అప్పుడు నక్షత్రాల మద్య
ఉండేది నా నివాసం
తారలన్నీ తళుకు మంటూ
నన్ను పలకరించేవి
అప్పుడు ఆకాశం పైన
ఉండేది నా అంతరంగం
ఊహలన్నీ విశ్వంలోనే
విహరించేవి
అప్పటి నా నవ్వులకి
పువ్వులు విరగ బూసేవి
అంతరాంతరాల్లోంచి
ఆవిర్భావించేది ఆనందం
అప్పటి నా మనసుపొరల్లో
కన్నీటి జల లుండేవి
ఉద్వేగభరితమైన
ప్రతి దృశ్యము కదిపి కదిలించేది
అప్పుడు కోపంతో కందిన నా వదనంలో
సూర్యోదయపు అరుణిమ లుండేవి
"నేను" అన్న అహం
అణువణువునా నిండిఉండేది
అప్పటి నా ప్రేమప్రవాహానికి
ఆనకట్టలు తెగి పడేవి
ఉప్పెనలా పొంగుతూ
ఉక్కిరిబిక్కిరి చేసేది
ఇప్పుడూ నివసిస్తున్నాను
ట్యూబ్ లైట్ ల కృత్రిమ కాంతిలో
ఇప్పుడూ ఆలోచిస్తున్నాను
దూరంగా నిలబడి ప్రపంచం పోకడలు చూస్తూ
ఇప్పుడూ నవ్వుతున్నాను
సభ్యతా సంస్కారాల పెదవుల మద్య నుండి
ఇప్పుడు కూడా ఏడుస్తున్నాను
విషాదాన్ని ఆర్ధం చేసుకుంటూ, ఆరిందానయిపోతూ
ఇప్పుడూ ఆవేశపడుతున్నాను
అనువైన చోటా కాదా అని అంచనా వేసుకుంటూ
ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను
ప్రేమతత్వపు విశ్వ రూపాన్ని అణువంతయినా అర్ధంచేసుకోవాలని ఆశపడుతూ !!
*11-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి