పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

సాయి పద్మ || ఈద్ ముబారక్ ||

అందరికీ రంజాన్ ముబారక్..
మళ్ళా మీకు సమజ్ కాదేమోనని
హకీకత్ చెప్తున్నా..ఇప్పుడైతేనే వింటారని
బిగవట్టిన సాంస్ చుడాయించినట్టు
జర్రంత దిల్ బెట్టి ఇనండి

చార్ బజే కి లేచినా...
అంతంత రొట్టెలు ..మాంసం కూర చేసిన..
రోజా లో ఉన్నడు గందా మియా అందుకు
ఉమ్ము మింగరు, ఎంత మంచిగా జేస్తరో ఉపవాసం
తిట్లు కూడా గట్లనే మింగుతరు..
నెలంత అయిన౦క ఉయ్యాలి కదా..
ద్రాక్షలు, కర్జూరాలు తిని పిక్కల లెక్క ...

ఏనాడు కిక్కిరిసిన గదిలో..
అత్తరు వాసన మధ్య "కబూల్ హై" అన్నానో..
ఆ దినంలె నా కబ్ర్ నేనే తవ్వినట్టే
మూడోసారి నా కబూల్ వినే ఫుర్సత్ ఎవరికీ లేదు..
బాకీ జిందగీ నా చేతిలో లేదు..
అంతా ఖైరియత్ గనె ఉందంటారు అబ్బా, అమ్మీ
నాది ఖుష్ నసీబని దువా జేస్తరు మా వాళ్ళు
ఏమో నాకైతే ఎహ్సాస్ గాలే మరి....
ఖుషి అంటే ఏందో ?

షాదీఖానా నుండి దవాఖానకే
సీదా నడిచింది జిందగీ..
నా దిల్ దిమాగ్ ఫికర్ లేకుండా టుక్డా టుక్డా చేసి
కాళ్ళ మధ్య జన్నత్ చూపిస్తాననేవాడు నా మియా..
ఏమో నాకైతే నా బచ్చాల ఏడుపులే ఇనిపిస్తాయి
దెబ్బల వాతల మేహందీలకు తోడు..
ఖూబ్సూరత్ బీవీ లాయె౦గె అని దమ్కాయింపు
పోయినోళ్ళు పోగా బతికిన పోరగాండ్ల
బీమార్లు.. గోలీ సూదులతో చేశా దోస్తీ..

కభి కభి దావత్ల బిరియాని..
మరీ ఖుషి ఎక్కువైతే అత్తరు సీసా..
దేశాన పనికి పోతే...కొత్త సల్వారు..
రాత్రయినంక... మంచం ఒక కనబడని తల్వారు..
ఎన్ని రాత్రిల్లు పరేశానైనానో
ఆ పర్వర్దిగార్కే ఎరుక

సర్లే ..ఈ అఫ్సానా అంత మీకెందుకులే గాని..
మీ అందరికీ మల్ల రంజాన్ ముబారక్..
ఇఫ్తార్ల వక్త్ లోనన్న .. దఫ్తర్ల గోలల్లో నన్నా
పవిత్ర మాసాల్లోనన్న ..ఉమ్ర్ భర్
మీ గలీజంత భరిస్తున్న మీ బీవీల గురించి
మీ బేరెహెం పాదాల కింద నలిగే
చమన్ల గూర్చి , జర సోచాయించండ్రి
మల్ల ఏదో మంచి దినాన్న ఫుర్సతుంటే కలుస్త
మోజు తీరిందని నాకు ఖఫన్ కప్పకుంటే ...!!
ఖుదా హాఫీజ్!!!

--సాయి పద్మ

(ఎన్నో పవిత్ర దినాలు ..ఎంతో అపవిత్రమైన పరుష పద జాలాల్లో గడుపుతున్న బీవీలకు అంకితం.. )



*11-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి