పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

మెర్సీ మార్గరేట్-కవిత : కళ్ళతో చూడలేనివి                   

సాహిత్యంలో తాదాత్మ్యం(empathy)అనే పదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.నిజానికి ఇది రెండు,మూడు సందర్భాల్లో ఉపయోగించడంకనిపిస్తుంది.

1.రచనలోని పాత్రలతోగాని,రచనతో గాని మమేకమైపోవటం 2.జీవం ఉన్న,జీవంలేని వస్తువులు,ప్రాణిప్రపంచం రెంటిలోనూ మనల్ని మనంపోల్చుకుని,ఊహించుకుని ఆపాదించుకోవటం.మన ప్రమేయం లేకుండానే దానిపట్ల స్పందించటం.3.చదువుతున్నవాటిలోని ఉత్కంఠతని అనుభవిస్తూ అందులో లీనమై ఉద్రేకపడటం.పాతకాలం సినిమాల్లో "నాటకాల్రాయుడు"లో నాగభూషణంగారికి ఈఅలవాటు ఉండేది..

ఈ మార్గంలోనే తాత్విక కవిత(philosophical poetry),తాదాత్మ్య స్థితి(catharsis)గురించి చెప్పుకోవాలి.

సాధారణంగా తాదాత్మ్య స్థితిని సత్యాన్వేషణకోసం, తప్పుచేసాననే బాధను తొలగించడంలో వాడతారు.నిజానికి నాటక సంబంధంగా క్రీ.పు.4 శతాబ్దంలో సోక్రటీసు దీన్ని ఉపయోగించారని చెబుతారు

తను(నాయకుడు)చేసిన తప్పు ఎంత వినాశకరమైనదో గమనించి-అలాంటిది మళ్లీ జరగకూడదనే నిర్ణయాన్ని ప్రకటించడం.2.నాయకుడి నుండి ప్రేరణ పొంది(పాఠకుడు)తనను తాను గమనించుకుని తను కూడా సత్యాన్ని వెదుక్కోడం.ఇవి గురువో,మరొకరో చెప్పినపుడు ఉపదేశాత్మకంగాకూడా కనిపిస్తాయి.
బైబిల్లోని వచనం ఇలాంటి తాదాత్మ్య స్థితిలో ఉంటుందని,అందువల్లే జీవితానికి సంబంధించిన అనేకవిషయాలను గుర్తుకు తెస్తాయని విమర్శకుల అభిప్రాయం

ఈ క్రమంలోనే ఈ తాదాత్మ్య స్థితి కవిత్వంలోనూ తాత్విక కవితలో కనిపిస్తుంది.ప్రకృతి,జీవితం,మనిషి ఉనికి తత్సంబంధంగా ఆధ్యాత్మిక దృష్టి,సత్య నిర్దిష్టతల గూర్చి మాట్లాడటం తాత్విక లక్షణాలు.

మెర్సీ మార్గరేట్..ధ్యానాత్మక స్థితి లోంచి రాసిన కవిత"కళ్లతో చూడలేనివి"ఈ కవితకు భారమైన వచనం కూడా తోడయ్యింది.1. సత్య దృష్టిని,సానుభూతిని ప్ర్రేరేపించడం 2.తాత్వికంగా,సుషుప్తిలో ఉన్న మానవీయతని మేల్కొల్పడం ఈకవిత చేస్తుంది.

"కళ్లతో చూడలేనివి/కన్నీళ్లే చూడగలవు"-ఈ వాక్యంలో సత్య దృష్టి సాంద్రమైన ప్రేరణ ఉన్నాయి.ఈ అంశం కవిత్వ మవ్వడానికి రెండవ వాక్యం నిలుస్తుంది.

"బల్లపరుపుగా ఉన్న మాటలమట్టి పై /పరుచుకుని /లోలోతుల పొరలకు ఇంకి పోతూ చేరగలవు"-హృదయధర్మాన్ని తెలిసి వాక్యాన్ని తీర్చిదిద్దే క్రమం మెర్సీగారికి అబ్బింది.మాటల మట్టి '-బల్ల పరుపు లాంటివి ఈ వాక్యానికి బలాన్నిస్తాయి.తాత్విక కవిత లో కనిపించే సత్య సంబంధమైన అన్వేషణ చివరివాక్యాల్లో కనిపిస్తుంది.

"అబద్ధాలాడే కళ్ల అంచులలో తడిలేని కళ్లున్నాయేమో చూపించు"
"కన్నీటి పరదాల్ని కదిలించే క్షణాల్ని ఆపకుండా అడుపెట్టే చేతుల్నికూడా/మాట్లాడించే హృదయం అందరికీ ఒక్కలాగే ఉంటుందో లేదో చెప్పే సాఫ్ట్ వేర్ ఉంటే చెప్పు"

సత్య దృష్టిని అనుభవించడం,తాదాత్మ్యంగా ధ్యానంలో అన్వేషించడం,అనిర్దిష్టంగానైనా సంభాషణాత్మకంగా ప్రేరేపించడం.హృదయాన్నికదిలించే కళాత్మకతని ప్రదర్శించడం ఈకవిత చేసింది.మెర్సీగారి కవిత తో ఉన్న కొద్దిపాటి పరిచయంతో చూస్తే ఈ మధ్య కాలంలో ఒక పరిణతి కని పిస్తుంది.మరింత కొత్తచూపుతో కవితల్ని అందించాలని ఆశిద్దాం.*

________________ఎం.నారాయణ శర్మ-30.07.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి