గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత - 8 ----------------------------------------- త్రి'శూల' నొప్పి - - - - - - - - - - - - - - - - - - - - - - డా.దిలావర్ శవాల గుట్టలను పెళ్ళగించి సొంతగడ్డ మీదే మా పరాయితనం మూలాలను శోధిస్తూ కొత్తగా చరిత్రీకరిస్తున్నది త్రిశూలం! భారత శూన్యమాన కాలంలో యిప్పుడు త్రిశూలమే గడియారం ముల్లు! లలిత లతా గర్భంలోంచి రేకులు విప్పుకునే పువ్వు నాజూకు పుటకలోని మాధుర్యం ఒక అబ్బా అమ్మలకు పుట్టని పిశాచాలకేం తెలుస్తుంది? ఓ తల్లి కడుపులోని మబ్బుల పొత్తిళ్ళు చీల్చి నెత్తుటి నెలవంకలో దిగబడి మంటల్లోకి ఎగరేసి నరకడం త్రిశూలానికి తప్ప మనిషై పుట్టిన వాడికి చాతనయ్యే పనేనా? సర్వసంగ పరిత్యాగినని చెప్పుకునే ఉత్త ఇనప దిగంబరత్వానికి సిగ్గంటే ఏమిటో ఎవరు నేర్పారు? అమ్మకళ్ల ముందే ఓ బిడ్డ సిగ్గును వలువలు వలువలుగా వొలుస్తుంటే చితికిన మాంసం ముద్దయి ప్రాణాలు ఒంటినిండా కప్పుకున్న భయ విహ్వల శరీరాన్ని ఒక కామ కేంద్రంగా మాత్రమే చూస్తూ ఛిద్రమైన దేహంలోని ప్రాణాలను కూడా పొరలు పొరలుగా ఊడ బెరకడం త్రిశూలానికి తప్ప- సాధ్యమయ్యే పనేనా? ఈ కామ సముద్ర కెరటాల తాకిడికి బతుకు తీరంలో భయం భయంగా తలెత్తి చూస్తున్న ఎన్ని లేత గుజ్జన గూళ్ళు శిథిలమయ్యాయి? యిన్ని చేసి; ఎటైనా వెళ్ళేందుకు దేనికైనా ఓ ముఖమంటూ ఉండాలి కదా! త్రిశూలానికి ముఖమే లేదు చీలిన నాలుకలు తప్ప ! ఓ నాల్కతో 'విదేశాలకు ఏ మాస్కు పెట్టుకొని వెళ్ళాలి' అంటుంది మరో నాల్కతో కాషాయం రంగులేని ఓట్లతో పనిలేదంటుంది మరో నాల్కతో సబర్మతి రైలు యాత్రే మీ పరలోక యాత్రకు టిక్కెట్టు అంటుంది మెజారిటీ కాకులతో సక్రమంగా మెలగకుంటే ఒంటరి కోకిల కంఠం మీద ఖడ్గమై వ్రేళ్ళాడుతానంటుంది.. గాండ్రించే గాడ్సేలు రక్త వర్ఱంతో చిత్రిస్తున్న రామరాజ్యం నమూనాను దేశమంతా విస్తరించడానికి లైసెన్స్ దొరికినట్టేనని న్యూసెన్సు కూతలు కూస్తున్నది ఈ త్రి'శూల' నొప్పికి మందు కనుక్కోకపోతే వంద కోట్ల బిడ్డల కన్న తల్లి కూడా 'ఆత్మ' స్రావమై, అమ్మతనం కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లక తప్పదు (AZAAN -Poetry on Gujarat Genocide -2002)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcRIyg
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hcRIyg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి