పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఆగస్టు 2012, శనివారం

నంద కిశోర్ || సం-దేహం ||


నత్తల్ని,నావల్ని నడిపి
తీరానికి,దూరానికి తేడాలేదనీ
నవ్వుల్ని,నాణాల్ని తడిమి
ఈ రోజు,రేపు ఒకటికాదనీ

నదుల్ని,నాడుల్ని అడిగి
ఎంతపారినా ఎందుకో ఎండిపోతామనీ,
నక్షత్రాల్ని,నాగరికతల్ని చదివి
ఎంత వెలిగినా ఎప్పటికీ మిగల్లేమనీ

తమ్ముడు!ఒరేయ్!

సంపాదించిన జ్ఞానమంతా
ఎక్కడ పారేసుకున్నావ్?
ఏ మోహంతో, ఏ దేహంలో
తచ్చాడుతున్నావ్?

ప్రాణం ఇంకా మిగిలేఉన్నట్టు,
ప్రాప్తం ఏదో దొరుకునన్నట్టు,
కలల్తోటి,కధల్తోటి
కాలం జరుపుతూ

తమ్ముడు!ఒరేయ్!

ధమనులన్నీ మూసుకున్నాక,
తపనలన్నీ దారితప్పాక,
ఏ సిరలతో రక్తం తెస్తావ్?
ఏ సిరాతో కవితలు రాస్తావ్?



*10-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి