పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

అన్నవరం దేవేందర్-గుడ్డీస్





ప్రతీ ఆటకీ,శాస్త్రానికీ,అంశానికి కొంత పరిభాష ఉంటుంది.ఇది అనేక కోణాలలో ఆప్రాంతంలో,వ్యక్తుల మధ్య వాడుకలో ఉంటుంది.ఆవ్యక్తులు,ప్రాంతాలు పరిసరాలు సంస్కృతి సంప్రదాయాలతో సంబంధంలేనివారికి ఈ పదజాలం దూరంగా ఉండవచ్చు.జలియ క్రిస్టీనాచెప్పిన అంతర్గతవచనం(Inter textuality)ఇలాంటిదే.

అన్నవరందేవేందర్ తెలంగాణాలో పల్లెప్రజలలో ఎక్కువగా అలవాటులో ఉన్న "పచ్చీస్"ఆటకు సంబంధించిన పరిభాషతో ఉద్యమ సందర్భాన్ని స్ఫురింపజేస్తూ రాసినకవిత"గుడ్డీస్".ఇందులోపచ్చీస్ ఆటలోని ఎత్తులు,పయ్యెత్తుల గురించి చెబుతున్నట్టుగా ఉంటుంది కానీ దాన్నానుకొని తను చెప్పాలనుకొన్న అంశాన్ని చెప్పడం ఇందులో కనిపిస్తుంది.

ఈదశాబ్దంలో తెలంగాణాఉద్యమం,దళిత బహుజన వాదాలు ప్రజావ్యవహారంలోని జీవద్భాషకు సాహిత్యంలో ఉనికిని తెచ్చాయి.
ఆయా జీవితాలు,సంస్కారం,సంప్రదాయాలు కవిత్వంలో అనేక మార్గాలలో ప్రతిఫలించాయి.

"పిడికిట్ల గవ్వల/గలగలా చప్పుళ్ళు
పచ్చీస్ ,తీస్ దస్సులతో/గడ గడలాడిస్తా"

"గడల మీద కూకున్నా/గడ్డ మీద నిలబడ్డా
గండం తప్పది "
మొదటి వాక్యంలో ఆట నడకని,రెండవవాక్యంలో ఉద్యమ సందర్భాన్ని నడుపటం ఇందులో కనిపిస్తుంది.ఇలంటిదాన్ని అనువర్తనగమనం అన్నారు.పై యూనిట్లలో రెండవ భాగంలో మూడు అంశాలున్నాయి.మొదటిది ఒక సందర్భాన్ని రెండవది మరో సందర్భాన్ని మూడవది ఈరెంటికీ సమన్వయమయ్యేలా ప్రవర్తిస్తుంది.

ఇందులో కొంత పరిభాషకూడ గమనించదగ్గది,పచ్చీస్>ఐదు గవ్వలు వెల్కల పడటం,తీస్>ఆరువెలకల పడటం,(ఇందులో మొత్తం గవ్వలు 7.ఒక్కో దానికి 5 పాయింట్లు లెక్కిస్తారు)దస్>ఒకటి వెల్కల పడటం.దూగ తీని,చారి లాంతివి అలాంటివే
.ఇవన్నీ పందాలు.ఈ క్రమంలోనూ ఉద్యమంలోనిధర్మంపట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు.

"గవ్వలు ధర్మం చెడలే/గౌరాంతం గడ దించుతాయి
సంకలమంటి సంబురమైనా/దూగ తీని చారీలే"
"పోరాట నేలలో పచ్చీస్ ఆటలో/నిన్ను ఓడ కొట్టేందుకు
సంపుడు పంజం పుట్టింది/పానషరం పట్టి అయినా గెలుస్తా"
గౌరాంతం,సంబురం,పానషరం లాంటి పదాలు తెలంగాణా భాషాసౌందర్యాన్ని చెబుతాయి.రెంటి మధ్య కవితలో అన్నవరం సాధించిన సమన్వయం గొప్పగా ఆకట్టుకొంటుంది.

తొవ్వ,నడక,మంకమ్మ తోట లేబర్ అడ్దా,బొడ్దుమల్లె చెట్టు,పొద్దుపొడుపు లాంటి సంపుటాలు అన్నవరం శైలికి ,దృష్టికి అద్దం పడుతాయి.అత్యంత సుకుమారంగా అన్నవరం జీవద్భాషని కవిత్వంలో ప్రదర్శిస్తాడు.వస్తువుతోనే కాదు భాషతోకూడా అన్నవరం విలక్షణంగా కనిపిస్తాడు.మంచి కవితని పంచుకున్నందుకు అన్నవరం దేవేందర్ గారికి అభినందనలు.


                                                                                                                             


                                                                                                                         













                                                                                                                                                                                                            _____ఎం.నారాయణ శర్మ
                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి