చాలాకాలం క్రితమే తెలుగులో అభివ్యక్తిమార్గం గట్టిపడింది.
అభ్యుదయ,విప్లవ కవిత్వాలు ఆతరువాత వచ్చిన అస్తిత్వోద్యమాలు తెలుగులో వస్తుసంబంధమైన ప్రపంచాన్ని సృష్టించాక అభివ్యక్తిని ఎక్కువగా గమనించే అవకాశం విమర్శకు కలగలేదు.
శ్రీకాంత్. కె గారు ఒక నూతనాభివ్యక్తితో కవిత్వం రాస్తున్నకవి.26.7.2013 న కవిసంగమంలో post చేసిన how we die మృత్యు సంబంధమైన కవిత.క్షణకాలంలో జరిగే సంఘటనని ప్రతీక,పదచిత్రాలతో నూతనమైన (తనదైన)వాక్య నిర్మాణాలతో రాసిన కవిత.
తెలుగులో కళా సౌందర్యాలను పుణికిపుచ్చుకున్న అనుభూతి కవిత,ఆ తరువాత పాశ్చాత్యసంప్రదాయరీతులతో వచ్చిన అధివాస్తవిక,వినిర్మాణ,అస్తిత్వవాద,అభివ్యక్తి వాద కవిత్వం శైలీ సంబంధంగా విప్లవాలు తెచ్చాయి.కె.శివారెడ్డి.మో లాంటివాళ్లు ఇలాంటి కవిత్వాన్ని అందించారు.
మృత్యువు అనే అంశం అస్తిత్వ వాద సంబంధమైంది.సింబలిస్ట్ లకు,సర్రియలిస్ట్ లకు మార్గదర్శకుడైన బోదలేర్ "మృత్యువు"కు సంబంధించి కవితలు రాసారు.19 శతాబ్దంలో జర్మన్ తత్వవేత్తలు ఇలాంటి అంశాలను చర్చించారు.తెలుగులోనూ మృత్యువుకు సంబంధించి అజంతా,మో, చిన వీర భద్రుడు,సీతారం లాంటి వాళ్లు ఈతరహా కవితలు రాసినవారిలో కనిపిస్తారు.శ్రీకాంత్ గారి కవితనుంచి ఇలాంటి కవితలకు సంబంధించిన కొన్నిలక్షణాలని,ఇతర అభివ్యక్తి రూపాలకు సంబంధించిన సారూప్యతలని కొంత అర్థం చేసుకోవచ్చు.
1.పదాల ఉనికి లో భేధాలు.కవి మానసిక వాతావరణానికి సంబంధించి ఆ అర్థాలలో ప్రవర్తించే పదాలు,వ్యక్తిగత జీవనం లోని పదాలు.జలియా క్రిస్టీనా ఇలాంటి వచనాన్ని అంతర్గత వచనం(inter textuality)అంది.
2.వాక్యరచన సాధారణ స్థాయికి మించి ఉండటం.సాధరణక్రమంలోని వాక్యాలు విరిగి మరోక్రమంలో అతుక్కుంటాయి.అదీ అర్థ ప్రవాహానికి దగ్గరగానే.
3.ఇతర భాషలకు సంబంధిచిన,విఙ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పదాల వాడకం.సాధారణ పాఠకుడికి ఈ పదాలతో కనీస సంబంధం లేక పోవటం వల్ల ఇవి ఎక్కువ ఙ్ఞానాన్ని అపేక్షిస్తాయి(కవి సంగమంలో శ్రీ మోదుగు వైద్య సంబంధ పరిభాషతో గతంలో ఓ కవిత రాసారు.అందులో కొన్ని పదాలను శ్రీకాంత్ గారు వివరించిన గుర్తు.)
4.ప్రతీకల వాడకం.ప్రతీకలను కళాతత్వ వేత్తలుసుమారు 16 రకాలుగా చెప్పినప్పటికీ నిర్మాణ దశలో 2 ఉన్నాయి1.సిద్ధ ప్రతీక2.సాధ్య ప్రతీక మొదటిది గతంలో ఇతరులు ఉపయోగించిన వాటిని ఉపయోగించటం.రెండవది కొత్తగా రూపొందించటం,సాధారణంగా ప్రతీకలసాధన ప్రత్యక్ష ,గుప్త,ఆరోప విలువలనే అంశాలకు దగ్గరగా జరుగుతుంది.మూడవదైన ఆరోప విలువ కవి ఆలోచనలమేరకు ప్రవర్తించేది.
"కుచ్చిళ్లు పారాడుకుంటూ తిరిగే చీకటి"ఇందులో ప్రతీక ఉంది.దాన్నుంచివాతావరణం లోకి తీసుకెళ్తారు.ఇక్కడ చీకటి దేనికి ప్రతీకో చెప్పనవసరం లేదు.
మరో కొనసాగింపులో వాక్యనిర్మాణాన్ని చూద్దాం.
"తెరచి ఉంచు కిటికి,లోపలికి
వచ్చేది ఏదీ ఉండదు నీలో,వెలుపలికి
వడుతూ అడగరు ఎవరు,నిన్ను"
ఈ వాక్యాలు సాధారణ స్థాయిలో "నీతో లోపలికి వచ్చేది ఏదీ ఉండదు./వెలుపలికి వెడుతూ నిన్ను ఎవరూ అడగరు" లా ఉంటాయి. వీటిని పంక్తుల్లో పేర్చడం లోనూ,పదాలను వాటి స్థానాల్లోంచితప్పించిచేర్చే క్రమంలోనూ వాక్యాలున్నయి.ఇవి అర్థ పరంగా తత్వాన్ని మోస్తున్నాయి
ప్రాణాలు పోతున్న సందర్భాన్ని చిరిచినాంశాన్ని గమనిద్దాం
"నీ చుట్టూ/రెక్కలు కొట్టుకుంటున్న/పావురాళ్ల /సవ్వడి"
ఇది ఓ చివరిదశని వ్యక్తం చేస్తుంది
"అవే/ నిశ్శబ్దం లోంచి లేచె పావురాలు,అనువాదం కాని కళ్లు"
చివరి వాక్యంలో తాత్వికంగా శరీర ధర్మాన్ని స్పర్శిస్తున్నారు.
"ఇక, లాంతరు వెలిగించలేక బావురుమంటూ/రాలిపోయింది"
దీపం పోయాక ఉత్తి లాంతరేం చేస్తుంది.మళ్లీ భౌతిక స్థితికి వచ్చి చెప్పిన రెండువాక్యాలతో కవిత ముగుస్తుంది.
"ఇక,నీలో ఒదిగి ఏడ్చే వక్షోజాలకి
రాత్రి కుంకుమ అంతినకన్నీరుకి
ఏంచెప్పగలవ్" ఈప్రశ్న తో కవిత ముగిసింది
అభివ్యక్తివాదం జీవితానుభవాన్ని,కళానుభవాన్ని సజాతీయాలుగా పరిగణిస్తుంది.క్రోచి ఈఅంశాన్ని ప్రతిపాదిస్తూ "కళాకారుదికుండే అతీంద్రియ ఙ్ఞానం వల్ల అభివ్యక్తి ఏర్పడుతుందని,తార్కిక ఙ్ఞానం వల్ల అది పరి పక్వమౌతుందని" అన్నాడు
ఉద్యమంగా అభివ్యక్తికళను ప్రపంచానికి పరిచయం చేసిన వాల్టర్ పేటర్ "వస్తువు వర్ణన అభివ్యక్తిలో నిమిత్తమేనని" అన్నాడు
ఇలాంటివి ఇంకా నేర్చుకోడానికి శ్రీకాంత్ గారి కవిత్వం పుస్తకం రూపంలో అందుబాతులో ఉందో,లేదో తెలీదు.కాని రెండు విషయాలు మాత్లాదుకోడానికి ఇలా అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు.యాకూబ్ గారికి కూడా..
-ఎం. నారయణ శర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి