"మల్లెపువ్వు" -- పసునూరు శ్రీధర్ బాబు ఒక మల్లెపువ్వు ఈ రాత్రి కిటికీలోంచి తారకలా వచ్చి పలకరించింది వెలుతురు భాషలో మాట్లాడుతూ నా కళ్ళల్లో కొన్ని మిణుగురుల్ని వెలిగించింది తెల్లని మౌనంలా సిగ్గుపడుతూ నా చెవుల్లోకి ఒక ప్రేమకవితను ఒంపింది ఒక ఇంధ్రధనుసు ఈ అర్థరాత్రిలో వెచ్చని పైట చెంగులా నా ముఖాన్ని నిమురుతూ వెళ్ళిపోయింది మల్లెపువ్వు నా భుజం మీద వాలి వెళ్ళిపోయిన కాలంలోని వెలిగిన క్షణాలను నా దోసిట్లో పోసింది రెక్కల గుర్రం మీద ఎవరో దేవకన్య నిరుటి జన్మ స్నేహంలా ఎదుట వాలింది పెదాల మీద తలకిందులుగా వాలిన మల్లెపూవు గుండెలో నలిగి మలిగిన పాత పాటనొకదాన్ని సన్నని తీగలా బయటకు లాగింది అది చీకటి కొలనులో వెన్నెల వలయాలుగా కంపించి కనుమరుగైంది అరిచేతిలో ప్రేయసి చుబుకంలా ఒదిగిన ఆ మల్లెపూవు నిశ్శబ్దం వెచ్చగా గుబాళించడమంటే ఏమిటో చూపించింది మౌనం ఎంత లయాత్మకంగా కల్లోలపరుస్తుందో అనుభవంలోకి తెచ్చింది ఆ మల్లెపూవును అలాగే గుప్పిట్లో దాచినప్పుడు ఆకాశమంత జ్ఞాపకం చల్లని దీపంలా నన్ను లోలోపల వెలిగించింది- దాన్ని కదిలిస్తే.. మువ్వల శబ్దం ఎద మీద హత్తుకుంటే... శంఖపు హోరు అది చీకట్లో తేలుతూ ఏకాంతంలోకి చొరబడుతుంటే నాలో తలుపులు తెరుచుకుంటున్న చప్పుడు- కుంటాల జలపాతంలా నేను నాలోకే దుముకుతున్నప్పుడు ఎగిరే నీటి నురగల మీద తుళ్ళిపడుతూ గంతులేస్తూ మురిసిన ఆ సిరిమల్లి మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోయింది- వీడ్కోలు గాయం చేయకుండా వెళ్ళిపోగల మహత్యం దానిది- ఈసారి వచ్చేటప్పుడు తన తోటనంతా తీసుకువస్తానంది అప్పుడు నక్షత్రాల ఆకాశం తలకిందులై నన్ను తన మీద నడిపిస్తుందేమో చూడాలి- *** (2-11 ఏప్రిల్ 2014)
by Sreedhar Babu Pasunuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwB0N0
Posted by Katta
by Sreedhar Babu Pasunuru
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwB0N0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి