పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

రేణుక అయోల॥హరిత శ్వాస॥

చిన్నవిత్తనం తెల్లమబ్బులా తేలుతూ

అలవోకగా వనంలోకి వచ్చి పడింది

మట్టితడిలో ఊపిరిపీల్చుకుంది

భూమిని ముద్దాడిన గింజ
ఫలాన్ని ప్రసాదించింది
మనిషిని అక్కున చేర్చుకునే చెట్టుకోసం
సర్వం సిద్ధం చేసుకుంది

చెట్టు తన ఊపిరితో
మనిషికి ప్రతిక్షణమూ ఆలంబన అవుతోంది
అడుగులు తడబడిన మనిషి
వృక్షం నీడలో సేదతీరితే
తన ప్రతిబింబాన్ని తానే చూసుకున్నట్లు
తృప్తిపడుతుంది చెట్టు!

***

సమూహంతో సాగిపోతున్నమనిషి
అనేక సందర్భాల సమాహారం.

ప్రతి సందర్బానికి కదలిపోవడం
కదలి కదలి కన్నీరై ప్రవహించడం
కలతల్ని కావేషాలని మోస్తూ
పెనుగులాటలే ఊపిరులై ద్వేషాలతో రగిలే మనిషికి

నీడల చల్లదనంలోంచి
పక్షి గానాల మాధుర్యంలోంచి
ఫలాల తీపిదనంలోంచి
సందేశమేదో అందిస్తూనే ఉంటుంది చెట్టు!

తల్లిఒడి వెచ్చదనపు జ్ఞాపకం లాంటి చెట్టు
కరిగిపోతున్నజీవితానికి రాలుతున్న ఆకుల్ని
ప్రతీకలుగా చూపుతుంది.

ప్రతి పోలికలోను మనిషి ,చెట్టును పోలుతాడు

ప్రాణవంతమైన హరిత శ్వాసతో
ఇక మనిషి చెట్టులా మారడం కోసమే
ఇన్ని రుతువులూ ఎదురు చూస్తూనే ఉన్నాయి.
*7.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి