పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

వంశీధర్ రెడ్డి- కవిత

* అమ్మ పోయింది *

శుక్రవారం,
సూర్యుడింకా రాకముందే,
అమ్మ, నిద్రలోనే, నిద్రించి..

అన్నీ నాతో చెప్పే అమ్మ,
ఇదెందుకు చెప్పలేదో,
ఎప్పుడొస్తావని నేనడుగుతాననేమో,

ఊరిచివర నిశ్శబ్దీకరించబడ్డ ఇల్లు,
కాకులు చేరిన మర్రిచెట్టులా
చుట్టాల్తో, హితుల్తో,
వాళ్ళేడుస్తూ నన్నేడిపించ ప్రయత్నిస్తూ,
అమ్మ చెప్పేది,,
"నేను పోతే ఏడవొద్దురా,
మనింట్లొనే పుడతాగా అని,
బాధకి కొలమానం కన్నీరు కాదని,
ఓదార్పుకి స్థిరరూపం బంధుమిత్రులు కాలేరని",

అందరూ తింటూ తాగుతూ,
ఇక్కడొకరు నిర్యాణించారని మరిచి,

సూర్యాస్తమయానికి సమీపించిన్నా నీడ,
నా తమ్ముడు,
"అనా, ఏమన్న తిన్నవా, తెస్తా ఉండు"
కళ్ళు కొలనులై,
అమ్మ లేదని తెలిసాక
నన్ను, నా ఆకలిని తాకిన తొలి మాటకి
ఆనందానికీ కొలత కన్నీరు కాదేమో,

" అన్నా,
ఎంతకాలమిలా తన గురించాలోచిస్తూ,
పెళ్ళి చేస్కోకుండా,
అమ్మ కూడా లేదిపుడు"
గొంతులో జీర ఆగలేదు,
"అన్నా,
వింటున్నావా, కర్మ జరిపించా,
పదకొండో రోజొస్తా,
లీవ్ దొరకలేదే, నువ్ జాగర్త"
తడి కళ్ళలో నిజాయితీ దాగలేదు,

కాకులెగిరిపోయాయ్ చీకటికి,
ప్రాకృతిక మౌనం తోడైంది,
ఈ పాటికి అమ్ముంటే,

ఏడవడం తెలీకుండా పెంచి,
తెలీకుండా నవ్వడమొకటే పంచి,
అమ్మ పోయింది,
నువ్వున్నా బావుండేదేమో,
ఎక్కడున్నావో,
ఎలా ఉన్నావో...
*4.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి