పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ



ఏ.నాగరాజు కవిత:ఖాళీ




మృత్యువుగురించి భారతీయసాహిత్య,పురాణ,వైదిక మార్గాలన్ని అనేకకోణాలలో చర్చించాయి.ఇది వేదాంతం,తాత్వికత,ఆధ్యాత్మికం,యోగ మొదలైన వివిధ మార్గాలలో కనిపిస్తుంది.

1920 కాస్త అటూ,ఇటుగా ఫ్రాన్స్ లో డాడాయిజం,సర్రియలిజం వచ్చాక సాహిత్యంలో శూన్యవాదం ఒకటి మొదలయింది.డాడాయిజం ఆత్మ హత్యని ఒక కళగా కూడాప్రచారం చేసింది.నెరూడా"Residence of earth"నిరాశవాదాన్ని మోసిందని విశ్లేషకుల మాట.

జీవితంలో గ్లూమీనెస్ ని నిరాశావాదంతేలిగ్గ ఉపయోగించు కుంది.సిల్వయా పాత్,అన్నే సెక్స్ టన్,హార్ట్ క్రేన్,మయ్ కో విస్కీ,జాన్ బెర్రీమాన్,మొదలైనవారు మృత్యువును ప్రేమించారు.కొందరి ఆత్మ హత్యలూ తెలియనివి కావు.

బోదలేర్ "మృత్యువుని"దేవతగా కీర్తించాడు.తెలుగులో ఇలాంటి కవిత్వానికి బైరాగిని ఆద్యుడుగా చెబుతారు.అజంతా"చీకటి చిత్రశాల"లాంటి కొన్ని కవితలు ఇలాంటి విషాదాన్ని చెప్పాయి.అజంతా "మృత్యువు"అంటే మరో జన్మకి తెరుచుకున్న ద్వారం అన్నాడు.వాడ్రేవు చిన వీర భద్రుడు"నిర్వికల్ప సంగీతం",సీతారం "ఇదిగో.. ఇక్కడిదాకే..."ఇలాంటివే.ఈ మధ్యన మోడేపల్లి శ్రీలతా కోటపాటి "మృత్యుమోహనం "దీర్ఘ కవిత రాసారు.

నాగరాజు కవిత"ఖాళీ"మృత్యువు సందర్భం నుండి ఒక మానసికావేశాన్ని చిత్రించారు.జీవితానికి మిగిల్చేది ఏది ఉండదనే తాత్వికమైన ఆలోచన ఇందులో కనిపిస్తుంది.నాలుగు యూనిట్లలోనూ ఏది మిగలదనే వేదాంతాన్ని పరోక్షంగా వల్లిస్తుంది.

"దేహపు గూడు నుండి కొన్నాళ్ళకు పక్షులు ఎగిరిపోతాయి
ఇక అప్పుడు ఎందుకు దుఃఖించిందీ అడిగేందుకు ఎవ్వరూఉండరు"

"గడిచిన కాలపు పద్దుల నుండి
క్షణాల లెక్కన ఒక్కొక్కటిగా అన్నీ తుడిచి పెట్టుక పోతాయి"

జీవితంలో ఒక యావ ఉంటుంది.అది బతకటంకొరకు అనేక దుఃఖాలననుభవిస్తుంది.మరణం తరువాత జీవిత సంబంధమైన దుఃఖాన్ని గురించి అడిగేందుకు ఎవరూ ఉండరు,పెంచుకున్న బంధాలన్నీ ఒక్కటొక్కటిగా తొలగి పోతాయి.నడుస్తున్నపుడు ఎవరూ భౌతికజిఙ్ఞాసతో చూడరు.జీవితాన్ని తీర్చిదిద్దుదామనుకున్న వాడు ఆఖరిపేజీ చివరి అఖరిపంక్తిని కూడా చెరిపి ఏమిలేకుండా వెళ్లి పోతాడు.

భాషాపరాంగ ఎటువంటిక్లిష్టతలేకుండా సరళమైనవాక్యాలున్నాయి ఈకవితలో.వాక్యల్లో గాంభీర్యత కూడా కనిపిస్తుంది.

"బతికినందుకు ఏదైనా ఒక దానిని గుర్తుగా ఎందుకు మిగిల్చి పోవాలనే సందిగ్ధతలో/రాసి చించేస్తూ పోగా మిగిలిన/ఒకేఒక్క ఆఖరి పేజీలో/కొట్టకొస పంక్తిని కొట్టేస్తూ-"

మంచి నిమగ్నతతో మరణానికి ఈవలి సందర్భాన్నిచిత్రిస్తూ వచ్చిన కవిత ఇది.మంచి కవిత రందించిన నాగరాజు గారికి అభినందనలు.
                                                                                                     
                                                                                                                        _______ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి