కాలం గావుకేక పెట్టింది
వాన వెలసి నీరెండలో చిమ్మచీకటి
దగ్దమైన హృదయాన్ని ఆర్పే
ఒక్క బాష్పబిందువూ లేదు
తేజో వలయాలన్నీ
విద్యుదాఘాతానికి గురై
కాలిపోతూ వాలిపోతూ
సంజకెంజాయ రంగులన్నీ
కంటిపాప చుట్టూ దుఃఖఛాయలై:
కాలం ఈసారి చావుకేక పెట్టింది
చీకటి వొడిలో వెలుతురు గాఢనిద్ర
అంతర్ బహిర్ వేదనలు
ఒట్టిపోయిన రిజర్వాయర్‌లో
రెండు ఎండిపోయిన కన్నీటి చారికలు
ఒకటి నాది
ఒకటి ఆమెది
చెడిపోయిన గడియారం ముల్లుకు
గుచ్చుకున్న కాయితప్పడవ
క్షార జలధుల్ని తోడుతోంది
అసంబద్ధ కలల్ని పొడుచుకుతిన్న తీతువు పిట్ట
వేకువ జామునే ఎగిరిపోయింది
ఒత్తిగిలి పడుకున్నా
వెన్నులో నాటుకున్న తుమ్మముల్లు
ఇంకా బయటకి రాలేదు
సారూ.. లో జ్వరం
కాలం ఈసారి సుప్తచేతనావస్థలో పడివుంది
బిచ్చగాడి చేతిలో ఏక్‌తార
వంద సంపుటాల దుఃఖం
దమ్మిడీ రాలేదు రొఖ్ఖం
కాలం క్రమంగా నేలమాళిగలోకి జారుకుంది
తవ్వుతున్న శిలల్లో
ఖండిత మాంసపు ముద్దలు
మృత్యుపరాగ రేణువుల్లో
ఏనాటిదో మోహపు దుర్వాసన
యుద్ధంలో అలసిపోయిన ఖడ్గాలన్నీ
ఆశ్రమగీతాలు పాడుకుంటున్నాయి
ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిందని
ఫ్లాట్‌ఫారం మీద
బక్కచిక్కిన అస్తిపంజరం
కుప్పకూలిపోయింది
మూలుగులోంచి మూలుగు
సారూ.. ఈ జ్వరం తగ్గేటట్టు లేదు
కాలం మళ్లీ గాడిన పడేదెన్నడో!
*09-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి