శిలాలోలిత || మొగలిపువ్వూ- నంది వర్ధనం ----------------------------------------------- ఆమె ఒక నందివర్ధనం. నవ్వుతూ తుళ్ళుతూ పారే సెలయేరు. చదువుల పర్వతాలనధిరోహించిన ధీర వనిత.సంస్కారపు నదీ పాయల్ని చుట్టుకొన్న మెరుపుతీగ. అమ్మా నాన్నలు కలల గూడుకి తలుపులు తెరిచారు. నందివర్ధనానికి పెళ్లయింది. ఆమె ముందంతా సహచరత్వపు భవిష్యత్కాంతులే ! అతడు ఒక మొగలి పువ్వు. ఉత్సాహ ఉద్వేగాల కెరటాల హోరు.చదువుల ఋతువులన్నింటా మెరిసే ధీర హృదయుడు. అహంభావపు పొరలు కమ్ముకున్న సగటు మనిషి. 1 అమ్మానాన్నలు కలలగూడుకి తలుపులు తెరిచారు. మొగలి పువ్వుకీ పెళ్లయింది. అతడి ముందంతా ఆమెలో తానెలా నిరూపించుకోవాలనే. నందివర్ధనానికి కొత్తే. అన్నీ చెప్పిన అమ్మానాన్నలు అసలు విషయాలు తెరమరుగునుంచారు. 2 మొగలి పువ్వుకీ కొత్తే. మిత్రుల ముందు చర్చోపచర్చలు. ఓ మిత్రుడి చిటికెనవేలు పట్టుకొనివెళ్లి,శృంగార కవాట ద్వారాలు తెరిచాడు. నందివర్ధనానికి,మొగలిపువ్వుకీ మొదటి రాత్రి. ఆమెకంటే తానెంత ఆధిక్యుడో అన్నీ తెలిసిన మేధావో తెలపాలని అతనిలో తీవ్రకాంక్ష. 3 వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును,వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అసలు కధ అప్పుడే మొదలయింది. నాంది ప్రస్తావనలు ఐపోయాయి.విష్కంభ చర్యలు ముగిసాయి.భరతవాక్యం ఎదురైంది. ఆమెకు ,అతడికీ తెలీకుండానే క్రిమీకరణ ప్రవేశంతో ఖాళీశరీరంలో బ్రహ్మజెముడు మొలిచింది. ఆమెకివేమి తెలీకుండానే తల్లయింది, ఇంట్లోనే కాన్పయింది.అంతా బాగానే ఉంది. కానీ, కొన్నాళ్ళకు ‘బ్రహ్మజెముడు’ ముళ్ళను ఒళ్ళంతా రాసుకుని మొగలిరేకులతో యుద్ధానికి దిగింది. అప్పుడెప్పుడో కాలుజారినపుణ్యం కాస్తా ఫలవంతమైందని తెలిసే లోపు జ్ఞానం కొరవడింది. అది ఆమె నుంచే తనకు వచ్చిందనే పొగరుతో అనుమానపురంపాలతో ఆమెపై యుద్దాలు. తెల్ల బోయిన ఆమె తేరుకొనేలోపు ఛీత్కారాల చెత్తబుట్టలో విసిరేయబడింది. ఆమె కున్న అక్రమ సంబంధాల వల్లేనని ద్రోహలేఖను మరణవాంగ్మూలంలా రాసి ఉరి తాడును ఆశ్రయించింది మొగలి పువ్వు. కటకటాలవెనుక నందివర్ధనం.ఇదీ వీళ్ళిద్దరి జీవితం! 4 పెళ్లికి ముందే ,ప్రేమకు ముందే పరీక్షలు చేయించుకున్నా, అక్రమసంబంధాలవైపు చూడకున్నా,సరైన లైంగిక విజ్ఞానమున్నా,తొలినాళ్లలోనే చేయించుకున్నా ఈ రోజు.... నందివర్ధనం స్వచ్చంగానూ, మొగలిపువ్వు ముసిముసి నవ్వులతోను మనముందే ఉండేవారు నిరాశ కంటే ఆశ గొప్పది.’ఆశ’ చేరువున్న మనిషికి నిరాశ ఉండదు. విలువలు మనిషిని ఉన్నతాకాశంలో నిలబెడతాయి. ప్రలోభాలు మనిషిని పాతాళానికి దిగజార్చుతాయి. 5 మరణించాల్సినంత నేరాలు వాళ్ళేంచేసారు? మొగ్గలోనే రాలిపోకుండా నిలిచి వెలగాలంటే.... తల్లిదండ్రుల అవగాహనానేపధ్యంలో, సమాజ కరుణహస్తాలతో ‘ఆశను’ ప్రోది చేసి, రాలిపోతున్న సుమాలను మళ్ళీ బ్రతికించుకోవాలి. నందివర్ధనం తెల్లటి నవ్వుతోను, మొగలిపువ్వు పరిమళభరితంగానూ మనముందుండే రోజుకోసం స్వప్నిద్దాం. # [ఎయిడ్స్ డే సందర్భంగా >2008]
by ShilaLolitha Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSfDoS
Posted by Katta
by ShilaLolitha Poet
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSfDoS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి