పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

కృపాకర్ పొనుగోటి కవిత-మేం చాలాహాట్ గురూ




తెలుగులో వచ్చిన అనేక అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధానంగా దళితకవిత గూర్చి మాట్లాడుకోవాల్సిందే.నిజానికి ఇలాకులం,వర్గం,ప్రాంతం,మత ప్రాతిపదికన వచ్చిన వాదాలు కవిత్వానికి సంబందించి వస్తువు, శైలిమొదలైన విషయాలలో కవిత్వ వైశాల్యాన్ని పెంచాయి.

తెలుగులో శివసాగర్ నుండి సతీశ్ చందర్,ఎండ్లూరి సుధాకర్ మొదలైన వారిదాకా దళితకవిత్వం వేసుకున్న మార్గాలు చాలా బలమైనవి.కృపాకర్ గారిలోనూ ఈ తాత్వికత బలంగా కనిపిస్తుంది.

ప్రధానంగా ఇందులో గమనించాల్సిన అంశాలు రెండున్నాయి.ప్రతీకలని ప్రత్యేకంగా కూర్చుకోవడం శివసాగర్ నుండేమొదలైనా ఆతరువాత కవులుకూడ ఈఆలంకారికాభివ్యక్తి(Figaretive expression)కొనసాగించారు..కేవలం ప్రతీకల స్థాయిలోనే గాకుండా వాక్య రచనకు కూడా పరికరాలని ప్రాంతీయపదజాలం(Preventialism)నుంచి కూడా కూర్చుకుంది.ప్రధానంగా తెలంగాణా ఉద్యమం కవిత్వానికి ఈ అదనపు సౌందర్యాన్ని తెచ్చింది.(గతంలోనే జానపదాల్లో ఉందనేదికూడా వినిపిస్తుంది)



"మా యవ్వనోద్రేకాలు సింగిడి వాగులై పొంగినపుడు
కులంకట్టు గాట్లను తెంచుకోజూసిన కట్టుగొయ్యలం
మీ చేతుల్లో పగిలిన చేతి గాజులం
సేపు లొచ్చినా, పసిబిడ్డలకు పాలివ్వటానికి అనుమతి లేని
తల్లి ఎదల ఎతలం "

పై వాక్యాల్లో ఆత్మ గౌరవ సంబంధమైన ఉద్వేగ స్థాయి,కొంత సామాజికమైన చారిత్రక అనుగమనం కనిపిస్తాయి.ఈ కవితనిండా ప్రతీకాత్మకంగా కనిపించే పదాలే బలమైన అభివ్యక్తిని పరిచయం చేస్తాయి.ప్రతీ వాక్యంలోనూ "పరిగె కంకులు,నెర్రెల్లో ఇరుక్కున్న మట్టి గింజలు,పాశేరు వొంచలు,"లాంటివి బలమైన వ్యక్తీకరణలు.


"ఆసాములు పంట కోసుకున్నాక
మిగిలిన తాలూ తరగల పరిగె కంకులం "

"మనుషులుగా మర్యాదలు దక్కని
కులవెరి లోకం లో
నిండిన సల్ల కుండల్లా ఉండలేం
నంగి దొంగ పెద్దరికాల మీద మండుతానే వుంటాం"

కృపాకర్ గారి వాక్యాల్లో కావల్సినంత వేగం ఉంది.పై వాక్యాల్లో తాను పలికించాలనుకున్న గొంతుకూడా సుస్పష్టంగా వినిపిస్తుంది.రూపాన్ని తయారు చేసే పరికరాల విషయంలోకూడ కొత్తదనాన్ని తనదైన దృష్టిని చూపుతున్నారు.కవితని వాక్యాలుగా,యూనిట్లు గా అందించటం వలన పాఠకులకు ఆకవితా హృదయం మరింత దగ్గరవుతుంది.మరిన్ని మంచికవితలతో బలమైన గొంతుకని వినిపిస్తారని ఆశిద్దాం.

వాక్యాల నిడివి,యూనిట్లుగా రాయడం ఇప్పుడు కవితని ఒక రాశిగా రాస్తున్న వారంతాగమనించాల్సిన అంశం.అందువల్ల చదవడాంకి సౌలభ్యం పెరుగుతుంది.మంచి కవిత అందించి ననుకు కృపాకర్ గారికి అభినందనలు.

17.08.2013


                                                     


                                                                            



                                                                          ____ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి