అబ్బుర పరిచే
సొగసైన భవనం
ఆధునిక పరిజ్ఞానమంతా
రంగరించి పోతపోసిన
సాంకేతిక సౌందర్యం
కాంతి చిమ్ముతూ
రమ్మని కవ్విస్తుంటుంది
విస్తుగొలిపే వస్తుసంపదతో
స్వాగతం పలుకుతుంటుంది
నవ్యచలువరాతి మేడలో
ఆకర్షణీయంగా అమర్చబడిన
నిత్యావసర సరుకులన్నీ
ఫైవ్‌స్టార్ హోదాలో వెలిగిపోతుంటాయి
పప్పులూ ఉప్పులూ
బంగారం షాపులోని
అభరణాలకన్నా అందంగా
అలంకరించబడి ధీమాగా చూస్తుంటాయి.
కొత్తహోదాలో కూరగాయలన్నీ
ప్యాకింగ్ హంగులతో
తళతళ మెరుస్తుంటాయి
రూపం మార్చుకున్న
హైటెక్కు వంటింటి
సామాను వెర్రెక్కిస్తుంది
వాటిని అనుభవించలేని
జీవితం వ్యర్థం అన్న భావన
ఒక్కసారిగా ఉద్రేకపరుస్తుంది
నిగ్రహం కోల్పోయి
సందర్శ సామాన్యుడు
వస్తువును ముట్టుకుంటాడు
దాన్ని సొంతం చేసుకుంటే
వచ్చే సౌఖ్యాన్ని
అందంగా ఊహించుకోబోయి
అసాధ్యమైన పనని
సందేహంలో పడతాడు
బహిరంగంగా వేలాడుతున్న
ధరల ట్యాగ్‌ను
తాకలేక దానివైపు
దొంగచూపులు
చూస్తాడు
అద్దాల మేడ ఆర్భాటాలన్నీ
చెమటలు పట్టిస్తాయి
కింద తనకు అందుబాటులో
ఉండాల్సిన నిత్యావసరాలన్నీ
అందనంత ఎత్తునుండి
తనను గేలిచేస్తుంటే
ఏం చేయాలో తెలియక
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు
కొనలేని నిస్సహాయతను
ఏమార్చడానికి ప్రయత్నిస్తాడు
ఆధునాతన మ్యూజియాన్ని
సందర్శించినట్లుగా భావించి
కనీసం సందర్శనా భాగ్యం
కల్గించినందుకు ప్రజాస్వామ్య
ఔదార్యానికి ఓ నమస్కారం పెడతాడు
శక్తికి మించి ఎక్కడ
ఉద్రేకపడతానో అనుకుంటూ
కలవరపాటుతో
తక్షణం బయటపడతాడు
వస్తువులను
వంటికి హత్తుకున్న మాల్‌ను
వాటిని అందకుండా చేస్తున్న
కమాల్ సంగతిని ఆలోచిస్తూ
పరాకుగా ఆ సామాన్యుడు
ఇంటికి చేరుకుంటాడు.
*10-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి