" చేదు సుఖం "
-------------------
డియర్ "స్కైలార్క్" !
గాలి తోడవక పోతే
మేఘం కురవదట
ఎంత కదిలితే నేమి
ఓ సారి కురిసింతర్వాత
చూపులు తప్పుకున్నప్పుడే
గుండెలు నీరై పారాయి
డాలు కత్తిలో గుచ్చుకున్నటనిపించి
ధీరత్వం మాట పడిపోయింది
అయినా మనసు కొడిగట్టి
అట్టా చాల కాలం ఉందిగా
గువ్వ ఎగిరిన తర్వాత తెలిసింది
గూడు కూలిన సంగతి
కళ్ళు తెరుచుకోగానే
కలల నిండా కళ్ళాపి
అప్పుడేగదూ 70 ఎం. ఎం.లో
సప్త సముద్రాలూ
ఎగసిపడిందీ,
వరుసగా జ్వాలముఖిలన్నీ
పేలిపొయిందీ
కోప్పడకులే
నీ మనసు నాగ్గాక
ఇంకెవరికి తెలుసు?
ఈ పాడు లోకపు అల్లిబిల్లి తీగల చిక్కులు
నువ్వూ నేనూ విప్పగలమా?
ప్రయత్నిస్తే పోయేదేమీ లేకపోయినా
ఒరిగేదేమీ లేదుగా
నీవన్నీ నీదగ్గరే వున్నాయి
ఒక్క నువ్వు తప్ప
వున్నవి పంచి పారేయడానికి
ఆ అవిటి తీగలు తెగితే గదా?
కాలచక్రాల ఆకులు
కదిలిస్తే కదిలేవి కావుగా !
కలికాలపు గాయాలు
టించరు అయొడిన్ వేస్తే పోవు
పైగా బొబ్బల్లేస్తాయి జ్ఞాపకాల వలల్లా
వాటికి సిoహమూ చిట్టెలుకా అన్నీ ఒక్కటే
ఎవరూ ఎవరినీ కాపాడలేరు
నాకూ తెలుసు
బయటపడితే కలిగే మేలుకంటే
అందులోని చేదు సుఖమే
హాయి గా ఉంటుందని
*7.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి