పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

Swatee Sripada కవిత

“ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ” ,.... స్వాతీ శ్రీపాద సతత హరిత జ్వాలల్లా వెలిగే వృక్ష ముదాయాల నీడల్లో ఒదిగి ఒదిగి బిడియాన్ని దాచుకున్న అమాయకపు రోజులనుండి నీళ్ళచుట్టూ నదిచుట్టూ అల్లుకున్న అనంత బాల్యావస్థ పిచ్చుక గూళ్ళను౦డి తీపితేనే మాధుర్యాలు తప్ప పదునైన మాటల ఈటెలు ఇంకా నాలుకలపై మొలవని ఆదిమజాతి క్షణాలనుండి నేనూ నా చుట్టూ అనుకునే సమైక్య భావనను౦డి ఈ కాలబిలం సుడిగుండమై ఎలా నిన్ను లాగేసుకుందో తెలియదు ఎవరిచుట్టూ వాళ్ళు దిగులు పాటల గూళ్ళల్లుకు౦టూ కనిపిస్తూనే అదృశ్యమయే కాంక్షల మయసభల్లోకి నాలుగు రోజుల జీవితాన్ని సుఖాల వినువీధిలో రెపరెపలాడే రంగుల గాలిపటం చేసుకుందుకు ఎందరి బ్రతుకుతెరువో గాజు పెంకుల్లా నూరినూరి పలచని సుకుమారపు మానవీయత సిల్క్ దారం మరుగుపరచేలా మనసారా అద్ది అద్ది మా౦జాగా చేసుకు రక్త విహారం చేస్తూ చీకట్లు గొంతు తెంపుకు అరుస్తున్నా విజయోత్సాహపు మత్తులో మునిగితేలే ఈ అసురసంధ్య చివరిఘడియలమీద ఒక అద్వితీయ శక్తిననుకు౦టూ ఆధునికత తామరతంపర అడుసులో ఇరుక్కుపోయావు మనిషీ చేసిన పాపాలు వెన్నంటే ఉన్నాయి మరి బాల్యం వీప్మీద బరువులుగా మారి నీకు నిన్ను రేపటి అధికార వ్యామోహపు సంకెళ్లతో బానిసను చేసి నీకు నిన్ను అహంకారపు స్టేటస్ కు తలవంచుకునేలా చేసి చినుకుల్లా రాలి మనుగడ సాగు చేసే అక్షరాలూ ఏ మూలకు వడగల్లై చదువులు అటూ ఇటూ తిప్పికొట్టిన వేగంలో నిన్న నువ్వు నిలవరి౦చుకున్నవా చాపిన నీ చేతి కందినంత మేరా నిలుచున్న నేలనే ఆకాశం అంటావు సముద్రాలు సప్తరుషులు సర్వం సావిట్లో కట్టేసుకున్న పెంపుడు కుక్కలవుతాయి 2. కను చూపు మేర కంది చేలల్లా డబ్బు మొలిపించే రాతి సామ్రాజ్యాల మధ్య చుట్టూ హిమపర్వాతాలా పేర్చుకున్న మణిమాణిక్యాల మెరుపుల మధ్య ఆకాశాన్ని ఒంట్లోకి దిమ్పుకున్నట్టు నీలమై పోతున్న మనిషీ నిజం చెప్పు నువ్వేగా హరిత వనాలను పరిశ్రమలుగా మార్చినది చల్లగాలిని ఒడుపుగా పట్టి పంజరం లోన పెట్టినది ఆహ్లాదాన్నీ , సహజత్వాన్నీ తెగనమ్ముకు నీ చుట్టూ నువ్వు కంచెలు పాతుకు విలాసాలకు నెలవైనదీ అర్ధంతరంగా ఇలా చీడ పట్టిన చిక్కుడు పాదులా విలవిలలాడితే ఎలాగ? అన్యదా శరణం నాస్తి శరణం మమ అనుకుంటూ ఖాళీతనం శూన్యంలో మళ్ళీ మనసులను నాటుకో కధలుగా మారిన గత వైభవానికి ఈ ఆధునికత సమాదులమీద మనమనే విత్తనాలు చల్లుకో అన్యదా శరణం నాస్తి పాట పంచాక్షరిలా పునర్ జీవనానికి నడుం కట్టడమే ...

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLntPa

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి