డా. రావి రంగారావు (అమృతంతో పోల్చలేను...) ప్రేమను అమృతంతో పోల్చి ఎంత తప్పు చేసానో... అమృత మంటే అందమైన అబద్ధం, అదో ఎన్నికల వాగ్దానం... అమృత మంటే కల, ప్రేమంటే గొప్ప కళ... ప్రాణ మూలా లైన నీటిని, పాలను, తేనెను, పంచదారను... అమృతంతో పోల్చి వాటి పరువు తీశాను, జీవనాధారాలకు నేనో పెద్ద తప్పు చేశాను... నీటిని నీటితోనే పోల్చాలి, పాలను పాలతోనే చెప్పాలి, తేనె అయినా, పంచదార అయినా ప్రేమ నయినా ఎలాంటి మానవ సుమగంధాల నయినా... వాటిని వాటితోనే పోల్చాలి, వాటి కవే సాటి, మరి దేనితోను లేదు వాటికి పోటీ... రాత్రంతా దిగంబరంగా దిగులులో తడిసిన వాడికి ఉదయం ఓదారుస్తూ ఇచ్చే ఎండ వస్త్రాన్ని అమృతంతో ఎలా పోల్చను! తనువంతా ప్రాణాలై అంతర్లీన మైన మహా పంచ శక్తుల్ని అమృతంతో పోల్చి ఎలా దోషం మూటకట్టుకోను! ప్రియురాలి దర్శనాన్ని వెన్నెలతో పోలుస్తా, హాయిగా ఉంటుంది... తల్లి పెట్టే గోరుముద్దల్ని చందమామతో పోలుస్తా, చల్లగా ఉంటుంది... అమృతంతో మాత్రం పోల్చను, అమాయకుల్ని మోసం చేయను... ఎందుకురా బాబూ, అమృతం అమృతం అని కలవరిస్తారు! పోలికలు వద్దని కాదు- నీరో, పాలో, నేలో, గాలో, నిప్పో, ఉప్పో... మీ భావాలను చిత్రించటానికి సత్యమైన పోలికల్ని తీసుకోండి! సత్య మైన వార్తకు సత్యం కన్నా గొప్ప లక్షణం ఏముంటుంది చెప్పండి! 14-04-2014
by Ravi Rangarao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwmJ2Z
Posted by Katta
by Ravi Rangarao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwmJ2Z
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి