అత్తరులే సల్లినా యెన్నెల్లో తానమాడి పొదరింట ఎదురుసూత్తున్నా యెన్నెల దొరవై వత్తవని, యెన్నెల సరసమే తెత్తవని వలపు ఇత్తరి పరసి ఉంచా... మరుల మడి తడిపి ఉంచా మగసిరితో వత్తవని సొగసరి సొగసును దోసుకుంటావని మల్లి మనసు సిన్నబోయే కనులు కడవలాయే జామురాతిరంతా జాగరనాయే రేయేమో తరగదాయే, కాలమేమో కదలదాయే నువ్వేడనున్నా ఏగిరమే గూటికి సేరుకో మామా ! నీ మల్లి గుండె గదిలో దాగుండిపో మామా ! ll సిరి వడ్డే ll 22-03-2014
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWAA
Posted by Katta
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWAA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి