తెలుసా? తుంపరే మేలి ముసుగు నీకు-
అయినా ఎలా దాచగలవు నువ్వు
పచ్చిక మాటున దాగి నక్కి నక్కి
చూసే తెల్లటి కుందేలుని? దానిని
నేను జాబిలి అనే
నీ చల్లటి ముఖం
అనే పిలుస్తాను నిస్సిగ్గుగా, నిర్భీతిగా - చూడూ
నా వేళ్ళ అంచులతో
నీ శిరోజాలపై రాలిన
మంచుపూలను తొలగించిననాడు, చుట్టూతా
లేత పుదీనా వనాల
పురాస్మృతుల పొగ
ఎలా కమ్మగా కమ్ముకుందో! అయినా తప్పేముంది?
అలాంటి వలయ ధూప శిఖరాలని నేను
నీ తనువు అనే నీ వక్షోజాలనే పిలుస్తాను
ఈ ఆలయ ప్రాంగణంలో అ/పవిత్రుడనై- చూడూ
యిక అప్పటికీ, ఇప్పటికీ ఈ నా ఛాతిలో
ఒక నల్ల చేప పిల్ల మెసులుతూనే ఉంది
నువ్వు వొద్దనుకున్న
ఆ తూనీగ రెక్కలతో.
చెప్పు ఏం చేద్దామిక
ఈ సరస్సుల ఒడ్డున కూర్చుని
వల వేసి ఆగి ఉన్న దాగి ఉన్న
సన్నటి ఈల పాటతో వాన సాంద్రతనీ సూర్యకాంతినీ కొలుస్తున్న
ఒంటరి బాహువుల రాతి పూవుల ఆదిమ బహిష్కృతుడినీ ఒక
పసి పెదాల రోదనై వేచి ఉన్న కవినీ?
*09-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి