కవిత్వంతో కరచాలనం-౩ అన్నం మెతుకు ఆత్మ కథ: జ్యూడీ జోర్డాన్ కవిత్వం ~ జీవితం ఆమెని ఎంత విసిగించిందో లెక్క లేదు! కాని, ఆమె జీవితాన్ని వొక్క క్షణమూ విసుక్కోలేదు. గత వారం రోజులుగా నేను జ్యూడీ జోర్డాన్ కవిత్వం చదువుతున్నాను. చదువుతూ చదువుతూ ఆమె ఇప్పటివరకూ గడిపిన జీవితాన్ని వొక్క వాక్యంలో ఎలా చెప్పాలి అని కూడా ఆలోచిస్తూ వున్నా. ఆమె జీవితాన్నంతా వొక్క సారిగా విహంగ వీక్షణం చేస్తే ఆ పై వాక్యం తట్టింది నాకు! అవును, ఎన్ని కష్టాలు పడింది ఈ కవయిత్రి! ఎవరన్నారో గుర్తు లేదు తెలుగులో – “ఏ ధాన్యపు గింజని చూసినా నాకు రైతు అస్తిపంజరమే కనిపిస్తుంది” అని! మన అనంతపురంలోనే కాదు, మనది ఎప్పటికీ కాలేని అమెరికాలో కూడా రైతు కథ అదే! అమెరికాలోని కేరోలినాలో వొక పూట తింటే ఇంకో పూట పస్తులుండే సన్నకారు కౌలు రైతు ఇంట్లో 1961లో పుట్టింది జ్యూడీ. ఆమెకి బాల్యం అంటే ఏమిటో తెలియదు, బాల్యం అంతా పొలాల్లో పని చేసింది. ఆమెకి యవ్వనం అనేదొకటి వుందని కూడా తెలీదు, యవ్వనమంతా వారాంతాలు రైతు సంతల్లో కూరగాయలు అమ్ముకోవడంతో గడిచిపోయింది. అయితే, చదువు వొక్కటే ఆమె ఎలాగోలా కొనసాగిస్తూ వచ్చింది. ఆ దరిద్రపు యవ్వనంలోనే ఎలా పడిందో ఆమె కవిత్వపు ప్రేమలో పడిపోయింది. “కవిత్వం రాయాలంటే చదువుకోవాలి,” అన్నది ఆమె మనసులో నాటుకుపోయింది. ఆ రైతు కుటుంబంలో కాలేజీ మెట్లు ఎక్కిన తొలి వ్యక్తి కూడా ఆమెనే! అదీ, సాహిత్యంలో డిగ్రీ తీసుకుంది. యూటా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తరవాత ఆమె ఇప్పుడు సదరన్ ఇల్లినాయ్ యూనివర్సిటీ లో ఫిక్షన్ పాఠాలు చెప్తోంది. జ్యూడీ కవిత్వం నిండా తను పుట్టి పెరిగిన పల్లె జీవితమే వినిపిస్తుంది. “ఆ పల్లె లేకుండా నేను లేను, అక్కడి రైతుల కన్నీళ్ళలో తడవకపోతే నేనిలా వుండే దాన్నే కాదు.” అంటుంది జ్యూడీ. సమకాలీన అమెరికన్ రైతు జీవితంలోని విషాదాన్ని జ్యూడీ కవితలుగా రాసింది. బహుశా, ఈ కోణం నించి కవిత్వం రాసిన వాళ్ళు అమెరికన్ కవిత్వంలో తక్కువగా వుంటారు. అమెరికా వచ్చిన కొత్తలో అంటే 2002 ఆ ప్రాంతంలో మొదటి సారి నేను జ్యూడీ జోర్డాన్ కవిత్వం విన్నాను. అనంతపురం నించి నేరుగా వచ్చిన వాణ్ని కాబట్టి ఆమె కవిత్వంలో బాధ నాకు కొత్తగా అనిపించలేదు. కాని, ఆమె కవిత్వం చెప్పే తీరు కొత్తగా అనిపించింది. వ్యవసాయ ప్రతీకలు ఆమె ప్రతి వాక్యంలోనూ కనిపిస్తాయి. అలాగే, పల్లె జీవితంలో వుండే కథనాత్మక ధోరణిని ఆమె కవిత్వంలోకి బాగా తీసుకువచ్చింది. ఆమె కవిత్వ ధోరణిని వాల్ట్ విట్మన్ తో పోలుస్తారు ఇక్కడి విమర్శకులు. ఆమె వాక్య నిర్మాణం కూడా వాల్ట్ విట్మన్ దీర్ఘ వాక్యాలని పోలి వుంటుంది. ఉదాహరణకి: because somewhere in North Carolina there was a house and in it, my room and my bed, bare boards and the blood stains of a man that in each slant rain’s worried whispers puddles to the cries of a slave, murdered in 1863 trying to escape. ఈ కవితని అర్థం చేసుకోవాలంటే ఆమె వూరి చరిత్ర తెలియాలి. రైతుల జీవితాల్లోకి ప్రవేశించిన ఆర్ధిక హింస గురించి తెలియాలి. అందుకే, ఆమె కవితలు narrative poems (కథనాత్మక కవితలు)గా అమెరికన్ కవిత్వంలో వొక ప్రయోగానికి నాంది పలికాయి. ఆ లక్షణం వాళ్ళనే, అచ్చయిన తొలి కవిత్వ పుస్తకం Carolina Ghost Woods కి తక్షణ గుర్తింపు లభించింది. ఎంత గుర్తింపు అంటే, వెంటనే అమెరికన్ జాతీయ రేడియో (national public radio) ఆమె ఇంటర్వ్యూని ప్రసారం చేసింది. స్థల విస్తరణ భీతి వల్ల ఆమె కథనాత్మక కవితల్ని నేను ఇక్కడ అనువాదం చేయలేకపోతున్నాను. కాని, కొన్ని పంక్తులు ఇలా వినండి: 1 అమ్మకి తెలీదనా, అన్నీ తెలుసు జీవితం అంతా కుదువ బెట్టి సాధించిన పొలం వేలం పాటలో ఎగిరిపోయింది ఎటో. ఇప్పటికీ ఆమె చెవుల్లో ఆ వేలం పాట ప్రతిధ్వనిస్తుంది. బ్యాంకు వాడి కాగితాల రెపరెపలు వినిపిస్తూనే వుంటాయి. ముడుచుకుపోతున్న కాంతిలో వొక్కో చెట్టునీ వదిలి వెళ్ళిపోతున్న సూర్యరశ్మిలో తడినేలలో కుళ్ళిపోయిన విత్తనాలు ఆమె చూపుల్లో ఇంకా మిగిలే వున్నాయి. ఆమెకి తెలుసు ఈ నేలలో ఇక కలుపు మొక్కలు కూడా పెరగవు అని! ఇన్నేసి బాధల మధ్య నన్ను ప్రేమగా హత్తుకుంటాయి చూడు అమ్మ చేతులు, అవి పూల చేతులు అనుకుంటున్నావా, కాదు, పిండిని కలుపుతూ ఆదరాబాదరా నా దాకా వచ్చిన చేతులు! 2 ఈ రాత్రి ఈ గడియారానికి అర్థమే లేదు నేను ఇంకా చిన్న పిల్లనే ఏ మెట్ల కిందనో నక్కి వుంటాను ఇవాళ ఎలాగైనా సరే చచ్చిపోవాలని వొక తుపాకి పట్టుకొని నాన్న అడివిలోకి వెళ్ళిపోయాడు. దూరం నించి వొకే వొక్క తుపాకి మోత వినిపించింది నాకు, అది అడివిలో ప్రతిధ్వని మా నిద్రల్ని చెరిపేసిన చప్పుడు. ఇక్కడేం కొత్త కాదు బతికేందుకు వొక్క కారణమూ కనిపించక ఎవరో వొకరు చస్తూనే వుంటారు. కాని, అనుకోకుండా వొక రోజు అడివిలోంచి నాన్న వెనక్కి వచ్చేశాడు. ఆత్రంగా నేను నాన్న చేతులు పట్టుకున్నాను ఆ చేతుల్లో ఇంకా ఆ ఆత్మహత్య యత్నం తాలూకూ వొణుకు అలానే వుంది. కాని, నాన్నని ఎప్పుడైనా అడగాలి చావు దాకా వెళ్లి మళ్ళీ జీవితాన్ని ఎలా గెల్చుకొచ్చావూ అని!
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lRmHmQ
Posted by Katta
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lRmHmQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి