పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, జులై 2012, శనివారం

జిలుకర శ్రీనివాస్ - కవిత

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే

రాయాలని కూర్చున్న ప్రతిసారి వాక్యం విరిగిపొతుంది
నీ మాటల వేటుకు తెగిపడిన శత్రు స్వరంలా

కోపంతో నీకు చెప్పాపెట్టకుండా
ఇంట్లోంచి పారిపోయిన పిలగానిలా ఎటో వెళ్ళిపోవాలని బయల్దేర్తాను
తీరా చూస్తానా! నీ ముందే తచ్చాడుతూ పిల్లిలా కాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటాను

వీధులు తిరుగుతూ భుజాల చివర ఒడుపుగా తప్పుకపోయే రంగుల చిలుకల్ని చూసి
లోకం ఇంత వికారంగా మారిందేమిటా అనుకుంటానా
ఒంటరి గదిలో గోడకు వెళ్ళాడే నీ నవ్వుల చిత్ర లేఖనం చూసి
ఈ ప్రపంచం ఇంత సుందరంగా నీ వల్లే వర్ధిల్లుతుందని బోధపర్చుకుంటాను

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే
ఎన్నోసార్లు ముక్కలు ముక్కలుగా నిన్ను విరుచుకొని లెక్కలేనన్ని అర్థాలుగా తెరుచుకున్నావు
ఒక్కోరోజు అర్థం కాని శూన్య శబ్దానివి నువ్వు!
*6.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి