పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

జగద్ధాత్రి-కవిత

పుట్టుక ...

హృదయం లో భావ విస్ఫోటనం
జరిగి అక్షరాల లావా
తనకు తనే పొంగి పోరిలే దాకా
ఆగాలి తప్ప .... వేగిర పడకూడదు
ఎరువులూ మందులూ
ధాతు పుష్టీ వీర్య పుష్టీ
కలిగించగలవేమో గానీ
కవిత బీజాన్ని ఫలదీకరించలేవు

భావ సాంద్రత ఉండీ కూడా
పలకలేని భావనలెన్నో
ఇవి కనిపించని గాయాల్లా
ఎదను సలుపుతూనే ఉంటాయ్
కౌకు దెబ్బల్లా
మదిని మెలి పెడుతూనే ఉంటాయ్
మగటిమి ఉండీ ఫలించని
వీర్యంలా సిగ్గిల జేస్తాయి
అయినా అక్షరాలుగా
మాత్రం మారకుండా
మొరాయిస్తాయ్
అప్పుడు కావాలి
కవికి చాలా సహనం
ఎద బురద నీటి బుగ్గ వద్ద
కూర్చుని ....ఎదురుచుసీ ...చూసీ
గజిబిజి గందర గోళం
సద్దు మణిగాకా...
ఆ సమయం ఆసన్నమైనప్పుడు
నిర్మలంగా స్ఫటికం లా
మెరుస్తూ వచ్చే
అందమైన మత్స్య కన్యల్లాంటి
భావ చిత్రాలని
అతి సున్నితంగా
ఒడిసి పట్టి .... తనదైన శైలి దారం తో
మాల కట్టి నప్పుడు ...

అబ్బా!!! అప్పుడు జరుగుతుంది
ఒక సృష్టి ....కార్యం
కొత్తగా ఓ కవిత బిడ్డ
కవి బొడ్డు తాడు తెంచుకుని
కేర్ మంటుంది .....
ఏమాత్రం ఆవేశపడి
తొందర పడ్డామా
బిడ్డ అడ్డం తిరిగుతుంది
పెద్దాపరేషన్ కి కూడా
లొంగని పుట్టుక ఒక్క కవిత దే...!
అందుకే అంత సహజ సుందరంగా
అమూల్యంగా రూపు దాల్చి
అందరి మన్ననలు పొందుతుంది
కన్న కవి కడుపు పంటగా మిగులుతుంది .....!!!
*2.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి