నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
అసలే నాది అంధుని పాత్ర
అందులోను అమావాస్య రేయిలో
లైటారిపోయినప్పటి సీను
నిజంగానే తడుము కోవాల్సిన పరిస్థితిలో
అప్పుడు నేను జీవిస్తున్నానని ఎరుగని ఆడియన్స్
నా నటన చూసి ఎన్నెన్ని కామెంట్స్
వాళ్ళకెలా చెప్పాలి అది నాటకమని
నా పాత్రే ఒక బూటకమని
నా నాటకానికి తెర తీసారే గాని
వేయడం మానేసారు
ఇదేం రక్తి కడుతుందని ఇంకా
ఇలాగే చూస్తున్నారు
నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
తెరవెనక్కి పారిపోతే పిరికి వాడని అంటారు
రంగాన్నంతాపీకి పోతే పిచ్చివాడని అంటారు
ఇంకా అలాగే నిలబడితే చచ్చిపోడేమని అంటారు
రావడమైతే రంగం మీదికొచ్చాను గాని
మధ్యలో డైలాగ్స్ అన్నీ మరచిపోయాను
నోటికొచ్చింది పేలుతున్నానే గాని
’అసలు యాక్షన్’ చేయడం మానేసాను
కప్పగంతులు వేస్తున్నాను
కుప్పిగెంతులు వేస్తున్నాను
నవ్వుతున్నారు లెమ్మని
ఇంకా నవ్వుకొమ్మని
నీతులు మాట్లాడ్డం మానేసి బూతులనే మాట్లాడుతున్నాను
కాళ్ళతో నడవడం వదిలేసి చేతులతో నడుస్తున్నాను
నువ్ బఫూన్ వి కావని డైరక్టర్ చెప్పడు
నువ్వే హీరోవని ప్రామ్టరూ చెప్పడు
వాళ్ళకు మాట పడిపోయింది కామోసు
మరి నాకే చెవుడొచ్చింది కావచ్చు
ప్చ్! నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
హుమ్!!ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
నాలోని మరోమనిషికి ఇవ్వేం పట్టవ్
ఆ’మరమనిషికి’ నావేం గిట్టవ్
“ ఒరే నువ్వున్నది అథః పాతాళం
చేరాలనుకునేది గగనాంతరాళం
ఎందుకురా ఎప్పుడూ అదే ధ్యాస
ఎందుకురా ఈ వృధా ప్రయాస
తెల్ల కాగితాన్ని పిచ్చిగీతలతో ఎందుకురా పాడుచేస్తావ్
ఎవరూ అర్థం చేసుకోని భాషలో ఎందుకురా నీ గోడు రాస్తావ్
నువ్వనుకుంటున్నావ్ అది కళాఖండమని
నువ్వనుకుంటున్నావ్ అది ఘనకార్యమని
అసలూ ఎందుకు నటిస్తావ్ “ అని నేనంటే
“అయినా ఏం సాధిస్తావ్ “అని నే అన్నది వింటే
నాలోని మరో వాడు పరమ కౄరుడు-
“నటించడం నా జన్మ హక్కు” అంటాడు
“అయినా నటిస్తే ఏం తప్పు” అంటాడు
“ నీతిగా బ్రతికితే గోతిలోకి తోస్తారా”
చిరు నవ్వు నవ్వితే ఉరిశిక్ష వేస్తారా “
అనేదే వాడి వాదన-ఆవేదన
“ నటించు కాకపోతే నగ్నంగా నర్తించు
ఇదే పాత్రలో ఇదే స్టేజీపై ఈ ప్రేక్షకులముందే ఎందుకు నటిస్తావ్
నీ నటనకి ఆస్కార్ అవార్డ్ రావాలని వెర్రిగా ఎందుకు ఆశిస్తావ్-“
నేనంటే పడని అసమర్థుడు నా మాటే వినని దరిద్రుడు అన్నాడూ-
“ ఏంచేస్తాం నా ఖర్మ ఇలాగే కాలిపోయింది
దొరక్కదొరక్క నాకిదే దాపురించింది
ఏది ఏమన్నా నా నటన దీనికే అంకితమైంది
ఐనా
“తప్పుని తప్పు “ అన్నవాడిని తప్పుగా అనడమేగాని”
’ఒప్పుని ఒప్పు’అని ఒప్పుకున్న వాడేడిరా “అని
వాడి మాటలూ కొంత సబబు అనిపించాయి
వాడి బాధలో కొత్త సత్యాలు తోచాయి
“ ఎవరి కోసం నటిస్తున్నావో గాని
చూడాల్సిన వాళ్ళు చూసి హర్షిస్తున్నారో లేదో గాని
గోటితో పోయేదానికి గొడ్దలి ఉపయోగించడం తో
మాటతో పోయేదానికి మనిషిని బలిచేయడం తో
నడమంత్రపువాళ్ళవల్ల నగుబాటు కావాల్సి వచ్చింది
చేయని నేరానికి శిక్షపొందల్సి వచ్చింది
అయినా ఎందుకురా అందని దానికోసం అర్రులు చాస్తావ్
ఎందుకురా ఆకాశానికి నిచ్చెన వేస్తావ్
ఇవతలి వాళ్ల ప్రణాలు అనవసరంగా ఎందుకు తీస్తావ్
అనుక్షణం అవమానంతో కుమిలి కుమిలి ఎందుకు ఛస్తావ్
అసలు ఎందుకీ అనర్థపు తపన
అవును ఎందుకీ అనవసరపు మదన
ఒరే ఎందుకీ అంతర్గత రోదన
ఇంకా ఎందుకీ అనంత కాల వేదన “”
అప్పుడన్నాడు ఏమి తెయని మా మూఢుడు
ఒప్పుకున్నాడు అన్ని తెలిసిన ఈ మూర్ఖుడు
“ ఎలా బయట పడాలిరా ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను
ఏలా ఏడవాలిరా నే ఎక్కిన కొమ్మనే నరుక్కున్నాను
ఇప్పుడేంచేయాలిరా నా నాలుక నేనే కొరుక్కున్నాను
ఆడే వాణ్ణి ఓడి పోయాను
ఆడించేవాడూ వీడి పోయాడు
అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం
అవును పునాది కూలాక మేడలు కట్టుకోలేం
కాని ఈ ప్రేక్షకులకు
చక్షువు నోరుతో వీక్షణ కోరతో
దృశ్యాన్ని తాగుతూ పైశాచికానందం పొందే భక్షకులకు
ఇదంతా చూసి విసుగు రావడం లేదూ
ఇందులో ఏదో గందరగోళం జరిగిందని తోచడం లేదూ...
అందుకా మాటల రాళ్ళు రువ్వుతున్నారు
అందుకే చూపుల బాకులు దువ్వుతున్నారు
నా నటన చూసి హా హా కారాలు
నన్ను చూసి హుంకారాలు ఛీత్కారాలు
నా నాటకం పేరే “ ఓటమి “ కదూ
దాని రచయిత మాత్రం రాముడో కృష్ణుడో కాదు
వాడు అసలైన అసమర్థుడు వ్యర్థుడు
ప్రియమైన ప్రేక్షకులారా ఇంత తెలిసాక
ఎందుకు మీరు వెళ్ళడం లేదు
నరమాంస భక్షకులారా వాన కురిసాక
ఎందుకు తెర వెయ్యడం లేదు
ఓ సూత్రధారీ ! నువ్వైనా చెప్పేడు
ఈ రంగానికి మలుపు ఎప్పుడు?
నా నాటకానికి ముగింపు ఎన్నడు???
*11-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి