ll ఎందుకో నీకింత నిర్దయ ll కాలానికైనా ఉంటుందేమో కాస్తంత దయ నిన్ను మాత్రం వెన్నంటే ఉంటుంది నిర్దయ వలచి వచ్చానని చులకన నీకు వెలివేస్తున్నావని వేదన నాకు ప్రేమిస్తూ నేను... ద్వేషిస్తూ నీవు విసిరేస్తూ నీవు ... విలపిస్తూ నేను అందరాని చందమామవే నీవని తెలిసినా నిన్నే ప్రేమించడం మానలేకున్నా విసిగి వేసారిన క్షణాన శిలగానే మిగిలిపోతున్నా అనుక్షణం నీకై తపించిన కాలమంతా అవమానాల ముళ్ళ బాటలనే పరిచావు కాలకూట విషాన్నే చిందించావు హృదయాన్ని చిధ్రం చేస్తూనే ఉన్నావు మనోవనంలో చివురించిన ఊహలన్నీ వాడి రాలిపోతున్నాయి పసిమొగ్గలుగానే నేలవరుగుతున్నాయి నిరాశల కొమ్మలుగా కన్నీటి ముత్యాలు విసుగు చెంది జారిపోతున్నాయి కనుల కొలనునుండి మనోసాగరంలోనికి ఎదలోని తేనెవాగులన్నీ తరలిపోతున్నాయి ఉప్పునీటి అలలు తాకని మరో ఆనంద సాగరానికి పెదవిదాటని పలుకులన్నీ పరుగులు తీస్తున్నాయి మది దాచిన మౌనాల గుప్పిట గుట్టు నీకు విప్పి చెప్పాలని గుండె చప్పుళ్ళలో దాచిన క్షణాలన్నీ నీ ప్రేమ వాకిట తెరవాలని తరలిపోయే ఋతువులన్నీ ఆశల విత్తులనే నాటి పోతున్నాయి సాగిపోతూ ఏరులన్నీ ఊరడిస్తున్నాయి నిరాశల కొమ్మన ఊగుతూ ఆశల పత్రాలెన్నో ఊరటనిస్తున్నాయి మారే నా కలల ఋతువులన్నిటా వసంత శోభలనే నింపుతావని నీ నిరీక్షణలోనే యుగాలుగా నిరీక్షిస్తున్నా . ... ll సిరి వడ్డే ll 13-04-2014
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPA3Aw
Posted by Katta
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kPA3Aw
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి