ఉన్నట్టుండీ
ఎక్కడో ఏమూలో ఓ చిన్న మెలిక
ఇంకా అసలు మనసు మాటల్లోకి అనువదించలేదన్న
చిరు దిగులు
ఎన్ని శిశిరాలు, ఎన్ని వసంతాలు,
ఎన్ని చూపుల హేమంతపుటనునయాలు
మరెన్ని నిట్టూర్పుల వేసవి వడగాల్పులు
ఎన్ని గ్రీష్మాల అలల ఆటుపోట్లు
ఇలా ఒకరి మనసుల్లో ఒకరు
ఎన్ని మాటల పుటలు మడతలు మడతలుగా
పొరలు పొరలుగా పేరుకు పోయిన
పెదవి కదలని సంభాషణలు.
ఎన్ని రాత్రులు పాలిపోయి అవాక్కయిన వెన్నెలా
చెక్కిన పెన్సిల్ ముక్కల్లా అరిగిపోయిన చుక్కలూ
తెల్లమొహలేసుకుని తొంగి తొంగి చూసే
కళ్ళనిండా అసహనం అసూయను
కుండపోతగా గుమ్మరించలేదూ?
అయినా ఎక్కడో ఏ మూలో ఒక చిన్న సందేహపు మసక
గుండె లోలోతుల్లో దాచుకున్న ఒక్క ముక్కకయినా
ఇంకా రెక్కలు మొలవలేదేమోనని..
బాల్యం గుమ్మంలో
చీకట్లు వీడని ఉదయ సంధ్య మసకవెలుతురులో
రాలిన పున్నాగల పరిమళాలు కలసి ఏరుకున్న క్షణాలు
ఎన్ని వ్యక్తీకరణలకు సరితూగుతాయి్?
మరక పడని కాన్వస్ మీద
ఎన్ని సాయం సంధ్యల రంగుల కలయిక
నిరంతరం సాగే రాగాల చిత్రీకరణ
ఎన్ని మనసు విప్పని ఊసులకు ప్రతిరూపం?
అయినా నా దిగులే కాని
నీ లోలోపలి ప్రవాహాల కెరటపు రెక్కను నేనయాక
ఏం చెప్పను కొత్తగా.........
*7.7,2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి