పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

యశస్వీ సతీశ్ కవిత..తెల్లకాగితం





కవిత్వం రాసేవాళ్లకు తొలిదశలో మార్గ సంబంధమైన ఇబ్బందులుంటాయి.ఎలా రాయాలి?భాష ఎలా ఉండాలి?మంచి కవితకి ఏమైనా లక్షణాలుంటాయా?ఇలాంటివి.ఈ ప్రాథమికావస్థ నూటికి తొంభైమందిలో ఉంటుంది.

ఇలాంటి సమయాలల్లో అధ్యయనం ఒక ఊనికనిస్తుంది.అందుకే చాలావరకు సీనియర్ కవులు కవిత్వం చదవండని సలహాలిస్తుంటారు.
ప్రాచీన కాలనికి ఒకాయన ఇలా అన్నాడు

"గురూపదేశాదధ్యేతుం శాస్త్రం జఢ ధియోప్యలం
కావ్యంతు జాయతేజాతు కస్యచిత్ప్రతిభావతః"

మంచిగురువుదొరికితే మూర్ఖుడు పండితుడు కాగలడు కాని,స్వంత ప్రతిభ లేకుండా కవి కాలేడు-అని

తొలిదశలో కవిత్వం రాసేవారు ఒకరిప్రభావంలో పడతారు.అధ్యయనం ఇలాచేయిస్తుంది.కొన్నాళ్లు అలా సాగాక తమకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఆకాలానికి తన కవిత్వ మార్గం ఎలా ఉండాలనేది నిర్ణయించేస్తారు.ఈ పద్దతి చాలామంది కవుల్లో ఉంటుంది.

శ్రీశ్రీ లో ప్రభవ నాటికి కనిపించని"కవితా ఓ కవితా"స్ఫూర్తి మహాప్రస్థానం నాటికి కనిపిస్తుంది.ఇలాంటివి రాయనికవులు ఉండరని అనలేం కాని 90శాతం ఇలాంటివి రాసేవాళ్లే.పఠాభి ఫిడేల్ రాగాల డజన్ లోఎన్ని ఉరుములున్నాయో తెలియందికాదు.నగ్నముని కొయ్యగుర్రంలో మొదటి 3 భాగాలు ఇలాంటివే

నిన్న కవిసంగమం లో పోస్ట్ చేసిన కవితల్లో యశస్వీసతీశ్,వర్చస్వీ,అరుణ నారద భట్ల కవితలు కవిత్వానికి సంబంధిచే.

ప్రాచీన కాలంలో 'అవతారిక ' ఒకటి కనిపిస్తుంది.ఇందులో భాష,వాక్యాలు,వస్తువు,అంకితం ఇలాంటి వాటిని గూర్చి కవులు తమ భావాలను చెప్పుకునేవారు.మహాకావ్య లక్షణాల్లో ఆముఖం కూడా ఒకటి. దండి..

"ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశేవాపి తన్ముఖం"అన్నాడు. ఆశంస,వస్తు నిర్దేశ్యం,కావ్యానికి ముఖాల్లాంటివని ఈ అభిప్రాయం.మొల్ల తన రామాయణ అవతారికలో పదాల ఉపయొగంపట్ల ఎలా స్పందించిందో తెలుసుకదా."గూఢ శబ్దమ్ములు గూర్చిన కావ్యమ్ము మూగ చెవిటివారి ముచ్చటగును"-అని

యశస్వి సతీశ్ తెల్లకాగితం కూడా అలాంటికవితే.ఓ రచనకు సమాయత్తమౌతూ,సృజన సమయంలో లక్షం ఎలా ఉండాలో చెబుతున్నారు.ఇందులో అంశం తోపాటు కవితానిర్మాణం విషయం లోనూ సతీశ ఒక పద్దతిని ఏర్పాటు చేసుకున్నారు.సుమారు సగభాగం రచనాక్రియా క్రమాన్ని చెప్పి మిగతాభాగం ప్రయోజనాన్ని పూర్తి చేసారు.

ఇందులో కొన్ని అంశాలల్లో సతీశ్ రచన ఎలా ఉండాలనే అంశంపైకొన్ని అంశాలు వ్యక్తం చేసారు.1.న్యాయం చెప్పటంలా..2.పూజలా..3.జీవితాన్నివ్వటంలా..4.భోజనంలా.5.అనుభూతిలా6.మొలకెత్తే విత్తనంలా..ఈ భావనలు పైన చెప్పిన రెండురకాలైన వాక్యాల్లోనూ కనిపిస్తాయి.ఇవన్ని కవిత్వంపై ఆయనకుగల ఆత్మీయతని సూచిస్తాయి.

"మనస్సాక్షి చెప్పినట్టు/పేజీ చివర సంతకంచేసే /క్షణమొకటి వేచి ఉంటుంది"

"జీవితాన్ని ప్రసాదంలా/అందించే అవకాశం"

"ఈ సాహిత్యం మీ ఉన్నతిని కోరే /సంస్కారమని గుర్తిస్తే చాలు"

కవితా నేపథ్యం లాంటిదయినా ఈ కవిత లో కళాత్మకవాక్యాలతో పాటు ,..కొన్ని ప్రతిఫలనాలు కనిపిస్తాయి."క్షీణోపాంత ప్రయోజనసూత్రం,బాష్పోత్సేక(ద్రవీభవన)సిద్దాంతం గూర్చి మాట్లాడటం ఇలాంటి ప్రతి ఫలనాలని స్ఫురింపచేస్తాయి.

"అంతర్యామిగామారే అనుభూతిని/ కాగితంపై ఇంకిన /ఒక ఇంకు చుక్క ఇవ్వగలిగితే చాలు"

"కలం నాటిన విత్తులు మొలకెత్తి/సహస్ర దళాల్లో వెలుగు రేఖలనుపొదివి పట్టితే చాలు"--సతీశ్ కవిత్వానికి కావలిసిన దార్శనికత,వ్యక్తం చేయడానికి కావలసిన కళాత్మకతా ఉన్నాయి.మరిన్ని కొత్తవస్తువుల్ని సతీశ్ కవిత్వంచేస్తారని ఆశిద్దాం.జీవితాలని కొత్తగ కొత్త పరికరాలతో అందించదం ఇప్పటి కవుల బాధ్యతకూడా కదా!

_____________ఎం.నారాయణ శర్మ29.072013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి