పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

31, జులై 2012, మంగళవారం

స్వాతి శ్రీపాద || మాట వినని ||

మసక బారిన నిన్నటికన్నీటి కలబోత మంచు దారిన
చినుకులై రాలిన తేనె వాకల వాడిన సుమదళాల్లో
తడబడే అడుగులతో మళ్ళీ మరోసారితచ్చాడాలనిఉంది
ఏమూలో ఘనీభవించిన మాటల పారిజాతాల పరిమళాన్నీ
వెలిగి వెలిగి గుప్పించిన వలపు అగరు పొగల సమ్మోహనాన్నీ
మళ్ళీ మరోసారి మనసారా కుతి తీరా గుండెలనిండా నింపుకోవాలనుంది

ఎప్పుడో పంచుకున్న పగటి కలల వెలుగులు
మరచిపోయిన కళ్లకు కాటుకలా అలదుకోవాలనుంది
శీత వేళ కోసం దాచుకున్న వెచ్చని స్వప్నాల
వేడి దుప్పటినోసారి దులిపి ఈ నడి వేసవిలోనూ కప్పుకోవాలనుంది

అయినా గతానికి బానిసై పట్టుకోల్పోయిన ఈ క్షణం
తలపుల పక్షవాతపు గుప్పిట్లో చిక్కి మాటవింటేగా?

ఏకాంతపు కిటికీ రెక్కలపై వాలి పలకరించే
జంటకోయిలల కుహూ కుహూ రవాల్లో
మధురిమనై విస్తరించాలనుంది
అనంతమైన నీలిమలో పొర్లాడే ఆకాశపు హద్దుల్లో
విరజిమ్మిన హరివిల్లు గమకాల్లో కుతూహలాన్నై
కంగారుగా పరుగులు తీసే గాలి గుసగుసల్లో సేదదీరలనుంది.
*31-07-2012

కాశీరాజు || A GRAND WELCOME ||

పుష్పకవిమానం దిగిన దేవేంద్రున్ని సూసినట్టు
బస్సు దిగ్గానే నన్ను సూస్తూ తన రెండు చక్రాలరదానికి స్టాండేసాడు మా నాన్న.
బుజాన వేలాడుతున్న బ్యాగ్ తీసి సైకిల్ మీద పెట్టుకుంటూ
పయానం బాగాసాగిందా?
రైల్లో సీటు కుదిరిందా లేదా?
సరిగా తినడంలేదేటి సిక్కిపోయావ్? అడుగుతూనే ఉన్నాడు
ప్రశ్నలు పూర్తికాకుండానే
సమాదానాల సర్వీస్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను
ఇన్స్టాలేషన్ ఎర్రర్ లాగ ఎవడో ఎనకాల టింగు టింగుమని బెల్లు మోగిస్తున్నాడు
ఇక్కడేఉండరా ఇంటికెల్లి ఈ పిండిమూట,నీ బేగ్గు పడేసి మల్లొచ్చి తీసుకెల్తానని ఎల్లాడు
సరేనని పెత్తాతకొట్టుకాడ ఓ సల్లని సోడాతాగి,సెక్క బల్లపై కుచ్చున్నాను
ఇంటికెల్లిన పెద్ద మనిసి అరగంటైనా తిరిగిరాట్లేదు.
ఇకనేనె మెల్లగా నడిసెల్లిపోదామని,కాలవగట్టమ్మటా నడకలంకించుకున్నాను
పక్కన కొత్తనీట్లో తేలుతున్న అంటిబొందమీద
తలకాయూపుతూ బురదపామొకటి నాలుకబయటకు తీసి నన్నెక్కిరిస్తుంది.
ఇంకోపక్క దమ్ముసేల్లోన్ని అమ్మలంతా
కచ్చాపేసుకుని క్రమశిక్షణేదో నాటుతున్నారు
ఎలా సూసిందో ఓ సక్కనమ్మ
ఏరా అల్లుడా బోగున్నావా?
ఇదేనా రాడాం? బాగా సిక్కిపోయావేట్రా? ఆగడంలేదింక.
బాగున్నను బాప్ప! మాయెలా వున్నాడు? తప్పదన్నట్టడిగాను
అంతాబోగున్నార్రా! సరేలే ఇంటికెల్లు!
నిన్న నువ్వు రైలెక్కావని తెలిసాక
మీ అమ్మకల్లు ఈ కాలవగట్టునే సూత్తునాయ్ రా!
ఆమె అనడం,నేను వినడం పూర్తికాకుండానే నాన్నొచ్చేసాడు!.......
కొద్దిదూరమేకదా నడిసొస్తాలే నాన్న! నువ్వెల్లు అన్నాను!
వద్దులే అమ్మెదురుసూత్తంది సైకులెక్కమని ఆర్డరు!
కిట్టమాయ,సాయిబుతాత అందరిప్రశ్నలకూ నాన్నేసమాదానం,
దిగరా అని సెప్పేదాకా ఇల్లొచ్చిందని తెలీలేదు.
అమ్మొచ్చి
నీల్లిచ్చి
నాకేసి సూత్తా ఏరా బాగున్నావా అని అందర్లా అడగడం మానేసి
ప్రేమ నిండిన కల్లతో ఏడుస్తుంటే
నా కల్లలో్ కూడా కన్నీళ్ళొచ్చి
అటునుంచటే ఎటో వెల్లిపోయాయ్!
*31-07-2012

శైలజా మిత్ర || గాలిలో దీపాలు ||

లేవండి! ... లేవండి!
మానవులారా లేవండి
మరణ సమయం మనతోనే ఉంటోంది
అందరూ తరిమి కొట్టండి!

నడుస్తున్నా! నవ్వుతున్నా!
మాట్లాడుతున్నా!ప్రయాణిస్తున్నా!
కళ్ళు విప్పే ఉండండి
నిద్రను మరచి మరీ
లేవండి! మానవులారా! లేవండి!
జీవితంలో ఎన్నో ఆశలు
ఉన్నాయని ఎప్పుడూ అంటూనే ఉన్నారు!.
అనుకున్నది సాధించేదాకా
నిద్రపోకండి..అలక్ష్యంగా ఉండకండి.

కళ్ళు విప్పాలి మరి
లేచి మీ విలువైన సంచులతో పాటు
అంతకంటే విలువైన ప్రాణాన్ని
మడతలు పెట్టుకుని మరీ
చేతులో పెట్టుకోండి
ఈ క్షణమైనా పరుగులేత్తల్సిన అవసరం రావచ్చు
ఈ నిముషమైన దుకాల్సి రావచ్చు
నిద్ర మత్తులో ఉండకండి!

కొన్నాళ్ళు మనం నిద్రపోయాము
కాస్తయినా అదృష్ట వంతులమే!
నేటి తరానికే పాపం
నిద్ర పోదామన్నా వీలుండటం లేదట!
విషయం ఏమిటంటే
మరణం రక్తానికి అలవాటు పడిందట !
కళ్ళు మూతలు పడుతుంటే
కంటిపై నీరైనా, గత౦లోని
రక్త చిత్రాల తాలుకు కన్నీరైనా
గుండెపై చిలకరించుకోండి
కాని నిద్ర పోవడానికి మాత్రం ప్రయత్నించకండి !

చెబుతుంటే వినిపించడం లేదా ?
ఓ! మనిషీ
అక్కడ మనసులన్నీ మారణ హోమాలై
మండిపోతున్నాయట !
బంధాలన్నీ బూడిదై పోతున్నాయట!

లేవండి లేవండి !
మరణం విలువ ఇప్పుడు
పెరిగిపోయింది
మరణం దారులు
క్రిక్కిరిసిపోతున్నాయట!
ఎంత పనిలో ఉన్నా
కళ్ళల్లో వత్తులు వేసుకుని
మానవులారా ! మేలుకోండి
మన పిచ్చిగానీ
ఇప్పుడు మరణానికి జననానికి
పెద్ద తేడా ఏముందని?
రెండూ గాలిలోని దీపాలే !
*31-07-2012

వర్ణలేఖ కవిత

నన్ను
ఆవహించి ఉండే
ఆనందం, ఫోనులో
ఆఖరి మాటతో
ఆవిరైపోయింది

అమ్మా
మన అమ్మను
కాపాడుతానని
పోయావుగానీ
ఈ అమ్మకు
పుట్టెడు శోకం
పంపిపోతావని
అనుకోలేదు

చితి మీద
చిరునవ్వుతో
నీవు వీరుడిలా
పడుకుంటే
నిన్ను ఆర్మీకి
పంపిన నాటి
నా దైర్యం కోసం
వెతుకుతున్నా

సేవజేయబోతే
గొప్పొడివంకున్నా
దేశం కోసం
దేహం విడిచి
అమ్మకే అందనంత
గొప్పొడివయ్యావు

నన్ను ఆవహించి ఉండే
ఆనందం
నీ ఆఖరి వీడ్కోలు
దగ్గరే దహించుకుపోయింది

దైర్యం నటించినా
దైన్యం ఎవరూ
గమనించకుండా
జాగ్రత్తపడ్డా
నీకు జోహార్లు
తెలుపుతూ
*31-07-2012

పులిపాటి గురుస్వామి || పరుగెడుతున్న కాలం కిటికీ లోంచి ||

సూర్యున్ని వీపు మీద మోసుకొని
కన్నీళ్ళ కలలు కంటూ
నిర్వీర్య వీరుడవై
నమ్మకం పెచ్చులూడుతున్న
వయసు గాలుల్లో...

నీ మట్టుకు నీవు
కొట్టుకు పోతుంటావు

...ఓ కమ్మని పాటను
తయారుచేసుకున్న విలుకాడు
శబ్ద లయలలో పొదిగి
తడిసేలా నీ మనసు
విసురుకుంటూ పోతాడు

* * *

చిల్లర గాయాల్ని ఏరుకుంటూ
నీ పిల్లల భవిష్యత్తు పై చెయివేసి
నిమురుకుంటూ నీ దగ్గరికి లాక్కొని
నీ గుండె కొక్కాన్ని తగిలించి
ఊయలలూపుతూ ...

నీ మట్టుకు నీవు
ఉబలాట పడుతుంటావు

...చేమ్కీలతో కలిసిన వెన్నెల
రాత్రిని కాసేపాగమని
వేపచెట్టు గాలిని బతిమిలాడి
నీ తపనల తాపం మీదికి
ప్రవహించుకుంటూ పోతాది

* * *

సున్నపు గీతల గోడల మీద
నువు కలలు కన్నా చిత్రాలు
కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ
అద్దం లోని నీ మీద
అక్షింతలు చల్లుకుంటూ
నువు కుట్టుకున్న బతుకు
నెత్తిన పెట్టుకొని ...

నీ మట్టుకు నీవు
మునకలేస్తుంటావు

...ఓ చల్లని చెరుకు తేనె పాటను
పూసుకొని
ఏడేడు వర్ణాల నీకు
నచ్చిన వాటిని ఏరుకొని
నీ దాహం తిక మక పడేటట్టు
లేత వయసు చిగురుటాకుల
సొగసు కాలాన్ని నీకోసం
చెంచాడు చెంచాడు తినిపించడం కోసం
ఓ మల్లె నీచుట్టూ
వ్యాపించుకుంటూ పోతాది.

*31-07-2012

కట్టా శ్రీనివాస్||కర్మణ్యేవాధికారస్తే...||


1
ఏం చేస్తే..
సంతోషం హ్రుదిలో నిండుతుంది?
తళుకు బెళుకుల తక్కెడలో తారట్లాటొద్దు.
చేసుకుంటూ పో......... పని.

2
ఎలా వుంటే
ధైర్యం వెన్నుతడుతుంది ?
తావీజులేవో వుంటాయని తఖరారు పడొద్దు
కండకే కాదు, గుండెకూ సానపట్టేది ......... పని.

3
ఏ క్రమత్వంతో
ఆరోగ్యం స్థిరమౌతుంది ?
దేశ, విదేశీ విధానాలతో దిమ్మరివై పోవద్దు.
నిరంతర చైతన్య పూరకం పని.

4
ఏ స్వాంతనలో
దు:ఖం ఉపశమిస్తుంది ?
కన్నుతుడిచే చేయి, వెన్ను నిమిరే వొడికోసం
అంగట్లో అంగలార్చకు,
పోటెత్తే ప్రవాహంతో మరకల్ని తడిపేది ......... పని.

5
ఏ ప్రయత్నంలో
విజయం వరిస్తుంది ?
శిక్షణా కేంద్రాల శివారులలో మునకలేయోద్దు.
తానే అందలమై అలరించేది ......... పని.

6
ఎంతటి ప్రచారంతో
ప్రతిష్ట ఇనుమడిస్తుంది ?
వందిమాగదుల పోషణలో వున్నది హరించుకోవద్దు.
పరిఢవిల్లే ఫలితంతో పల్లకీ ఎక్కించేది ......... పని.

7
మరి

8
ఏ సాధనలో
ప్రశాంతత మదినిండా వెల్లివిరుస్తుంది ?
ప్రపంచాన్ని వదిలేసి మౌనంలో సమాధికావద్దు.
సమూహత్వం సిద్దించుకుని నీవే పనివై శబ్దిస్తే చాలు.

9
ఏ పద పదఘట్టన
పసతో కవిత్వం పనలెత్తుతుంది ?
జనాంతికంలో పునరావ్రుతి దోషంలేని పదం
......... పని. ......... పని. ......... పనే.

*31-07-2012

బాలు || రైత్తన్న జీవితం ||

కాలగర్బంలో సంవత్సరాలు గడచిపోతున్నాయి
దశాబ్దాలు మరుతున్నా, తరాలు మారుతున్నా
రైత్తన్నల జీవితం మరటం లెదే?
భూస్వాముల పెత్తనదారితనం మరటంలెదే?

గుండే దైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి పంటవేసి
కన్నీళ్ళతో ఆ పంటను పండిస్తే
గుత్తెదారులు గుండేను తన్ని
చౌకబరిన రెట్లతో ఆ పంటను దొచుకుంటున్నారె.

పోలం దున్నింది రైత్తన్న
నాట్లెసింది రైత్తన్న
పంటకోసింది రైత్తన్న
కుప్పలూడ్చింది రైత్తన్న

కాని.........!
ఆ పంటకు రెటుకటెది రైత్తన్న చెతిలో లెదే?

నాటితరం సైతం వ్యవసాయం చేయడానికి బయపడుతున్నారె
ఇంక నెటితరాని గురించి ఏంచెప్పాలి?
తినటానికి పంటలు వెయకపొతె
ఈ మనిషి మనుగడ సాగెదేలా?

కావాలి కావాలి ఒక ఉద్యమం
కదలాలి కదలాలి ప్రతిఒక్కరు
వంచాలి వంచాలి ఈ ప్రభుత్వలా మెడలు
తెవాలి తెవాలి రైత్తన్నల రాజ్యం
*31-07-2012

కె. కె. || చూసిందే లోకమంటే ఎలా??? ||


1.
అది ఒక పల్లె,
కొందరికే ఆలయ ప్రవేశం,
కొందరిదే రచ్చబండ న్యాయస్థానం
కొందరిదే బడిలో చదువు,

మరికొందరు పెళ్ళికి డప్పుకొట్టాలి,
కాళ్ళకు తోలుసెప్పు కుట్టాలి,
సచ్చినోళ్ళకి పాడె కట్టాలి,
కాని ఊరు సివరే కుళ్ళి సావాలి.

అది పల్లె,
ఇక్కడ మానవత్వానికి కాలం చెల్లె

2.
అది ఒక పట్నం
సాధించింది అత్తెసరు మార్కులే
కారుల్లో షికార్లు,
గవర్నమెంటు నౌకరీలు,
అయినా ఇంకా...
పిల్లల,పిల్లలకీ రిజర్వేషన్లు,

కొందరు మేధావులున్నారు
చేతిలో పట్టాకి ఖర్చు అమ్మ పుస్తెలు,
పస్తులుంటూ దరఖాస్తులు,
అడుక్కోడానికి అడ్డొచ్చే అగ్రకులం,
ఆత్మహత్యకి గుర్తొచ్చే సంస్కారం,
బతికేస్తుంటారు.. చావుని వెతుక్కుంటూ

అది పట్నం,
తిరిగే రాట్నం

చూసిందే లోకమంటే ఎలా???

వర్ణలేఖ కవిత

ఇల్లాలు చితికెక్కితే 
చింతిస్తారు, పని ఎవడుజేస్తడ్రా అని 

భవానీ ఫణి కవిత

ఆత్మబంధువుకి ఆత్మీయ కవితా లేఖ
ప్రియమైన సంతోష్ దీదీ ...

ఇక్కడే కోనసీమ లో నేను,
ఎక్కడో కాశ్మీరం లో మీరు .
అందమైన గోదారి గట్టున నేను,
అంతే చక్కని తవి ఒడ్డున మీరు..
ఎవరికి ఎవరో తెలియకుండా
వేరువేరు ప్రాణాల్లో రూపాలు దిద్దుకున్నాం!!

కొబ్బరాకుల కొంటె నవ్వుల మధ్య నేను,
కుంకుమ పూలతో కబుర్లాడుతూ మీరు.
ఒకరికి ఒకరు తెలియనంత
సుదూర తీరాల్లో పెరిగాం !!

అక్కడా ఇక్కడా మనల్ని చూసిన
చందమామ మాత్రం
చిలిపిగా నవ్వుకున్నాడేమో అప్పుడు!!

పల్లె దాటి ఎరుగని నా అమాయకత్వాన్ని ...
అల్లరి విధి మీ చెంతకి చేర్చింది !!
ప్రపంచపు కల్మషాన్ని చూసి భయపడుతున్న నాకు...
మీ రూపంలో మరో కొత్త లోకాన్ని చూపించింది !!

కోపం తన సహజ గుణాన్ని మరిచిపోతుంది ..
మీ పక్కన నిలబడితే !!
ఆత్మీయత కొత్త పాఠాలు నేర్చుకుంటుంది..
మీ మనసు చదవగలిగితే !!
సంతోషం ఎంతొ సంతోషిస్తుంది ...
తను మీ పేరైందని తెలిస్తే!!
శాంతం సిగ్గుతో తలదించుకుంటుంది ...
మీతో పోటీపడితే!!
అసూయ ఆనందంగా ఓడిపోతుంది....
మీలో చేరాలని తలపెడితే!!
కొన్నివేల పనికిరాని పదాలు కనుమరుగవుతాయి
మీరే గనుక భావాలకి నిఘంటువుగా మారితే!!

మీరు కురిపించిన అభిమానపు జల్లుల్లో
తడిసి తడిసి ముద్దయిన నేను...
మీకు దూరమైనా మీతోనే ఉండిపోయాను !!
మిమ్మల్ని తలవని తరుణం లేదు...
మిమ్మల్ని మరిచిన క్షణం లేదు !!

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని
కలసిన సమయాన ....
నాలో కలిగిన భావోద్వేగాల్ని
వర్ణించాలంటే కొత్త పదాలు కనిపెట్టాలి !!
మీపైన నాకున్న గౌరవాన్ని
కొలవాలంటే కొత్త పరికరాలు సృష్టించాలి !!

మీకర్ధ మయ్యే భాషలో నాకు ప్రావీణ్యం లేదు...
నే చెప్పగలిగే తెలుగు మీకర్ధం కాదు !!
అయినా మాటలు చేర్చలేని ఎన్నో సందేశాలని ..
మన మనసులు గ్రహించగలవని నాకు తెలుసు!!

మీలాంటి అద్భుతమైన వ్యక్తిని
కలవడమే అదృష్ట మనుకుంటే...
మీ అభిమానాన్ని పొందగలగడాన్ని
ఏమని పిలవాలో తెలీడం లేదు !!!

మీతో పాటుగా మనల్ని కలిపిన
ఆ మంచి విధికి కూడా
ఎన్నెన్నో కృతఙ్ఞతలు !!!
*31-07-2012

ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ॥విస్మృతి॥


ఎలా ఉన్నావు?
ఎన్నాళ్లయ్యిందో కదా నీతో మాట్లాడి...

నీ హృదయ ధమనుల్లో ఎగసిపడే జలపాతంలా
ఉరకలెత్తే ఉత్సాహం ఏదీ?

ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కదం తొక్కుతూ
రగిలే ఆవేశం ఏదీ?

ఆ కన్నుల్లో నుండి ఆత్మలోకి తొంగిచూసే
తాదాత్మ్యమేదీ?

ఎక్కడో అగాధంలో...మస్తిష్కపు చీకటి పొరల్లో
విస్మరించిన నీకు విముక్తే లేదా???
*31.7.2012

కవిత చక్ర॥ అద్భుతం!! ॥

జీవితంలో అన్ని హంగులూ, ఆర్భాటాలు..
సుఖాలు, సంతోషాలు...
అన్నీ ముందే అనుభవించేస్తే..
ఎదురు చూడటానికి
జీవితంలో యేమీ మిగలదు!
... అందుకే...
సిరిసంపదలున్న
రాజు కన్నా..
యేదో కావాలి, యేదో పొందాలి..
అని ఆశగ యెదురు చూసే..
నిరుపేదే మిన్న!
అందుకే...
పొందామన్న తృప్తి కన్నా..
పొందాలి అన్న తపనే
అద్భుతం!!
*31.7.2012

హరికృష్ణ మామిడి॥మౌన గానం॥


కళ్ళ బాసని
తర్జుమా చేయడంలో
ఓ ఆనందం ఉంది..

ధ్వని చూపులకు
స్పందించడం లో
ఓ సంభ్రమం ఉంది..

స్పర్శల భాషకి
లిపి కనుక్కోవడం లో
ఓ ఆశ్చర్యం ఉంది..

పెదాల మాటలకు
స్వరాలను అల్లడం లో
ఓ విస్మయం ఉంది..

మనసు పరిమలాలకు
దేహ శిల్పాన్నివ్వడంలో
ఓ అద్భుతం ఉంది..

నీకూ నాకూ మధ్య ఉన్న నిశ్శబ్దం లో
నా గుండె సవ్వడిని
నువ్వు అనువాదం చేయడంలో
ఓ విచిత్రం ఉంది..

ప్రియా,
నీ మౌనాన్ని సైతం
అర్ధం చేసుకోవడం లో
నా ప్రేమ ఉంది..
*31.7.2012

బివివి ప్రసాద్ || మార్మిక కవిత్వం ||

1
మనిషిలో కోరికల ఫలవృక్షముంటుంది, ప్రపంచం దాని నీడ
సదా మానవులు నీడలకు వేలాడే కాయల్ని తెంపబోతారు
అరుదుగా, వివేకం మేలుకొన్నవాడొకడు
తనలోపలి వృక్షాన్ని చెరిపేసి, తానే రసపూర్ణ ఫలాన్నని తెలుసుకొంటాడు

2
అప్పుడే నడక నేర్చిన పిల్లల్ని వాళ్ళ పాదాలు నడిపిస్తాయి
మాటలు నేర్చిన పిల్లల్ని మాటలు మాట్లాడిస్తాయి
ఊహలు నేర్చిన పిల్లల్ని ఊహలు కదిలిస్తాయి

నడక బాగా తెలిసినవాడు తన పాదాలను నడిపిస్తాడు
మాటలు తెలిసినవాడు తన మాటలను ఉపయోగిస్తాడు
ఊహలు తెలిసినవాడు తన ఊహలపై అధికారం వహిస్తాడు

3
వేటినీ లోపలికి రానీయకపోవటం తొలిదశ
అన్నిటినీ లోపలికి రానీయటం మలిదశ
అన్నిటినీ వెలుపలికి పోనీయటం వాటి పై దశ
రాకపోకలు, లోవెలుపలలు లేవని తెలియటం చరమదశ

4
వెలుపలి ప్రపంచమొక పర్వతం, లోపలి ప్రపంచమొక ఆగాధం
పర్వతంపైన ఎవరైనా ఒక అడుగైనా పైకి నడవలేరు
అగాధంలోకి ప్రవేశించేవారు, అదే సమయంలో పర్వతాన్నీ అధిరోహిస్తారు
అగాధం లోతుల్ని తాకిన వారు, పర్వతాగ్రం మీద కనిపిస్తారు

5
జీవితమొక పర్వతం, మనిషి ఒక చలనం
వేలమనుషులు పర్వత పాదంలో ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు
అరుదుగా కొందరు నాలుగడుగులు పైకి నడిచి చుట్టూతిరుగుతారు
వారినందరూ ఆశ్చర్యపోతూ చూస్తారు, వారు సంతృప్తులై మరలిపోతారు

ఎక్కడో ఒకరు నిటారుగా నడవటమే నడవటమని గ్రహిస్తారు
వారు ఒకమాటైనా మాట్లాడకుండా తలవొంచుకొని శిఖరాగ్రానికి ప్రయాణిస్తారు
శిఖరాగ్రంపై నిలిచి పర్వతమే తనచుట్టూ తాను పరిభ్రమించటం దర్శిస్తారు.



బాలు వాకదాని॥నా పల్లె॥


ఏర్రటి సూరిడు నేల తల్లిని ముద్దడి ఉదయిస్తున్నాడు
చల్లటి పైరగాలి మనసును ఉత్సహంతో నిద్రలేపింది
కొయిల కుహు కుహు స్వరాలు వినిపిస్తున్నాయి
దూరంగానున్న గుడినుంచి సుప్రబాత గీతాలు వినిపిస్తున్నాయి

ప్రశాంతమైన వాతావరణం
ఇంటి అడపిల్లలు ఇంటి ముంగిట ముగ్గులు వెస్తున్నారు
ఎడ్లమెడలో గంటలు గల్లుగల్లున మొగుతున్నాయి
చద్దిముద్దలు చంక్కన పెట్టుకొని పొలాలకు వెళ్ళుతున్న రైతన్నలు

సూరీడు నడినెత్తిమీదకి వచ్చాడు
పొలంగట్లమీద బోజనాలు
సరదాగా సాగే కబుర్లు
మనసుకి ఆనందాని ఇచ్చే అప్యయత

సూరీడు తిరిగి నేలతల్లివడికి చేరుకున్నాడు
గోమాతలు తిరిగి ఇల్లకు చేరుకున్నాయి
గుడిలో హరికథ కాలక్షేపం
అందరు ఒకచొటుకు చేరిచేసే చర్చలు

రోజంతా చేసినపని మరచిపోయి
నింగీలోని చుక్కలు లెక్కపెడుతూ
నిద్రలోకి జారుకున్న గ్రామప్రజలు
భూమాత హయిగా జోలపాటపాడుతున్నది.

*30-07-2012

కట్టా శ్రీనివాస్ || ♥ ♥ చిరుజల్లు ♥ ♥ ||

ప్రియా నీవు నవ్వితే
ముత్యాలు రాల్తాయని
చోక్కానే అక్షయపాత్రచేసి పట్టాను.

తడిసిపోయిన తర్వతగానీ
తెలిసి రాలేదు.
నవ్వితే రాలేది,
ముత్యాలు కాదని.

మెర్సీ మార్గరెట్ కవిత

సమాధిపై అక్షరాలు
మాట్లాడుతున్నాయి
గుస గుసగా నీ లాగే
కళ్ళని పొడుస్తూ

తడి ఆరని నా చెంపలని
తుడిచే ప్రయత్నంలో
ఓడిపోయి
నువ్వు
ఆ అక్షరాలలోంచి చూస్తూ

చెదిరిన నా ముంగురుల్ని
గాలిలా తాకే ప్రయత్నం చేస్తూ
కన్నీళ్ళను నీలో
కలుపుకుంటూ

భారమనుకుని వదిలేస్తున్న
క్షణాల్ని
గడ్డివాసనతో నాలోకి
తిరిగి నింపుతూ

ఖాళీగా నిందిస్తున్న
నా కౌగిలి మాటల్ని
ఆ దీపపు వెలుగులో
దహించుకుంటూ నను దీనంగా
చూస్తూ

నీపై సరదా పడ్డ మరణం
నా గుండెకి
వేస్తూనే ఉంది ఉరిశిక్ష
ప్రతి క్షణం
నీ గురుతుల వాసన
త్రాడుని పేనుతూ

నువ్వేమో
ఒంటరిగా ఇక్కడ
ఇల్లు కట్టుక్కున్నావ్
నువ్వు లేని ఇల్లుని
నాకు సమాధిగా
చేసావ్ ..

*30-07-2012

కవిమిత్రులారా!

=దయచేసి రోజుకి ఒక కవితను 'కవి సంగమం'లో పోస్ట్ చెయ్యండి.
చదివేందుకు, కామెంట్స్ రాసేందుకు వీలుగా ఉంటుంది..అన్ని కవితలు చదవడానికి తీరిక దోరుకుతుంది.అందరి కవితల్ని చదివి,చర్చించడానికి సమయం చిక్కుతుంది.
= బ్లాగులోకి ఎంపిక చెయ్యడానికి ఒక కవిత అయితే బాగుంటుంది..రెండో,మూడో అయితే-అన్నీ బాగుండి ఒకటి మాత్రమే తీసుకోవాల్సివస్తుంది..
***
+కాబట్టి 'ఒక కవి-రోజుకు ఒక కవిత' పద్ధతిని పాటిద్దాం..!!!

రియాజ్ || Small Feel... ||


1.
గుండెలో పెన్ను కదిలింది
అది కవిత కాదు
***
2.
అక్కడ మౌనం మాట్లాడుతోంది
అదో రకం కవిత

3.
కెమెరా కన్నుకొట్టింది
అక్కడ అమ్మాయి లేదు
కన్నీటి దృశ్యం

4.
కంటి లెన్స్ ముడుచుకున్నాయ్
బొడ బొడ కన్నీరు
నా వల్ల ఆమె నొచ్చుకుంది
5.
ఆమె మాట్లాడలేదు
నా కలం వాగుడందుకుంది
6.
ఆమె నొప్పించింది
పదాలు భోరుమన్నాయ్
7.
ఆమె నవ్వందుకుంది
గుండె కెమెర స్నాప్ తీసుకుంది
8.
వాస్తవం వెలగపండు తింది
తాగేందుకు కాస్త కవిత్వం కావాలి
9.
నే జోక్ వెయ్యలేదు
ఆమె నవ్వింది
అర్ధం కాల?!
10.
నవ్వు రాకున్నా అవ్వ నవ్వుతోంది
నా ముఖం విచ్చుకోవాలని
11.
తాతకు కోపమొచ్చింది
అందుకే పంచెకట్టా!

*30-07-2012

మెర్సీ మార్గరెట్ || చీకటి నేస్తం .. ||

నేను మేల్కొనే రాత్రులు
నాకు పాఠాలు నేర్పే గురువులు
నాతోనే ఉంటూ నన్ను ప్రేమించే
నా స్నేహితురాళ్ళు

దొంగలా ఎప్పుడొచ్చి దోచుకెల్తుందో
జీవితాన్ని ఒంటరితనం
కానీ ఆప్తురాలిగా తన తోడు నివ్వడానికి
దరిచేరుతుంది చీకటి నేస్తం

ప్రతిఘటించే ధైర్యాన్ని బందీ చేసుకొని
వెళ్తుంది పిరికితనం
పౌరుషాన్ని కంటికి మెలుకువతో
నేర్పుతూ సానబడుతుంది చీకటి నేస్తం
రేపటి ఉదయం కోసం

నలుగురి ముందు సాహసినని
కళ్ళకి నటనలో శిక్షననిస్తుంది
ఉదయపు కాంతుల్లో జీవితం...
గుండెనంతా తనై తనలోకి
ఒంటరితనాన్ని ఒంపేయమనే
ఆత్మ బంధువు నీ కోసం చీకటి నేస్తం

ఒంటరికి కూడా తోడునిస్తూ
రాతిరి కౌగిటిలో
ఓడిపోయిన ప్రతిసారి సేద తీరుస్తూ
త్రవ్వి త్రవ్వి జీవితాన్ని తోడుకోమని
కవులకు
భావాల సేద్యం చేయడం నేర్పుతుంది
చీకటి నేస్తం ..

అందుకే చీకటంటే నాకూ ..
నా ఒంటరితనానికి
ఏకాంతంతో కలిపి
మరీ ఇష్టం ..

*30-07-2012

కిరణ్ గాలి || అగణిత ముక్తావళి ||


Hypothesis
Love is abstract, there is nothing absolute about it.
It is relative, situational and subject to conditions***.

Theorem
Life is full of variables and constraints.
Hence love can be instant but it will never be constant.
Any thing which has a basis in "irrational" (feelings) can neither be "real" nor "whole".

ప్రేమ, తర్కం రెండు సమాంతర రేఖలు

..............

ప్రేమనే ఈక్వేశన్ని సాల్వ్ చేసి
ఎక్స్ వాల్యు మరేదొ కాదు
సెక్స్ అని తెలిసి నివ్వెరపోకండి

...........

జీవిత వృత్తానికి
డబ్బే కేంద్ర బిందువు

........

అనుభందాలను అహం భాగించినప్పుడు
మిగిలే శేషమ్
క్లేశమే

...........

కీర్తి కాంత కనకం
త్రికొణాల మద్య సమాజం వ్యాకొచించింది

...........

అవకాశాలెప్పుడు అనుకోని పెర్ముటేషన్, కాంబినేషన్లలోనె వస్తాయి
అది తెలిసినవా(నా)డు
నిరాశ ఆఖరి శ్వాసనించి దాన్ని శ్రుష్టించగలడు

.............

గెలుపెప్పుడు ఓటమి తర్వాతే వస్తుంది
हार जीत / Failure Success
నిఘంటువులలొనె కాదు... జీవితంలో కూడా

నువ్వు ఎన్ని ఓటములని అధిగమించి
నిలువుస్తావొ నీ గెలుపుకంత విలువ వస్తుంది
సున్నాల ముందు ఒకటికిలాగ

...........

Birth is a probability
Life is a certainty
Death is an eventuality
Life after death is our creativity

............

జీవిత గణితం

ప్రేమ అనంతము అపరిమితము
Love= Infinity (I)

నిజాయితికి విలువ లేదు
Honesty=0

నువ్వు ఒక్కడివే
i=1

నీనించి నిజాయితీని తీసేసినా పర్వాలేదు నువ్వు చచ్చిపోవు
1-0=1

ప్రేమకు నిజాయితితొ పనిలేదు. దాన్ని కలిపినా కలపకున్నా నష్టం లేదు
I+0 or I-0 = I

నీలొంచి "నేను" అనే ఈగొ ఫీలిన్గ్స్ తీసేస్తే నిజాయితీగా వుండగలవు
1-1=0
Also నిన్ను నువ్వు దురం చేసుకొకు. నువ్వంటు వుండవు.ఇది నిజమ్

నిన్ను నువ్వు భాగించినా, గుణించినా, తల్లకిందులుగ తపస్సు చేసినా నువ్వు గానె వుంటావు
1*1 or 1/1=1

నిజాయితీని నువ్వు భాగించినా, ప్రేమ భాగించినా మిగిలేది నిజాయితీనే. నిజాయితి నిఖార్సైనది.
0/I or 0/1=0

ప్రేమ లొంచి ప్రేమను తీసెస్తే...

I-I = -I or I or 0
ద్వేషం, ప్రేమ , నిజాయితి

నిజయితిగా ప్రేమను గుణించినా(multiply) భాగించినా(share)అనిర్వచనమైన అనుభూతిని పొందగలవు
I*0 & I/0 = Undefined

అనిల్ డాని || ఇల్లాలు ||

రోజంతా తెగ తిరిగేస్తాను
గాలిలో ధూళిలో
ఈ చెడ్డ లోకం లో
అన్నింటా అబద్దమే

తిండి సంపాదించుకోవడానికి
డబ్బు సంపాదించుకోవడానికి
హోదా సంపాదించుకోవడానికి
అన్ని పాపాలే చేసేది

కాని చీకటిని చూస్తె భయం
చీకటి పడితే ఇంటికి వెళ్ళాలి
ఇంటికి వెళితే అక్కడ అర్ధాంగి వుంటుంది
అదేంటో నేను చేసే పాపాలన్నీ
ఆమె కంటి చూపు లో చక్కగా కనబడతాయి
నా మోసాలు అన్ని వేషాలు వేసుకుని
నన్ను చూసి నవ్వుతాయి

బాద పడుతున్న తన గుండె లోని బాధ
కంటి ద్వారా నన్ను ప్రశ్నిస్తుంటే
జవాబు చెప్పలేని నా చేతకాని తనం
వెర్రి చూపులు చూస్తుంటుంది రోజు
అందుకే భయం చీకటంటే

తను విసిరి కొట్టిన నా చేయి
కసురుకునే నా హృదయం
ఆలోచిస్తున్నా ఎందుకు ఇలాగా అని
అప్పుడే తెలిసింది

తను వెలిగించింది నా ఇంటి దీపం అని
ఆ వెలుగులో నా తప్పులన్నీ
తను చూడగలదు అని
అందుకే ఇల్లాలే ఇంటికి వెలుగు
ఆ వెలుగున్నంత కాలం నేను
ఏ తప్పు చేయను చేయలేనేమో
వెంటాడుతూనే వుంటుంది
నేను బతికున్నంత కాలం.

*30-07-2012

కర్లపాలెం హనుమంత రావు || కొన్ని హైకులు ||


1.ఆమె తెలియదు
ఆ నవ్వు
తెలుసు

2.ఒంటరితనంలో
నేనూ, నేను
ఇరుక్కుంటో...

౩.మూడడుగులకు మించి
ఎవరూ పోలేరు
లోపలికి

4.పాపాయి
అద్దంలో
నా బాల్యం

5.తొలి ఝాము కోడి కూతకు
పగటి వేషం
మళ్ళీ మొదలు...

6.నీరు లేకపోతే
వాడి పోయే
పూవే కావాలి

7.గూడు కడుతుంది పిట్ట
వాన వస్తుందని
తెలిసీ!

8.చందమామ
చూరు ఆకాశానికి వేలాడే
లాంతరు

9.ఆ కాస్సేపూ
అందర్నీ సమంగా చుస్తుంది
రైలు ప్రయాణం

1౦.గాలి తుఫానుకి
పైరు అలసి
పడుకుంది

వంశీదర్ రెడ్డి || ‎‎* ఆగస్ట్ 7 @ 2011 * ||

వరండాలో
గాజు పెంకులనడుమ ఊడిన పళ్ళు,
నాలికతో అప్రయత్నంగా టూత్ కౌంట్ చేయిస్తూ,
అక్కడక్కడా బీర్ చుక్కలు
సన్ రేస్ కి ప్రిస్మాటిక్ ఎఫ్ఫెక్ట్ ఇస్తూ,
ఓపెనరెందుకు వాడ్లేదనాలోచిస్తూ
నోట్లో పులిసిన నెత్తుర్ని పుక్కిలిస్తూ

రాత్రి మిగిలిన కోడికాళ్ళు కొరుకుతూ రెండెలుకలు,
కుడికాలి చిటికెనవేలూ
ఎడమ మడమ్మీది చర్మం మాయమై,
నుదుటికి చెమటలెక్కించి,

సగం కాలిన శేషేన్,
"నా దేశం నా.." వరకే మిగిలి,
పూర్తిగా బూడిదైన కొ.కు లిటరరీ ఎస్సేస్,
సర్టిఫికెట్లన్నీ దాచిన
"హారిసన్ ఇంటర్నల్ మెడిసిన్" బుక్కెక్కడుందో గుర్తురాక,
ధబ్మని కిందపడి, హైపోగ్లైసీమియా..

రక్తపు తడి తగుల్తూ పొట్ట,
డ్రెస్సింగ్ మిర్రర్ పరావర్తించిన్నా నగ్న దేహం,
గోళ్ళు గీరిన హోమిసైడల్ గుర్తుల్తో..
వ్వాట్,డిడ్ ఐ డు దట్ ?
ఓపెన్చేసిన కండోమ్, బెలూనై
ఫాన్ కి తిరుగుతూ,

ఏమైందసల్నాకు, ఏంటిదంతా,
లీలగా తడుతూ
రాత్రి, పార్టీ, నేనూ, సామ్, అర్పి..

సగం గ్లాస్ కార్ల్స్ బర్గ్ బీర్లో,
కరగని సిగరెట్ మసి, అంటే
ఆ సగం నేన్తాగి..
వెంట్రుకలు కాలిన వాసనొస్తూ ఆష్ ట్రే,
మై డాగ్, టామ్, టామీవా,

డస్ట్ బిన్లో ఫోన్ అలారం,
కాల్ లిస్ట్, నా ఫోన్నుండి నా నంబర్కే
2.17am, డ్యూరేషన్ 12.50 మినట్స్, ,
వాట్ ద #@..
ఒక సెకన్ వెన్నుపాము జారినట్టై,
కశ్మలాన్ని కడుపు బైటికి నెడుతూ,,

వాష్ రూమ్,
వాష్ రూం డోరెందుకు తెరుచుకోట్లే,
లోపలెవరున్నారు, రేయ్, ఓపెనిట్,
అయోమయం ఆవేశం కలగలిసిన దెబ్బకి
తలుపు తెర్చుకుని,
కంఠం తెగి కదలకుండా పడున్న రెండు శరీరాలు,
రైగర్ మార్టిసై కండరాలు బిగుసుకునప్పటికే
షవర్ కింద తడుస్తూ,

ఆఆఆ హాఆఆఆఆఆఆ,
తల మోకాళ్ళలో దాచుకుని,
గంజాయికి గొంతు మండుతున్న బాధ
ఏడుపు రేపిన భయం కలుపుకుని అరుస్తూ,
"నేనేం చెయ్యలేదు", "ఏం జరిగిందసలు",

చస్తే బాగుండనిపించేంత నిశ్శబ్దం
లోంచి ఒక్కసారిగా

"భుం, హ హ హ హ,
హాప్పీ ఫ్రెండ్ షిప్ డే, భయపడ్డావా,
రేయ్ మాట్లాడు,
చిన్న ప్రాక్టికల్ జోక్, నేనప్పటికీ వొద్దన్నా,
ఇది వింటేగా,,
హాంగ్ ఆన్ రా, రేయ్, యూ దేర్.."

సడ్డెన్ స్ట్రోక్ డ్యూ టు షాక్,
వెంట్రికులార్ ఫిబ్రిల్లేషన్,
పల్స్ రేట్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ నాట్ రికార్డబుల్,
ఈ.సీ.జి ఫ్లాట్..
మెదడు మొద్దుబారి
కళ్ళ ముందు మసకలు పరామర్శిస్తూ,
ఎలుక మిగిలిన వేళ్ళనీ కొరకడానికన్నట్టు దగ్గరికొస్తూ,
రెపరెపలాడుతూ కేలండర్లో
ఎర్రగా తేదీ,
"ఆగస్ట్ 7 @ 2011"

*30-07-2012

రామ కృష్ణ || నిత్య ప్రయాణీకుడు ||

కవి నిరంతర ప్రయాణీకుడుకావాలి
ఒక చొటునుంచి మరో చోటుకో
ఒక ఊరునుంచి మరోఊరుకో
ఒక కాలం నుంచి మరోకాలానికో
ఒక భావనలోంచి మరో ఉత్కృష్ఠ భావననకో
నిరంతరం ప్రయాణిస్తూ ఉండాలి

కవిని చూస్తే నది గుర్తుకు రావాలి
తెల్లని, తంబురాకు కట్టినతీగేదో
మదిలో మెదలాలి

కవిత్వమంటే జలమే కదా
నిన్ను నువ్వు నిష్కల్మషంగా కడుక్కోవటానికి
నీ లోపలిశరీరం స్నానం చేయటానికి
నీ అంతర్ముఖ సౌందర్యాన్ని పెంపొందించు కోవడానికి
కవిత్వాన్ని మించిన సాధనమేముంటుంది

కవి నడిచినంత మేరా
పచ్చదనం పరిఢవిల్లాలి
పూల ముఖాలనుంచి ఆనందం పుప్పొడిలా రాలి పడాలి

పారే నది ఏం చేస్తుంది
తను నడిచినంతమేరా
నేలను పదును చేస్తుంది

తనలోమునిగిన కడవల తో పాటు
రెండు వాక్యాలై వాళ్ళ యిల్లకు చేరుతుంది

కవిని మీటితే
నిండుగ నది ప్రవహిస్తున్నట్టు
తుమ్మెద ఝాంకారమేదొ వినపడాలి
పంచమ స్వరం మనసుల్లో ప్రతిధ్వనించాలి

కవి చుట్టూ ఉన్నవాళ్ళెపుడూ
కవిత్వ మహార్ణవం లో మునిగి తేలాలి
సముద్రంలో మునిగిన వాని శరీరం నిండా
ఉప్పు పేలినట్లు
కవిత్వం లో మునిగిన వాని శరీరం, నిండా పులకించి
చర్మము పై ఆనందం మొగ్గలు తొడగాలి
కవిత్వపు తడి మేను నిండా జాలువారాలి
అక్కడ గాలంతా కవిత్వమై వ్యాపించాలి

కవిత్వమే తప్ప కవి లేని చోట!
అతడు కథలు కథలు గా వినపడాలి.

*30-07-2012

బివివి ప్రసాద్ || గంధర్వుడు ఒకడు ||

గంధర్వుడు ఒకడు వచ్చి వెళతాడు
మన చుట్టూవున్న శూన్యంలోని మనమెరుగని రహస్యలోకాల నుండి
మెరిసే జీవులలో ఒకడు మనకోసం వచ్చివెళతాడు

అతనిని భూమి గుర్తించదు
భూమి మేలుకొంటున్నపుడు పరివ్యాప్తమయే పరిమళం గుర్తిస్తుంది
అగ్ని గుర్తించదు
అగ్నిలోకం నుండి రెక్కలు విప్పుకొంటున్న రంగులు గుర్తిస్తాయి
అతనిని అక్షరాలు గుర్తించవు
అక్షరాలపై అదృశ్య సంచారం చేసే ఊహలు గుర్తిస్తాయి

చీకటి గుహలలో, గుహలలో, గుహలలో నిదురిస్తూ నడుస్తున్న మనం
అతనిని చూసి 'ఇతను మనలాంటి వాడే కదా
మన వలే భయ, కాంక్షా, వ్యాకులతలు చుట్టుకొన్న వాడే కదా ' అనుకొంటున్నపుడు
చెట్లు నిదానం గా కలగంటున్న పచ్చదనమూ,
పక్షుల రెక్కలపై వాలి కేరింతలు కొడుతున్న స్వేచ్ఛా కాంక్షా
మనని చూసి జాలి పడతాయి
'ఇతని భయ, కాంక్షా, వ్యాకులతల వెనుక
పారాడే దయ ఏనాటికి మీకు తెలుస్తుంద ' ని తలుస్తాయి

అతను నవ్వినపుడూ, మాట్లాడినపుడూ, పాడినపుడూ, కవిత్వం చెప్పినపుడూ
తలుపుల వెనుక, తలుపుల వెనుక, తలుపుల వెనుక
ఉన్న మనపైన ప్రేమ కలిగి
సుతారంగా మన తలుపులన్నిటినీ తడతాడు
చిరుగాలైనా వీయలేదే ఈ సడి ఎక్కడిదని కొందరైనా గుర్తించేలోపు
బంగారు కిరణమొకటి మరలినట్లు నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు

అతను వచ్చి వెళ్ళాడని
మనకి తెలియదు కాని, మన హృదయాలకి తెలుస్తుంది
మనలో జీవితేచ్ఛలా అణగారి వెలుగుతున్న మన అంతరాత్మకి తెలుస్తుంది
తలుపులు మూసిన గదిలోకి చలిగాలి తెర ఒకటి ప్రవేశించినట్లు
అతను సరాసరి మనలోపలికి ప్రవేశిస్తాడు
మన అంతరాత్మతో సంభాషిస్తాడు
మన అనుమతి లేకుండా మనలో కొంత వెలుతురు ప్రవేశపెట్టి చూస్తాడు
అతను ఏదో చేసాడని, ఏదో మాట్లాడాడని గుర్తించగలము కాని
ఏమి చేసాడో, మాట్లాడాడో ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది

మన చుట్టూ ఉన్న ఆకాశం లోపల వెలిగే రహస్యదేశాల జీవి ఒకడు
మన మధ్యకు వచ్చి వెళిపోతాడు
కాసిని రంగుల్నో, స్వరాల్నో, అక్షరాల్నో ఉపయోగించి
తాను నివసించే వెలుతురులోకం చిరునామా మనకు చెప్పబోతాడు

మనకు సంతోషపు మైకం కమ్మేవాటికి అతను దు:ఖిస్తాడు
మనం దు:ఖించేవాటికి, అతను చిరునవ్వు నవ్వుతాడు
అతను ఉత్సాహం పట్టలేక 'అదిగో చూడు ' అన్నపుడు
అతని వేలికొన చూపించే వెలుతురులోకాన్ని ఎంతకీ మనం చూడలేకపోతాము
మన కళ్ళని మూసిన మన అరిచేతుల చీకటిని అతను విదిలించలేకపోతాడు

పొరలోపల, పొరలోపల, పొరలోపల దాగిన ఉల్లిరసం ఘాటులాంటి
మన 'నేనే, నేనే, నేనే ' లను చూసి
దు:ఖంతో, జాలితో
చల్లటి వానాకాలపు జల్లులాంటి నవ్వుల్నీ, చూపుల్నీ మనపై కురిపిస్తూ
వచ్చినచోటికి మరలా తరలిపోతాడు
వాన తరువాత వ్యాపించే నిర్మల ప్రశాంత నిశ్శబ్దం వెంట
అతను తన లోకాన్ని చేరుకొంటాడు

గంధర్వుడు ఒకడు వస్తాడు, వెళతాడు
మనకు ఎప్పటిలా సూర్యాస్తమయమౌతుంది
దిగులుపాటల్ని మోసుకొంటూ పిట్టలు చీకటిలో కరిగిపోతాయి
చీకటికోసం రోదసినిండా వేచివున్న ఏవో శక్తులు
యధావిధిగా మనతో చేయి కలిపి
చిరంతన సంభాషణలో తరువాతి భాగం కొనసాగిస్తాయి
వాటిని హత్తుకొని మనం మరొకసారి
స్వప్న లోకాలు దాటి
నిదురలోకి, నిదురలోకి, నిదురలోకి జారిపోతాము

గంధర్వుడొకడు వచ్చివెళ్ళిన జాడలేవో
మనని కోమలంగా తడుతూ ఉంటాయి
మనలోలోపలి స్వప్నాలను పొదువుకొని కాపాడుతుంటాయి.

*30-07-2012

వంశీదర్ రెడ్డి || ‎‎*అమాయకుడు* ||

అంతా పిచ్చోడంటున్నారు,
మీలా మామూలోణ్ణే ..
రెండేళ్ళ క్రితం మూర్ఛొచ్చి పడేసింది,
స్పృహొచ్చాకా ఇక్కడున్నా,
ఇపుడు బైటికెళ్తున్నాననుకోండీ,

- "హలో, కంట్రోల్ రూం,
ప్రమాదకరమైన పేషెంట్ తప్పించుకున్నాడు,
గది కిటికీలు రూమ్మేట్ తలతో పగలగొట్టి,
ఎలా ఉంటాడా, ఆమయకంగా కన్పిస్తాడు చూడ్డానికి"

ప్రేమించి పెళ్ళాడిన భార్య, సౌఖ్యాలకాశపడి
పై అధికారితో తో గడుపుతుంటే,
అడ్డొచ్చిన్నన్ను
పిచ్చోడ్నని చెప్పి...
జరిగిందేమని చెప్పను, ఎవర్తో చెప్పను,
వాళ్ళని చంపి లోకమంతా విన్పించేట్టు నిజం చెప్పాలనుంది,

-"హలో, పోలీస్టేషన్,
ఇక్కడొకర్ని చంపాడొకడు,
చాలాసేపేదో మాట్లాడాడు శవంతో,
పిచ్చొడా? చూడ్డానికమాయకంగా ఉన్నాడ్సార్"

ఆకలి తగ్గింది, అది బ్రతికే ఉందింకా
నాకేం సరదానా, చంపడం,
రెండేళ్ళు
రోజూ కరెంట్ షాకిస్తూ,మింగించిన మందులకు
మగాణ్ణని మర్చిపోయి,
భయపెట్టే మృగాల మద్య ఒంటరిగా ఉండడం,
మనుషులపై ఎంత కసి పెంచుతాయో..
నిన్ను, పై ఇంటికి పంపడానికొస్తున్నానే మనింటికి..

-"ఎవర్నువ్వు, ఎందుక్కొడ్తున్నావ్, హా, అమ్మాహ్"
నా రక్తం పీల్చిన నీ రక్తం తాగడానికి,
తలా, మొండెం వేరయ్యేంతవరకూ
పోలీసులొచ్చి ఆపేంతవరకూ
కత్తి తన పన్తాను చేస్తూనే..

"డాక్టర్, ఆ పేషెంట్,
కుటుంబం, భార్యా అని కథ చెప్పాడింటరాగేషన్లో "
ఏం జరుగుతుందో అర్ధం కాని సర్కిలినిస్పెక్టర్
నాలుగోసారి టీ తాగుతూ..

"అసలు పెళ్ళైతే కదా,
వాడో "డేంజరస్ స్కిజోఫ్రీనియాక్",
జూదమాడొద్దన్నారని
తల్లి, తండ్రి, అన్న వదిన్ని, ఇద్దరు పిల్లల్ని
ఘోరంగా చంపాడారేళ్ళక్రితం,
అప్పట్నించి ఈ అసైలమ్ లోనే పెట్టాం "

"సార్,
నా పిల్లలేడుస్తారు నేను కన్పించకపోతే,
ఇంటికి పంపరూ",
చూసేవాళ్ళ గుండె కరిగేలా వాడు..
అమాయకంగా..
*30-07-2012

ఊడుగుల వేణు || పాటల బోధివృక్షం ||

బతుక్కి ఓ అర్థం లేదు
మనమిచ్చే వరకు దాని బతుకంతే
ఏడవటానికి అది వంద కారణల్ని చూపిస్తే
నవ్వటానికి దానికి మనం వెయ్యి కారణల్ని చూపిస్తాం.
అయినా – మనం అప్పుడప్పుడు చచ్చిపోతూనే వుంటాo
చివరిసారి చచ్చిపోయేప్పుడు మాత్రం మన చావుని చూసుకోలేం
సరే, మనలాంటి వాడి గురించి కాకుండా –
ఇప్పుడొక నిజమైన మనిషి గురించి మాట్లాడుకుందాం...
* * * * *
నేనతన్ని కలిసిన మొదటి రోజే ఎన్ని ప్రశ్నలో...
చెట్టు మీది పిట్టలూ ఆసక్తిగా చూశాయి...
వేయి స్తంభాల గుడిలోనే నా బాల్యం గడిచిందంటే -
‘అదృష్టవంతుడివి నాయనా’ అన్నాడు
అతని నడవడిక చూశాకే నా బలుపు తగ్గింది
అతన్ని చూశాకే తలవంచుకుని నడవటమూ నేర్చుకున్నాను.
నిండైన పదకోశంలా అలవోకగా పలుకుల్ని చల్లుతుంటే
కలంతో కాగితం మీద ప్రతిష్టించేవాన్ని
"ఆకలేస్తే చెప్పు నాయనా"అనే మధ్య మధ్య లోని అమ్మతనం
మా అమ్మని గుర్తుకు తెచ్చి కళ్ళు చిప్పిల్ల్లేవి
అతని లోని మనిషితనాన్ని పొదువుకునేందుకు నాలో పరుగు మొదలైంది
* * * * *
అతని పాటల్లో ఒదగడానికి
పదాల మద్య ముష్టియుద్దాలు జరిగేవి
ఇప్పుడు యుద్దం లేదు... యుద్ద భూమి లేదు
పిట్టలతో పాటు వెళ్లిపోయాడు – ప్రశాంతంగా....
నా చర్మం – చర్మం లోపలి మాంసం - నరాలు - నెత్తురు - నా చేతివేళ్లు
పాకుతు అటువైపే వెళ్తున్నాయి...
అతన్ని అందుకుంటానికి తహతహలాడుతూ !
ఉప్పు నీళ్ళు తాగటం అలవాటేగానీ...
ఉన్న రెండు కళ్ళల్లోంచి పేరు తెలీని నదులేన్నో ప్రవహిస్తోంటే
ఎక్కడ వెతకను సముద్రాల్ని?
* * * * * *
ఇలాంటి విషాద సందర్భాల్లోనే
సముద్రాలూ నదుల్ని తిరస్కరిస్తాయి
లేళ్ళు సెలయేళ్ళు లేతాకులు కోయిల కూతలు
భూమిని బహిష్కరిస్తాయి
నిప్పు - నీరు ఒకదాన్నొకటి నిందించుకుంటాయి
దుమ్మెత్తి పోసుకుంటాయి
బహుశా ఈ విధ్వంసం తెలిసే వెళ్ళిపోయాడు -ప్రశాంతంగా ...
అక్కడ కన్నీళ్ళు0డవ్ - అతని లాంటి కొన్ని పూవులుంటాయంతే
ఆ పూల మధ్య అతనిప్పుడు పాటల జెండాని పాతాడు
అది భోధి వృక్షమై తత్వాలు పాడుతుంది.
ఆకాశం మోకరిల్లి ఆలకిస్తుంది – అప్పుడప్పుడు నవ్వుతుంది
భూమ్మీద తన కోసం పుట్టిన రాగాలు
గుక్కపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంటాయి
వాటి నెవరూ ఓదార్చలేరు
ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ
నిద్రలోకి జారుకుంటాయి - అదృశ్యమైపోతాయి
* * * * *


నీటిలో చేప పిల్లల్లా నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు
మొదటిసారి తన చావుని తాను చూసుకుంటూ
అలా అలా వెళ్లిపోయాడు .
అయినా నాతో మాట్లాడుతూనే వున్నాడు
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గురించి...
కొన్ని మనసుల గురించి...
‘చౌచౌ’ సాహిత్యం గురించి
నాతో మాట్లాడుతూనే ఉంటాడు
నాకోసం తన పక్కనే ఓ చాపేసి ఉంచుతాడు
ఏదో ఒక రోజు నేనూ అక్కడికే వెళ్తాను
అతని పాటల్ని భూమ్మీదికి వదులుతాను
నాలాగే అవి పక్షులై విహరిస్తాయి.

------------ఊడుగుల వేణు

{ నేను అసోసియట్ డైరెక్టర్ గా పని చేసిన మూవీస్ కి పాటలు రాయించే క్రమం లో వేటూరి గారితో పరిచయం యేర్పడింది .నేను షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్నప్పుడూ వేటూరి గారి దగ్గర కొన్ని రోజులు అసోసిఎట్ గా కూడా వర్క్ చేశాను .అతను డిక్టేట్ చేస్తుంటే తప్పులు లేకుండా రాయటం నా పని.అదొక అద్భుతమైన అనుభవం .తన ప్రాణాలు పోఇన రాత్రి నాలో ఉప్పొంగిన ఉద్వేగం ఇది }

పులిపాటి గురుస్వామి || ధ్యానజీవులు ||

ఏమీ తోచనివ్వనిదనుకున్న
సాయంత్రాన్ని కూడా
నీ కోసం ప్రార్ధించుకోవడానికి
అలంకరించుకుంటాను

ఓ చిత్తు కాగితం తీసుకొని
నా చేతితో నీ జ్ఞాపకాన్ని రాసి
పవిత్రపరుస్తాను

నా చుట్టూ పెనవేసుకుపోయిన
ప్రతిదీ నీ చేరువకి కదిలిస్తాను
దీపం దగ్గర ఏదైనా ప్రకాశిస్తుంది కదా!

నన్ను కొన్ని ఆలోచనలు కూడా
ఎక్కడో పడవేస్తాయి
కొంత సమయం తర్వాత గానీ
అక్కడికెందుకొచ్చిందీ తెలియదు

కొందర్ని ఎందుకు కలుస్తామో కూడా
అప్పుడే తెలియక పోవచ్చు
వాళ్ళు నాటుకున్నాక.....కొంతకాలానికి
ఓ పరిమళపు స్పర్శ
బహుశా కలయికల సారం
మొగ్గలు తొడగవచ్చు

అయితే...విత్తనాలు నాటిన స్నేహాలు
పవిత్ర ధ్యాన మందిరాలు
నీవంటివే.
*30-07-2012

గరిమెళ్ల నాగేశ్వరరావు || మదిలోంచి నదిలోకి...! ||

మారాము చేసే చంటి పిల్లాడి లాంటి చందమామని
ఒడిలో వేసుకు ఓదార్చుతున్నట్టు... రాత్రంతా...
గలగలల పాట పాడుతూనే ఉంది నది.
చెట్టుకొమ్మలు పట్టుకు ఉయ్యాలలూగుతూ
నది చుట్టూ తిరిగి కేరింతలు కొడుతోంది కొండగాలి
నది పాట... పడవ తెరచాపకి నాట్యం నేర్పినట్టుంది.
వలల జాడలేని అలల మధ్యన...
కొండల దొంగ జపాల విరామంలో... చేపపిల్లొక్కటి...
స్వాతంత్య్రాన్ని ప్రకటించుకు స్వేచ్ఛగా ఈదుతోంది.
కాళరాత్రిని తారురోడ్డుకి అతికించేసి... వెనె్నల
తనివితీరా.. నదిలో స్నానం చేస్తుంది.
పాల కోసం తల్లి దేహాన్ని తడిమే పసిపిల్లల్లా...
పంట కాలువలు నది చుట్టూ చేతులు జాచుతున్నాయ్
నదిని గాయపరచాలనుకొన్న మురికి కాలువ ఒకటి
ఆత్మశుద్ధి చేసుకు పవిత్రమై పరవళ్లు తొక్కింది.
తనకంటిన నెత్తుటిని కడుగుతోన్నపుడు...
కత్తి కార్చిన కన్నీటి బొట్టు నది గుండెలని తాకింది.
కన్నతల్లి కని పారేసిన పసికందుని కాపాడలేకనో...
అప్పుల బాధతో చప్పున దూకేసిన
సంసారిని బ్రతికించలేకనో
నది మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తోంది.
కర్మాగారాల విష రసాయనాల కలుషిత కలయికలో...
గొంతునిండా గరళాన్ని నింపుకు ప్రవహిస్తోన్న
పరమేశ్వరుడది.
నదంటే ప్రవహించే జీవకళ...
ఉరకలేసే చైతన్యం...
నదితో కలిసి నాలుగడుగులేస్తే చాలు..
గుండెకి తడి తగులుతుంది.
నదిలో మునికి నేను పునీతుడి నయ్యానో లేదోగానీ...
నాలోకి దూకి నది కవిత్వమయ్యింది
నదిలోంచి తొంగి చూడాలనుకొనే
నిరాశల ఎడారి ముఖాన్ని
దూరంగా తరిమికొట్టి... నదికి నా మదిని జత చేస్తాను.
నదికి సమాంతరంగా అక్షర ప్రవాహమై... సాగిపోతాను
ఆఖరి నీటిచుక్క ఆవిరయ్యేవరకూ..
* 29-07-2012

పులిపాటి గురుస్వామి || ఈ బ్రాంచిలో వాతావరణం మార్పు లేదు ||

నాకు అర్ధం కాని చాలా వాటిలో
నిన్నూకలుపుకున్నాను

అయినా ఇష్టం కంటే
ఒకడుగు ముందు వరుసలో
నిన్ను పలకరిస్తాను

నువు బహుకరించలేని
రంగులకల నాకు మాత్రం
ఎందుకు ?

బతుకంతా అందమైన పైంటింగ్ లా
అలంకరించాలంటావు

అందరికీ ఉండేవి మైనస్ చేస్తే
మిగిలేదే మనమంటే ఒప్పుకోవు

ఇప్పటి పూల మీద
వాలిపోవే సీతకోకచిలుకా

రేపటి పూసేవి మాట అటుంచు
ఇవి ముసలివైపోతాయి ...

మరణాన్ని రానివ్వని
రిఫ్రిజిరేటర్ ఇంకా
మార్కెట్ లో లేదు.

*30-07-2012

భవానీ ఫణి కవిత

ఒక చిన్న ప్రేమ పవనం
మలయమారుతంలా తాకింది ...

తన కన్నుల ఆత్మీయపు స్పర్శ
నా కన్నుల్ని ఆనంద సాగరం చేసింది ....

ఎదురెదురైన ఆ క్షణాలు
మునుపటి జ్ఞాపకాల్ని
మనసు ముంగిట నిలిపాయి .....

ఎక్కడ దాక్కుందో ఇన్నిరోజులూ...
అదుపులేని ఆప్యాయత
లావాలా పొంగింది ....

కలిసేది విడిపోయేందుకే
అన్న కఠినమైన వాస్తవం మాత్రం
కన్నీటి ఉప్పెనై
కలల్ని కడతేర్చింది.

*30-07-2012

కవితా చక్ర || ఆశ...ఆశ...ఆశ!! ||


అరటాకు హ్రుదయం పై-
క్రుత్రిమ మాటల గునపాలు దిగినా...
మనస్పుష్పంలో విరిసిన మధురోహలు..
... ... వాస్తవిక శరములై విజయ పథంలోకి
దూసికుపోతాయనే ఆశ!

అస్పష్టపు అగాధ వేదన-
ఆషాడపు వర్ష నిశీధిలా మనోక్రుతిని అల్లుకున్నా...
ఒక ఓదార్పు మణి దీపమై
నిర్లిప్త హ్రుదిని...
ఉత్తేజపరుస్తుందనే ఆశ!!

అడియాసల పొడి ఇసుకతో కట్టుకున్న ఇళ్ళు
నిరాశల తడి తుఫానులో కొట్టుకుపొయినా...
పడిగాపుల యెడారి జీవితంలో...
ఒక అనురాగపు జడివాన
కురుస్తుందనే ఆశ..!!

అభిఖ్యాన్ని అధీష్టించుటకై-
పరుగులు తీసె జీవితగమనం..
అలసి, సొలసి సొమ్మసిల్లేనని సంకుచిత లోకం...
పరిహసించినా..
నన్ను నేను నుట్టుకుంటూ...
జీవిత సాఫల్యం సాధిస్తాననే ఆశ..!!
*30-07-2012

కవితా రక్ష || వెళ్ళిపో నేస్తమా.. ||

నీది కాని నా ప్రపంచం నుండి..
నేను నేను గా లేని నా లోకం నుండి...
ఒక స్వప్నం మధుర పుష్పంలా..
విరబూయకముందు..
... అందమైన కోరిక..కెరటంలా
వొళ్ళు విరుచుకుని,
ఉప్పెనెలా నిను ముంచేయకముందు..
నీకై నీవుగా వెళ్ళిపో..
నీ తలపు దావాగ్ని
నను దహించకముందు..
యెదలో..
అందమైన భావం
ఆవిరవ్వకముందే..
నా లోకపు మగతలో..
నేనున్నప్పుడే...
మది తీరం దాటి
వెళ్ళు నేస్తమా...
*30-07-2012

శాంతిశ్రీ శాంతి || అయితే ఏం చేద్దాం? ||

బతుకుల నిండా కష్టాలున్నాయి
పేదలందరికీ బాధలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ సూర్యోదయాన నిర్ణయించేద్దాం
ఒక్కసారి పోరాటాల వెలుగులో కలబోసుకుందాం
ఆ కష్టాలన్నీ పంచుకో వెచ్చని వెలుతురులో..

పల్లెల నిండా కోకోకోలాలున్నాయి
రైతులందరికీ రుణాలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ వానచినుకులా ఆలోచించేద్దాం
ఒక్కసారి అందరం కలిసి చేయిచేయి కలుపుదాం
ఆ చినుకులన్నీ కలిసి ఏరులైన ప్రవాహంలో..

పట్టణాలంతా సంస్కరణలున్నాయి
ప్రజలందరికీ భారాలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ పసిపాపలా నిక్కచ్చిగా అడిగేద్దాం
ఒక్కసారి అడుగు ముందుకు కదుపుదాం
ఆ అడుగులన్నీ కదిలే మహౌద్యమ ప్రదర్శనలో..

ప్రపంచమంతా ప్రకోపాలున్నాయి
విశ్వజనావళికీ వెతలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఒక్కసారి వెల్లువలా ఎగసిపడదాం
ఆ వెల్లువ ఉధృతిలో..
ఈ దోపిడీకి మూలమైన వ్యవస్థను ముంచేద్దాం..!
ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మిద్దాం..!!

*30-07-2012

ఫణి కుమార్ శర్మ భమిడిపాటి || ఏడున్నది నీ కులం ! ||

నా కులం
మా కులం
మేమే కామందులం అంటావ్
ఏడున్నది నీ కులం !

నీఇంటి ఆడపిల్లలు
తోబుట్టవులు పసిమోగ్గలా !
నీ కీచక చూపుల ఆకలి కళ్ళకు
ముడుచుకు పోతున్న ఎన్నో సుమాలలో ...ఏడున్నది నీ కులం

వారసత్వపు ముసుగులో
చేతగాని నీ వారసులకు అందలాలు
స్వేదం రక్తం చిందించి
నీ ప్రగతి పునాదుల గోడలకు లోకం చూపెట్టిన

నీ వాళ్ళు
నిను నమ్మిన వాళ్ళు
నీ కల్లబొల్లి మాటలకు
వాళ్ళ జీవితం జీతం గా ఇచ్చే శ్రామికులు కారా వారసులు !....ఏడున్నది నీ కులం

రాచరికాన్ని చీల్చి
ప్రజాస్వామ్య దీపం వెలిగించి
మనమంతా ఒకటని నమ్మించి
కులం చమురుతో రంగుల చీకటిని చిమ్ముతున్నావ్ ! ......ఏడున్నది నీ కులం
*30-07-2012

అప్సర్ || కావేరి వొడ్డున ||


1

బెంగ
నువ్వు కడుపుతో పొంగి పొర్లుతున్నప్పుడు
నీలోపల కాయితప్పడవనై మునిగిపోలేదే అని!
నీ తొలి యవ్వనపు నడుం మెలిక మీద
అరనీటి బిందువై ఆడుకోలేదే అని!
నీ తడిచూపులో నిలిచి
వొక ఆకాశమయినా నీతో కలిసి పంచుకోలేదే అని.

2
కావేరీ,
నువ్విప్పుడు చిక్కి సగమయిన పద్యానివి.
నీ వొడ్డు మీద నేనొక అలసిపోయిన పడవని.
నీ వొంటిని ఆరేస్తున్న ఆ పసుపు చీరల
మడతల్లోకి పారిపోయిన పసితనాన్ని.

3
తృప్తికేం, వుంది!

ఈ కళ్ల చివర ఏదో వొక మూల
నువ్వున్నావన్న తృప్తి లేకపోలేదు.

4
కానీ
కంటి నిండా సముద్రాన్ని
దాచుకోవాలని కదా, నేనొచ్చా.
నీ పక్కటెముక చుట్టూ అలల చేతుల ప్రవాహమవ్వాలని కదా, వచ్చా.

5
కాదా మరి కావేరీ!


(శ్రీరంగంలో కావేరీ వొడ్డున వొక పొద్దున)

*29-07-2012

జయశ్రీ నాయుడు || నీ ఉనికి ||

నువ్వు అంటేనే ఉలిక్కి పడే మనసు
గతి తప్పే గుండె వూసు..
రెంటికీ సంధి కుదిరిందేమో

నీ తలపు వచ్చి పలకరించినా
ఉలుకూ పలుకూ లేకుందీ...

కలలు కలం లో ఇంకి పోయాయి
సిరా లేని వ్రాతే మిగిలింది
సాక్షిగా

కళ్ళేమో
గగనాన్ని నింపుకుని
దిక్కులొద్దన్నాయి

వాకిళ్ళలో
ఎవరు నింపి వెళ్ళారో
తెలియని రంగవల్లులు

మాటల్లో మౌనం
మౌనం లో అంతర్ముఖం
అంతర్లీనమైన
ఆలొచనం

నువ్వు నువ్వుగా లేవు
నాలో భావానివయ్యావు
నీ ఉనికితో నాకేం పని ఇక

మేనులను దాటిన అనంతం
దిక్కుల్ని ధిక్కరించిన గగనం
నాలో నేనంతా ఇక నీలో నేను.

*29-07-2012

ఉషారాణి కందాళ కవిత

ప్రతి స్త్రీ జీవిత చిత్రం నిత్యనూతన చిత్రార్ణవమే!
ప్రతి స్త్ర్రీ హృదయం నిరంతర స్వప్నావశిష్టమే!
మనసు నిండా రంగవల్లులై అల్లుకునే కళకళల కలలు!
ఎప్పటికప్పుడు కళ్ళల్లో కొంగ్రొత్త ఇంద్ర ధనస్సులు!
ఏ దశకాదశ ఆకృతి మారుతూ సాకారించే ఊహలు!
పాపాయి కల్లల్లో పువ్వులు మాట్లాడతాయి, మబ్బులు గంతులేస్తాయి!
అమ్మాయి కళ్ళల్లో హరివిల్లులు విరబూస్తాయి, వెన్నెల పక్కలు పరచుకుంటాయి!
అమ్మ కలల్లో పిల్లలు ఎదిగెదిగి గొప్పవాళ్ళైతారు, గంపెడు గోల్డ్ మెడల్స్ వాళ్ళవే!
అమ్మమ్మ కళ్ళల్లో నిన్నలమొన్నల గతాన్ని గుర్తుచేస్తూ తడారని మెరుపులధారలు!
అసలింతంటి అంకిత భావం మగువకు ఎలా సమర్పించుకున్నడా దేవుడు?
స్వతహాగా తాను మగవాడై వుండీ తన జాతి కన్న మిన్నగా స్త్రీ నెలా మలచాడు?
ఎందుకంటే శక్తిస్వరూపం అమ్మేనని సర్వజగద్రక్షకుడు నమ్మాడు కాబట్టి!
జన్మనిచ్చే అమ్మ సాక్షత్తూ బ్రహ్మ, కంటిపాపలా కాచే అమ్మ శ్రీరామ రక్ష,
శిక్షణ వేళల్లో తానే గురుశక్తి ,తప్పులు దిద్దే తల్లి శివదండం!
లాలిపాటలు వినే బుజ్జాయి ఎదిగి జోలల తో ఉయ్యాల ఊపే మాతృమూర్తి ఐ,
ఊరికి దక్షిణాన నిశ్శబ్ద జ్ఞాపకంగా నిద్రించే ఆఖరి క్షణం వరకు..
ఒక ఆడజన్మ చెక్కు చెదరని బాధ్యతకు చిరునామా!
నేస్తం! స్త్ర్రీత్వాన్నే తప్ప స్త్రీ మహోన్నత్వాన్ని చూడలేని
గుడ్డికళ్ళకు మీజన్మ అమ్మ ఇచ్చిన భిక్ష అన్న వాస్తవం
ఎప్పుడూ గుండెల్లో గుర్తుండేలా ఏదైనా పచ్చబొట్టు కనిపెడదామా?
*29-07-2012

కవి యాకూబ్ || ఆకుపచ్చని గాలి ||

తొమ్మిదో అంతస్తు పెంట్ హౌజ్ వాకిట్లో కూచుని
నాలో నేను ఒక జ్ఞాపకాన్ని సరికొత్తగా మళ్ళీ పలకరించాను.

త్రివేండ్రం నా ఒకానొక పదేళ్ల వయస్సున్న జ్ఞాపకం-
అయ్యప్ప ఫణిక్కర్ ముసి ముసినవ్వుల్లో
చిక్కుకుని సేదతీరిన జ్ఞాపకం.
చిద్విలాసంగా,గంభీరంగా కవిత్వాన్ని పల్కరించిన జ్ఞాపకం.

కొబ్బరాకుల సందుల్లోంచి తొంగిచూస్తూ
అల్లరల్లరి ఆటలమధ్య అలిసిన ఎందపొడలాంటి జ్ఞాపకం.

సముద్రమ్మీది నుండి కావాలనే తప్పిపోయి
నగరవీధుల్లో జులాయిగా తిరుగుతూ
మామధ్యన దూరి జుత్తంతా చెదరగొట్టి చిక్కకుండా
పారిపోయిన సముద్రపుగాలి జ్ఞాపకం.

ఎటుచూసినా ఆకుపచ్చని గాలి.
ఆకుపచ్చని జీవితం,ఆకుపచ్చని ఊహ,స్పందన,పలకరింపు,
కరచాలనం,అనుబంధం-

బెంగగా శాంతన్ హరిదాసన్ బైకుమీద కూచుని
ఆ వీధిలోంచి పదేళ్లకిందటి కలయికను తలుస్తూ
సాగిపోయాను.
జ్ఞాపకం-
పుటలు పుటలుగా మారి నా ముందు కదులుతోంది.
ఫణిక్కర్ లేని వాకిలిని మోస్తూ త్రివేండ్రంలో ఆ ఇల్లు
అట్టవేయని పుస్తకంలా మాసిపోయింది.
ఎవరో పిలుస్తున్నట్టు మళ్లీ మళ్ళీ వెనక్కితిరిగిచూస్తూ
దాటిపోయాను,అలా పిలుపు వినబడాలని ఎదురుచూస్తూ-

ఆ పిలుపు వినబడనే లేదు.
ఆ పిలుపుకోసం వెదుకుతూ
ఇలా ఈ తొమ్మిదో అంతస్తులో ప్రియదాసు ఇంటివాకిట్లో-
ఆకుపచ్చగాలి
విసురుగా ఏదో చెపుతూ,నాచుట్టే తిరుగుతూ-
మా మధ్యలోంచి అటుఇటూ పరుగులు పెడుతూనే ఉంది.

కొన్నికబుర్లు,ఇంకొన్ని జ్ఞాపకాలూ ముగిసాక
ఆ ఆకుపచ్చని గాలి ,కొన్ని వర్షపు తుంపరల్ని తోడు తెచ్చుకుంది.
ఇక తప్పనిసరై ఇంటిలోకి అడుగుపెట్టామో లేదో
ఫణిక్కర్ నవ్వుతూ గోడమీంచి
ఆ ఆకుపచ్చనిగాలితో మాట్లాడుతూ కనిపించాడు.

*29-07-2012

పులిపాటి గురుస్వామి || పోగుల పోగుల బాల్యం ||

మగ్గం చూడగానే
గుంటలో నుండి బాల్యం
పలకరిస్తుంది

నాయిన అందులో నుండి
కండె తెమ్మంటాడు
రాత్రి పగలు కరెంటు బుగ్గ కింద
మెరుస్తూ, జీవితాన్ని
మెట్టు మెట్టు కుదిరిచ్చుకుంటూ
తెగిన రోజును అతుక్కుంటూ
నన్ను నేసుకొచ్చాడు

తెల్లారగట్ల నన్ను
చదువుకోమని లేపినపుడు
ఆయన అప్పటికే పట్టు
దారాలతో ప్రకృతికి
రంగులద్దుతూ
నాడె విసిరి సూర్యుడికి దారం చుట్టేవాడు

అమ్మ రాట్నం చప్పుడు
గిర గిరా కలల లోకాన్ని
తిప్పి తిప్పి
దబుక్కున నేల మీద
నాన్న విసిరిన ఖాళీ
ఊస చప్పుడుకు రాలిపడి
పుస్తకాల నిద్ర ను తిరగేసుకుంటూ నేను

ఊరు
మగ్గం
నాన్న
నా బాల్యం
అన్ని కలిసిన రంగురంగుల
పూల వాసనల నిలువు పేకల నేత
కమ్మని ఇంట్లోంచి దొంగిలించి
సందులో సప్పరించిన
పిప్పరమెంటు గోలి.
*29-07-2012

30, జులై 2012, సోమవారం

రఘు మందాటి కవిత

మాటలను మూటగట్టుకొని నా కలం నిదోరుతున్నది.
మేలుకొలిపే దృశ్యమాలిక చీకటిని దిద్దుకున్నది.
విసురుమన్న చల్లని గాలి కిక్కురుమనక దుప్పటి కప్పుకున్నది.
మౌనం మనసుకా ? లేక నా ఊహకా ? ఏమో....
ఎదురుకున్న ఎన్నో అనుభవాలు నా వెంటే నడిచోస్తున్న
తీపి మాయల గిలిగింతలో పులకిస్తున్న.
అక్షరంలో బంధించలేని ఓ నిర్బాగ్యున్ని..
కాలం చెరసాలలో నా కలం బందీ ఆయినదా లేక బందీని చేసాన?
అక్షరం నాకు దొరక్కో లేక నేనే అక్షరానికి సరి తూగకనో
కలానికి నా మాట వినపదట్లేదో లేక నాలోని మాటే మూగాబోయినదో ఏమో..
మొత్తానికి నను నా లోకంలో ఒంటరిని చేసింది..
ఇంకా ఎంతకాలమో ఈ నిశ్శబ్ద యాతన.........

*29-07-2012

అవ్వారి నాగరాజు || విదళనం ||

చేతనలనన్నింటినీ
సుషుప్తిలోనికి జార్చి
రాసుకున్న ఒక్కో మాటనీ నిశ్శబ్ధంగా పలక చెరిపేసి
తన లోపల తనే ఎక్కడో మణిగి
ఉండీ ఉండీ విస్పోటనమయి

ఎవడి లోకం వాడిదయిన కాలాలకు కావిలికానిగా
ఒక్కడే తల వాకిటికావల
మట్టి కొట్టుకొని శిరస్సుపై ఖగోళ ధూళితో
విశ్వాంతర్గత రహస్య సంభాషణలకెక్కడో చెవినొగ్గి

తనే ఒక దారిగా విస్తరించి నడుచుక పోయే
మనుజుడొకడున్నాడు నాయనా
మనుజుడొకడున్నాడు

తలుపు తీయ్ కాసింత
అటునూ ఇటూనూ వేరు చేస్తూ పలుచని పొర ఎక్కడుందో వెతకాలి
పగిలిన ఒక్కో ముక్కా కలిపి ఎప్పటికైనా వీలవుతుందేమో అతకాలి

తలుపు తీయ్ నాయనా తలుపు తీయ్

*29-07-2012

అవ్వారి నాగరాజు || ఒకరోజు ||


పాపా నిన్ను చూసాను

నల్లని నీ కన్నుల ఆవరణంలో ప్రసరించే తడి వెలుగులో నిన్ను చూసాను

తేరిపారగ చూసే ఒక పువ్వు
తన లేలేత వేళ్ళతో ముట్టుకొన్నప్పుడు సుతారపు రేకులు రేకులుగా
విప్పారుతూ నిన్ను చూసాను

నీ స్పర్శల పులకింతలో మొలకలెత్తి మన్ను దోసిలి పొరల దాటుతూ నిన్ను చూసాను

వొడలని తేజమేదో నీ చుట్టూ పరిభ్రమిస్తుండగా
మనుషులు చేసే ప్రయాణాలలో తరుచూ ఎందుకంతగా చెరిగిపోతారో తెలియని
సంభ్రమంతో నిన్ను చూసాను

నీ తేజపు సౌందర్య దీప్తిలో
ఒక భాష్పపు దీపమై వెలుగుతూ చెంపల జారి నిన్ను చూసాను

పాపా నిన్ను చూసాను.

*29-07-2012

రామాచారి బంగారు || కవి(త)త్వం ||

ఏ కాలంలోనైన
కవి మదిగదిలోని
జనహిత లోచనాల
యోచన కవిత్వం
యేటిఒడ్డున ఇసుక
వూటలోని నీటిలాగా
ఎప్పటికప్పుడు
తోడబడుతుండాలి.

*29-07-2012

ధనలక్ష్మి బూర్లగడ్డ కవిత

నేను నాకే ఒక్కోసారి కొత్తగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి వింతగా ఉంటా
నేను నాకు ఒక్కోసారి చెలాకిగా ఉంటా
నేను నాకే ఒక్కోసారి కష్టంగా ఉంటా
ఏదేమైనా నాలో నేనే అన్నీ దాచుకుంటా మౌనంగా
నా ప్రపంచమే వేరే
నాకు నేనే ప్రత్యేకం
నాకు నేనే అన్నీ ఆ ఒక్క క్షణంలో
నేను ఒక్క దాన్నే ఉండటమే నాకు ఇష్టం
నిరాశ నన్ను అల్లుతుంది ఒక్కో నిమిషం
కన్నీటి బొట్టే నాకు నేస్తం
మాట రాక మనసు కలవర పడితే
అప్పుడే కాగితం తోడయ్యి కాదన్నా
కవితలా మారి కలం నుండి కాగితంపైకి వచ్చేస్తుంది
నా కవితను చదవడమే నా మనసుకి ఒక ఓదార్పు
ఆ ఓదార్పుతోనే నిదుర ఆదరించి నన్ను హక్కునచేర్చుకుంది
కొత్త ఆశల వెల్లువను కలలుగా అందిస్తూ
మౌనాన్ని మెల్లగా పక్కకు నెట్టేస్తూ
మరో కొత్త ఉదయాన్ని ముద్దుగా ముందుకు తెస్తూ.
*29-07-2012

సురేష్ వంగురి కవిత

ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది
జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది

ఆమె ఎదుట పడగానే ఎందుకింత అదురు నాలో
మానుతున్న గాయాన్ని రేపినట్టుగా ఉంది

ఇన్నాళ్లకు ఎదురైనా పలకరించదేమిటో
గొంతులోన శోకమొకటి కురిసినట్టుగా ఉంది

చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే
కళ్ళలోన సంద్రమొకటి కదిలినట్టుగా ఉంది

ఈ అవస్థను ఏమనాలో చెబుతావా వంగూరీ
సరదాగా బ్రతికించి ఛంపినట్టుగా ఉంది.
*29-07-2012

కె. కె. || రాశి ||

మెరుపు మెరిసినంత మాత్రాన
వానచినుకు రాలదు
నిబ్బరంగా నిలబడ్డ
మేఘగర్బం మెలితిరిగితే తప్ప,

తలగోక్కున్నంత మాత్రాన
ఆలోచన తట్టదు
సమయస్పూర్తి, సంపూర్ణ ఆర్తితో
మేధకు పదునుపెడితే తప్ప,

నాట్లు వేసినంత మాత్రాన
పైరు ఏపుగా పెరగదు
కలుపు తీస్తూ, ఎరువులేస్తూ
పుడమితల్లిని లాలిస్తే తప్ప,

మీట నొక్కినంత మాత్రాన
వాహనం నడవదు
నిదానంగా, నిలకడగా
నియంత్రణతో నడిపితే తప్ప,

కలం పట్టినంత మాత్రాన
మంచికవిత జనియించదు
ఆవులిస్తున్న కలం ఒళ్ళువిదిల్చి
మనసుతో లోకాన్ని చూస్తే తప్ప,

రాసినదంతా రాశిగా పొయ్యి,
జల్లెడ కుదుపుకి ఆగినదిమాత్రమే జనానికి ఇయ్యి.

*29-07-2012

ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ || E=mc^2 ||


నీ కోసం

యుగాల్నే క్షణాలుగా మార్చి...
కాలాన్నే ఏమార్చి...
అనంతాల్ని చూసి...
దిగంతాల్ని దాటి...
కాంతి వేగంతో నే వస్తే...

నా ఆయాసాన్ని ఆక్రోశంగా మారుస్తూ
అప్పుడు తెలిసింది...
సమస్త విశ్వం తల్లకిందులయ్యే నిజం
కాలం స్తంభించిపోయిన ఆ క్షణం...
నీవు చెప్పిన ఒకే ఒక అబద్ధం.

ప్రకాష్ మల్లవోలు కవిత

సమాజపు కుళ్ళును ,
అసమానతలను అరికట్టేందుకు

అజ్ఞాన అంధకారానికి
అలవాటుపడ్డ కళ్ళకు జ్ఞానాన్నిచ్చేది
నేనున్నా అంటూ మెదిలేది

మేధలోంచి కలం ద్వారా పురుడోసుకుని
భావాలకు అక్షర రూపమిస్తూ

కళ్ళు తెరుచుకుని నిద్ర పోతున్న మెదళ్ళకు
విద్యుద్ఘాతం లా తాకి ,

బద్దకంలో వేళ్ళూనుకున్న మొదళ్ళను
కూకటి వేళ్ళతో పెకలిస్తూ,

ముందుకు నడిపించేది కవిత్వం
కదిలించేది కవిత్వం.

మేల్కొలిపేది , ఆలోచింపచేసేది కవిత్వం .

విజ్ఞతతో , విచక్షణతో
అలరారుతూ, భావంతో ప్రాభవాన్ని గడిస్తూ,
వైభవంగా వెలిగేది
కలకాలం మనసులో నిలిచేది కవిత్వం ....

ప్రాస ఉంటే చాలదు
పస ఉంటేనే అది కవిత్వం.

ప్రాసతో నిండి పస లేకు౦టే
అది కవిత్వమనిపిచ్చుకోదు

భావనలతో నిండి ఉంటే
చాలు అది భావుకత్వం...

(కాదిది ఎవరి నిర్వచనం
నా మనసులో మెదిలిన వచనం
తప్పైతే సరిదిద్దండి )
*29-07-2012

వంశీదర్ రెడ్డి || ‎‎* జీతగాడు *.||

"రేయ్, ఆనందం, యాడున్నవ్ రా,
గోదలకొట్టంల కుడిదిగోళం మీద
గిలాస తెచ్చుకో,
శాయ బొట్టు తాగి, బిరాన
చేన్ల కొర్రుకాడికి వోవాలె,
పటేల్కు జెప్పు, పొద్మీకి
పొలంల తాటికల్లు దింపియ్యమని,
మన్మడొస్తుండు పట్నంకెల్లి"

"చిన్న పటేలత్తాండా దొర్సానీ,
ముంజెలు, ఈతపండ్లు గుడ్క తెత్తునా",
తాగిన శా గిలాస కడిగి
అంగీకి తుడుసుకుంట ఆనందం,

* * * * * * * * * * * * * * * * * * * * *

"ఆనందం మంచిగున్నవ,
కొడుకెట్లుండు, ఇంటర్ కదా,
పుస్తకాలేమన్న అవసరముంటె జెప్పు, పంపుత,
ఇంట్లెవర్లేరయా, జెర్సేపు కూసో"
కుడి చేతిల పూరి తున్క,
పొద్దుగాల్ల సంపిన కోడి అంచుకువెట్కొని,
ఎడమ చేత్తోటి తాటికల్లు తాక్కుంట,
బేకోట్లు తీస్కుంట,
చిన్న పటేల్, పట్నంకెల్లొచ్చినట్టుండు..

"బాంచన్ పటేలా,
వానికి సదువెందుకు, కైకిలి పోతాండు,
వాగు మీద లారీలకు ఇశ్క ఎక్కియ్యనీకి",

"బాంచన్,బాంచన్ అనుకుంట
బానిసల్లెక్క బతుకుర్రి,
మా పట్నంల గివేమ్ నడువై, అందరొకటే,
ఎప్పుడు మార్తరయా ఇంకా"
పండ్లల్ల ఇరికిన కోడి బొక్క
గోళ్ళతోని తీస్కుంట చిన్న పటేల్,

"మారుడంటేంది దొరా,
తాత, పోతె, నాయిన, ఆయిన పోతె, మన్మని
కాడ పన్జేసుడేనా,
మా అయ్యను సంపిర్రు సర్పంచెలక్షన్ల పోటీ చేస్తే,
నా కొడుకు నాలిక కోశిర్రు, కాపోల్ల పొల్లతోని మాట్లాడ్తె,
మా ఇండ్లల్ల కూడ ఎవరొ
ఇద్దరు, ముగ్గురు సదూకొని,
సర్కార్ కొలువు చేయవట్టె పట్నంల,
వాడేదో ఆపతిల సోపతైతడనుకుంటే,
ఒక్కసారి ఆడికి పోయినోడు , మల్లీడికేమొస్తడు,
చౌరస్త కాడ, అంబేద్కర్,
మా ఇండ్లను జూస్కుంట,
ఊరిబైటికి వేళ్ళు సూపిస్తడు, ఏంటికో ఎరికేనా పటేలా,
"ఊర్లకు రాకుండ్రా, వొస్తె, సంపుతరు,
ఆడ్నె బతుకుర్రి" అని,

"ఏం రా వారి,
ఏం ముచ్చట్లు వెడ్తున్నవ్ మనుమని తోని,
గిలాస తెచ్చుకో పో, కల్లు పోస్తా" పెద్ద పటేల్,

గిలాస కడిగి,
గోసలెక్క కల్లులొట్టి కాడికి పోకుంట,
ఆనందం....

-29-07-2012

పెరుగు రామకృష్ణ || స్వార్ది.. ||

కొమ్మ చివురు తొడిగేందుకు
ఆనందంగా రాలిపోతుంది
పండుటాకు..

మనసు బరువు దించేందుకు
కన్నువీడి ధారగా జారి పోతుంది
కన్నీరు ..

ముత్యమై మెరిసి పోయేందుకు
ఆకాశాన్ని వొదిలేస్తుంది
చినుకు..

తన సుఖం కోసం
ఎదుటి మనిషి చిర్నవ్వులన్నీ
దోచేసుకుంటాడు
మనిషి..
-29-07-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి కవిత

“ఎక్స్ ప్లాయ్ టేషన్”
“ఎక్స్ ప్లాయ్ టేషన్”
సాకు- బాకు అవుతుంది నా దేశంలో...
బహీనత- వజ్రాయుధమవుతుంది నా దేశంలో-

మరణాలేవైనా మార్గం సులభతరం చేస్తాయి –మాకు ఉపకరణాలై...
ఆత్మహత్యలేవైనా మారిపోతాయి- మాకు తిరుగు లేని అస్త్రాలై...

కేజ్ లు..లింకేజ్ లు..పై పై మసాజ్ లు
మాఫీలు.. మద్దతులు..మడతపేచీలు కుచ్చు టోపీలు
కంటి తుడుపులన్నీ..కపట నీతులు..కుటిల గోతులు
మేమేం తక్కువ తిన్నమా.. మేం మాత్రం వెధవాయిలం అనుకొన్నావా
ఊరడింపుచర్యలు బ్లాక్ మెయిలింగ్ల్ లై రొమ్మువిరుచుకొంటాయి....
రాయితీలు తేఱగా దొరికే తాయిలాలుగా రూపు మార్చుకొంటాయి..
రిజర్వేషన్లు జన్మహక్కై రాజ్యమేలుతుంటాయి-
సబ్సిడీలు తాత సొమ్మై సోమరితనం పెంచుతుంటాయి..
ఓట్లు వక్రమార్గాల అక్రమాలు నేర్పుతుంటాయి
హక్కులు రెక్కలువిప్పుకొని విశృంఖలంగా సొమ్ముచేసుకొంటాయి

పురుషాధిక్యం
పేదరికం
నిరక్ష్యరాస్యత
వెనకబాటుతనం
కులాలు
మతాలు
అవకరాలు
అవలక్షణాలు
అజ్ఞానం
ఏదైనా కావచ్చు ప్రతిదీ ఓ చిచ్చు!!
అన్నీ అర్హతలే నాదేశంలో-“ఈజీ మనీ” కి
అన్నీ అవకాశాలే నాదేశంలో-“లేజీ మాన్ ”కి

ఇది విషవలయం-ఎవరిని ఎప్పుడు ముంచేస్తుందో
ఇది తేన తుట్టే-కదిపితే ఎవరిని కబళిస్తుందో
ఇది పులిపై స్వారీ- దిగితే ఎవరిని మ్రింగేస్తుందో
అందుకే వీటిని ఇలాగే ఉండనిస్తారు...
వీటిని ఇంకా ఇంకా పెంచి పోషిస్తారు..
రోగికోరేదీ కమ్మని తీయని మందే..! వైద్యుడు ఇచ్చేదీ జబ్బు మానని మందే..!!
ఉన్నతమైన స్వావలంబనకు ఎన్నడూ ఊతమీయరు..
ఉదాత్తమైన సాధికారతకు ఎప్పుడూ పట్టం కట్టరు...
వీటిని పెంచి పోషిస్తేనే- రాజకీయ మనుగడ !
కాదుపొమ్మంటే అమ్మో-నిత్యం రగడ !!
ఎవరిస్థాయిలో వాళ్ళు...
ఎవరికందినంత వాళ్ళు...
దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా
గుంజుకున్న వాడికి నంజుకుంన్నంత నారాయణా
నిస్సహాయంగా,అశక్తతతో,దీనంగా,బ్రతుకు దుర్భరమై
ప్రకృతి వైపరిత్యనికో విధి విలాసానికో ఎదురీదలేక
కొట్టుమిట్టాడే జీవికి తిరిగి నిలద్రొక్కు కోడానికి
అందించే చిరుసాయం-!
అదే అదనుగా,అదే ఆసరగా, అదే అవకాశంగా ఎగబడే
బాగా బలిసిన డేగలు,కందిరీగలు
రాబందులు,పందులు,
నక్కలు, పంది కొక్కులు,
గబ్బిలాలు ,గుడ్లగూబలు
నోటికాడి కూడు తన్నుకపోయే మాయోపాయం-!!
పథకాలకు తిలోదకాలు..
సిద్ధాంతాలకు పిండ ప్రదానాలు...
ప్రగతికి తగ్గని విరోచనాలు..!!!

29-07-2012

కట్టా శ్రీనివాస్ || డబ డబ సోడబ్బా ||

భజనలూ, భుజకీర్తులూ

భాగ్య సంపదై భాసించేందుకు

కప్పల తక్కెడ తోక్కిసలాటలో

గంపగుత్తగా ఇస్తున్నార్ట.



చిడతలూ, బుర్రకధలూ

చెప్పుకుంటూ శోభిల్లేందుకు

తప్పని తిప్పల తాయిలాలతో

తయారుగానే వుంటుండాలట.



వందిమాగదుల వందనాలకై

వందల వరదలు వదలాల్సిందేనట.

బట్రాజ, భజంత్రీలకై

భవధీయులై భజించాల్సిందేనట.



ముంజేతి కంకణాలూ

ముంగిట్లో మంగళారతులు

ముందస్తుగా మాకనుకుంటేనే

మంది బలంతో మజా వస్తుందట.



అంగట్లో నీ తూకం

వ్యర్దాలతో వేసుకుంటావా ?

ముంగిట్లో ఓ అర్ధం

సమర్ధతతో వెతుక్కుంటావా?



తెలుసుకునేదీ, తేల్చుకునేదీ

నీలో నువ్వే

నీతో నువ్వే...

- సిరి.కట్టా
29-07-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి || జీవిత పరమార్థం ||


నేనే
అన్నిటికీ కారణం అనుకుంటే

ఈ క్షణం
నే అనుభవిస్తే

ఏదీ ఆశించకుంటే

ప్రతిదీ స్వీకరిస్తే

అంతా మంచికేనని భావిస్తే

జీవితంలో ఏదైనా భాగమే నని
ఇది ఇంతేనని, సహజమేనని తలపోస్తే

బ్రతికినంతకాలం అందరితో కలిసి మెలిసి
హాయిగా జీవిస్తే

ఆనందం!
బ్రహ్మానందం!!
పరమానందం!!!
29-07-2012

వేంపల్లి గంగాధర్ కవిత


రాక పోదు ... రాక పోదు ...
దిక్కులన్నీ మునిగేలా ఉప్పెనొకటి రాక పోదు ...

రాక పోదు ... రాక పోదు ...
ఆకాశం అదిరేలా గర్జనొకటి రాక పోదు....

నల్ల యుద్ద నౌక ఒకటి
నీ తీరం ముట్టడించి ...
నీ చరిత కు నిప్పు పెట్టి ...నీ బతుకు కు పాతరెట్టి....
నీ సౌధం కూలగొట్టి .... నిను తరిమి తరిమి వెళ్ళగొట్టు ....
రోజొక్కటి రాక పోదు ... రాక పోదు ...

దిక్కులన్నీ మునిగేలా ఉప్పెనొకటి రాక పోదు ...
ఆకాశం అదిరేలా గర్జనొకటి రాక పోదు....

రాక పోదు ... రాక పోదు ... !
29-07-2012

శాంతిశ్రీ శాంతి || అమ్మానాన్న..! ||

మొదటి స్పర్శ అమ్మ
ఆ స్పర్శకు ప్రతిస్పర్శ నాన్న
ఆరని దీపం అమ్మ
ఆగని ప్రవాహం నాన్న
అమ్మ లాలిస్తే
నాన్న ఆడిస్తాడు
అమ్మ ఒడే నేల
నాన్న భుజమే నింగి
వారి ప్రేమ పూదోటలో
వికసించే పుష్పాలం
అమ్మ జోల అమృతం
నాన్న ఆలన విజయం
మన ఆనందమే వారానందం
దెబ్బ తగలగానే అందరూ
అనేేది 'అమ్మా! అయ్యా!'
ఏమిచ్చినా తీర్చుకోలేని ఋణం
అంత్యదశలో వారికి అమ్మానాన్నలవడం మన ధర్మం
(అమ్మానాన్నలందరికీ అంకితం..)
-29-07-2012

పరమేశ్వరి పులిపాటి కవిత

నిజం
పక్షులన్ని ఒకలాగే...
పశువులన్ని ఒకలాగే...
తరులన్ని ఒకలాగే...
గిరులన్ని ఒకలాగే...

ఒక్క మనిషే.......

ఒకడేలుతూ..
ఒకడేడుస్తూ..

ఒకడనుభవిస్తూ..
ఒకడడుక్కొంటూ..

ఒకడు గెలుస్తూ..
ఒకడు ఓడుతూ..
*29-07-2012

ఉషారాణి కందాళ కవిత


నేనొక పూలవనం కావాలనుకుంటాను కనీసం గుడ్డిపువ్వును కాలేను! 
నేనొక వెన్నెల జలపాతం కావాలనుకుంటాను కనీసం చిన్ని దీపం కాలేను!
నేనొక అనంతాకాశం కావాలనుకుంటాను కానీ పిల్లమబ్బును కాలేను!
నేనొక శతఘ్నినై ప్రజ్వరిల్లలనుకుంటాను కానీ అగ్గిపుల్లైనా కాలేను!
నేనొక మాహా సముద్రమై ఉప్పొంగాలనుకుంటాను కానీ చిన్ని చెలిమను సైతం కాలేను!
నేనొక శిలావిగ్రహంలా స్థిరమై పోవాలనుకుంటాను, కనీసం చిరునామాకు సైతం నోచుకోను!
నేనొక బృహత్కావ్యాన్ని ఆవిష్కరించాలనుకుంటాను, కనీసం ఒక్క పదం పలకలేను!
నేనొక జీవనదినై ప్రవహించాలనుకుంటాను, కనీసం వీధికొళాయి కాలేను!
నేనొక మాహామనీషినై వెలగాలనుకుంటాను కానీ కనీసం మాములు మనిషిలా మసలలేను!
నేస్తం! ఏన్నెన్నో అనుకుంటూ ఏమీ చేయలేనంటూ తెలుసుకోగలిగినప్పుడు..
అలోచనలన్నీ కన్నీళ్ళు అవుతాయని భయపడ్డాను చిత్రంగా అవి అనుభవాలయ్యాయి.
* 29-07-2012

29, జులై 2012, ఆదివారం

మెర్సీ మార్గరెట్ కవిత


మనసు మగ్గం
మొరాయించలేదెందుకో
ఈ రోజు

నీ జ్ఞాపకాలు నా కాళ్ళకి
చుట్టుకుని
అడుగు ముందుకేయకుండా
చేస్తుంటే

అక్షరాలన్నీ కలిపి
కవిత నేస్తూ
ఒడుకుతున్నా
మాటలన్నీ
దారాలుగా కలిపి చేర్చుతూ

పోగు పోగుకూ
ప్రేమ రంగులద్దుతూ
నాకు నేనే
మనసు మగ్గంపై పరుచుకుంటూ

నిన్ను కప్పబోతున్నానని
అందమైన వస్త్రంలా
హౄదయాన్ని హత్తుకుని
అలా నీతో ఉండి పోనా?
కవితలా ..!?
*28-07-2012

సత్య శ్రీనివాస్ || నడిచే వర్షం ||

పెదవుల
కొంగు
కొస నుండి
జారుతున్న...
వాన
చుక్క
మధువు.
వెలిసిన వర్షం
నాలో మధుశాల.
*28-07-2012

వేంపల్లి గంగాధర్ || వాడొక వ్యాసం .... ||

వాడు
మీకు బాగా పరిచయం
వాడి ముఖం
మీకు ప్రతి చోటా ఎదురు పడుతుంటుంది ...

ఒక్కో సారి వాడు
ఎదురు గాలి కి ఎగిరే
రంగు వెలసిన చిత్తు కాగితం ...
నడి రోడ్డు మధ్య విసిరేసిన
చివరాఖరి సిగరెట్ తుంట ముక్క ...
రైలు ఇనుప కమ్మి ఫై
నలిగి రూపం కోల్పోయిన రూపాయినాణెం....
తోకకు రాయి కట్టిన తూనీగా....
అగ్గి పెట్టె లోని జిరంగి.....
వీధి మలుపులో
కాళ్ళకు అడ్డం పడుతూ
దుక్కం నిండిన చేతులు
వ్యవస్థ ను ఆవిష్కరించే సూచిక !

బాలల దినం నాడు
నీ పత్రిక లో వాడొక వ్యాసం ....
ఒక ఇటుక రాయి మోస్తూ ...కంకర రాయి కొడుతూ ..ఫోటో !
హోటల్ లో ఒక పగిలిన టీ గాజు గ్లాసు ....
రంగు రంగుల ముఖ చిత్రం!

సగం పడిపోయిన గోడ చివర
చినిగిన బట్టలతో
ఆడుకునే గోలీ కాయ...!
వాడు కూడా అవతార మూర్తి…..


ప్రతి ఉదయం తప్పని ప్రయాణం
కొండ దారి లో
పశువుల వెనుక పశువు గా ..
గొర్రెల వెనుక గొర్రె గా ...
బతుకు పోరాటం లో బలి పశువు!

ఇలా
ప్రతి సారీ వాడు
ఎదురు గాలి కి ఎగిరే గాలిపటం !
*28-07-2012

www.vempalligangadhar.com

పులిపాటి గురుస్వామి || చెదల బతుకు ||

చిగుళ్ళు తొడుక్కుంటున్నవెన్నెల్లో
చీకటి కుప్ప తొ మాటలు

నీ ఎముకల మీది
కండరాలేవీ?

నిస్సారమైన నవ్వు
తేమే లేని చూపుల మధ్య
మాంసపు గోడలు
కూలుతున్న చప్పుడు

నీ దాహం తీరుతుందా?

పురుడు పోసుకుంటున్న కొమ్మల
తెగులు పట్టిన కుళ్ళు
నెర్రెలు పారిన నాలుక బయట పెట్టిన
దూపసంజ్ఞ
నదులకు
ఉరితాళ్ళు పన్నిన స్పృహ

కాసేపటి దుర్వాసన విరామం

ఏమైనా చేస్తున్నావా?

ఉమ్మిన పీక్కుతినే చీమల ఆవరణ
భుజమ్మీడుగా జారిన అవయవాలు
కుమ్మిన ఉడికిన మాంసపు కుడుము
నిశ్శబ్దం ముందరి శబ్దం
మూలుగు జవాబు

బతికే వున్నావు
ఇంకా నువు
బతికే వున్నావు

మృత్యువును ప్రేమించు
ధ్యానించు

*28-07-2012

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ || నువ్వే నేను ......||

నువ్వు నేను
నా నువ్వుగా
నీ నేనుగా
ఇద్దరి మనసులు ఒకటిగా....

నీ మాటల్లో
నా మౌనం
నా కోపంలో నీ కన్నీళ్ళ
ఓదార్పుల వెచ్చతనం ...

కలనైనా నీ ఎడబాటు
తెచ్చే కలను కనలేను
ఘడిఐనా భారంగా
నీ దూరాన్ని భరించలేను

నీవు లేవన్న ఆ క్షణం
నిన్ను దాటి నన్ను
ఒంటరిని చేసే మరుక్షణం
నేను లేనన్నది అంతే నిజం.
*28-07-2012

రావి రంగారావు || రెండు రకాలు ||

భామయినా

దోమయినా

కోరిక రేగుతుంది

చీకటిలో...



గాయకుడయినా

నాయకుడయినా

జనాన్ని ముంచుతాడు

మత్తులో...



చీకటయినా

మత్తయినా

రెండు రకాలు,

ఒకటి

సుఖంలో తేల్చేది...

రెండోది

రక్తాన్ని పీల్చేది...
*27-07-2012

28, జులై 2012, శనివారం

జ్యోతి వల్లబోజు కవిత

సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....

కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....

నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...

ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???
*28-07-2012

వర్ణలేఖ కవిత


నీవలా నావలా 
నడిచొస్తుంటే
నే నిను
అలా అలలా
తాకుతుంటే
నీవెన్ని అలలను
ఎదుర్కొన్నావో
నావన్నీ కలలేనని
కనుమరుగయ్యా
నీ నుండి నురగలా 
*28-07-2012

27, జులై 2012, శుక్రవారం

స్వాతీ శ్రీపాద||ఇలా.........||


ఒక్కొక్కపుటా మనసు ముని వేలితో తిరగేసే కొద్దీ
నిలువెల్లా ముంచెత్తె పడగ విప్పిన అలలు
చూపానని మసక గుప్పిస్తూ ఉప్పునీటి తెరలు
పుక్కిలించి ఉక్కిరి బిక్కిరి చేసే నురగల ప్రవాహాలు
ఎన్ని సముద్రాలను శ్రుతి చేసిన అనుభవాలు

అలసి సొలసిన అగరుపొగల ధూపాలూ
మల్లెలు విరజిమ్మిన పరిమళాల ఊపిరిలూ
గాలి తిత్తులనిండా నింపుకున్న గతం మధుర శ్వాసలు
మళ్ళీ మరోసారి ఆ మసక వెలుగుల గతం ఛాయల్లో కలసిపోయే ఓ నీడనై
గుండె మూలమూలలా కిచకిచలాడే
చిన్ని పిట్టల తోక్లపై తాళమేసే గాలి వీవనగా
తచ్చాడటం కలకాదుగా..

నీడలు పరచుకున్న అసురసంధ్య ఆవలి తీరాన
ఒకరి కంటి అద్దాల్లో మరొకరు కన్న పగటి కలల సుదీర్ఘ సంభాషణలు
నీకూ నాకూ మధ్య ఎల్లలు పుట్టవనుకున్నాం
నీకూ నాకూ మధ్య మౌనం రాయభారిగా మారి ఇలా...


      .....
*27.7.2012

కట్టా శ్రీనివాస్||మిత్ర పోత్తం||

పుస్తకాల అల్మరా తెరిస్తే
ప్రపంచపు కిటికీ తీసినట్టే
ఓ చల్లటి గాలి మెల్లగా
ఒరుసుకుంటూ వెళుతుంది.

ఇక పొత్తన్ని తెరిస్తే
ఓ ముద్దుల పురాతన తాత
బుజ్జగింపులతో తలనిమిరినట్లే వుంటుంది.

అక్షరాల వెంట పరుగెడుతుంటే,
సత్తువ పెరిగి లోపటి జవసత్త్వాలు
ఇనుమడిస్తూ సెగలెత్తిస్తుంది.

భాష వెనుక బావం
ఎదలో ఇంకినపుడల్లా
తెలియని జల ఏదో
ఊరుతూ ఉరుకుతూ ఊరిస్తుంది.

ఆత్మీయత అచ్చొత్తుకుని
అనుభవాల పొరలెత్తే
అనుంగు మిత్రుల సాహచర్యం కూడా
దాచిన పుస్తకమంతటి
కమ్మటి వాసనలు వీస్తుంది.
అందుకేనేమో.

సిరి.కట్టా**27-07-2012

( అమ్మని, పుస్తకాన్ని యిష్టపడని వారు ఎవరుంటారు, కవితా వస్తువు పాతదే కాని
నేను కూడా నా మాటల్లో చెప్పాలని పించింది.)

కె.కె ||అనుభవ రాహిత్యం||

అనుభవ రాహిత్యం
*************
ఒక సాయంత్రం,ఒంటరిగా కోనేటిపక్కన కూర్చున్నాను,
వేడెక్కిన మెదడుతో,బరువెక్కిన గుండెతో,
సమాజం పోకడపై అసహనం తో.. ఆగ్రహంతో

విసుగెత్తిన మనసుకి,నులువెచ్చని కౌగిలి ఇస్తూ
పచ్చికబైళ్ళు మెత్తలుగా పరుచుకున్నాయ్.
కల్మాషాల కుళ్ళుని చూసి కలతచెందిన నాకళ్ళు,
నీలాకాశంలో మేఘాలను నగ్నంగా చూసి మురిసిపోతున్నాయి.
అరుపుల తొక్కిసలాటలో నలిగిపోయిన నా చెవులు,
అలల సంగీతాన్ని,అరేబియన్ గీతంలా ఆశ్వాదిస్తున్నాయ్.

వలపు కోనేరు పొలాన్ని,సంధ్యాకిరణాలు దున్నేస్తున్నాయ్.
రెండుపక్కల నిటారుగా నిలిచున్న మావిడిచెట్లు,
ఆతిధ్యం స్వీకరించమని ఆహ్వానం పంపుతున్నాయ్.
అప్పుడప్పుడు,ఎంగిలిపడే కొంగల ముక్కులపై
తాకిన కిరణాలు ముక్కెరలై మెరుస్తున్నాయ్.
కరిగిపోతున్న కాలాన్ని చుక్క,చుక్కగా
ఆశ్వాదిస్తూ.. గుటకలేస్తూ గడిపేసాను.

అప్పటిదాక మిన్నకుండిన నా మనసు
ఒంటరిగా ఉన్నావంటూ,తుంటరిగా సైగచేసింది.
ఆలోచనలు,అస్తమించడం ప్రారంభం అయ్యాయ్.
కాసేపటికి ఏదో విసుగు నాలో, పరిగెత్తడం ఆరంభించింది.
వెంటనే అడుగులు,అనుమతి అడగకుండానే
అంగలువెయ్యడం మొదలెట్టాయ్...
జనప్రవాహంలో తరగలెత్తక తప్పదులే అంటూ

అప్పటిదాక ఆనందించిన నా మనసే
కాసేపటికి తిరిగి ఉపదేశించింది నన్ను హెచ్చరిస్తూ...
అందంగా ఉందని,ఆహ్లాదం పంచిచ్చిందని
కోనేట్లో కాపురం ఉండలేం కదా అని,
ఎప్పుడైనా జరుపుకునేది మాత్రమే పండుగ అని,
వానప్రస్థం స్వీకరించాల్సింది వార్ధక్యంలోనేనని

కాలికి బురద అంటిందని, నరికేస్తామా???
కడిగేస్తాం...కుదరకపోతే కనీసం తుడిచేస్తాం.
కుళ్ళిపోతున్న సమాజాన్ని సంస్కరించు,
నీ వల్ల కాకపోతే పక్కకు జరిగి నమస్కరించు,
అంతేకాని సమాజాన్ని బహిష్కరిస్తే ఎలా???
నీ అనుభవరాహిత్యం కాకపోతే అంటూ గీత ముగించింది.
అప్పుడే తెలిసింది ప్రకృతి అందాలు,నిశ్శబ్ద సమయాలు
అలసినప్పుడు సేదదీరడానికి మాత్రమే అని!!!
      .....
*27.7.2012

జగతి జగద్ధాత్రి ||ముద్దు.....||


తెలి మబ్బు తునకలాంటి
ఆమె నుదుటి పై
తొలి ముద్దిచ్చాడతను
తమకంగా...
తన్మయించింది ఆమె
ఉదయారుణ కిరణాల
ఆమె సూర్య తిలకం పై
మలి ముద్దు...
వెన్నెల లా చిర్నవ్వింది
పరవశాన వాలిన కన్రెప్పలపై
ముచ్చటైన మూడవ ముద్దు
మమేకతలోకి ఒరిగింది
మెరిసే నక్షత్ర
ముక్కు పుడక పై
ఒక వజ్రపు ముద్దు
మురిసింది ...ముక్కెర
సిరి నవ్వులు విరిసే
నును చెక్కిలి పై
చిరు ముద్దు .....చిలిపిగా
చేమంతి ...మారింది
గులాబిగా ....
శీతవేళ వణికే
చివురుటాకుల్లాంటి
అధరాలపై ...
అనురాగ రంజిత
అనంత అగాధాల
అంత్య శోధనగా
ప్రజ్వలించే
ఆదిమ మానవ
సహజత్వపు సరాగాల ముద్దు
జీవన లాలసని
మార్మిక మధురిమను
కనుగొనే చిరంతన
యాత్రలోకి అతను ఆమె
జీవన సాంధ్య సమయాన
పయనిస్తూ ....నిరంతరంగా
అంతరంగాల లోకి
అద్వైత తరంగాలలా...అనూచానంగా...!!!
        .....
*27.7.2012

వర్ణలేఖ కవిత


నీవలా నావలా
నడిచొస్తుంటే
నే నిను
అలా అలలా
తాకుతుంటే
నీవెన్ని అలలను
ఎదుర్కొన్నావో
నావన్నీ కలలేనని
కనుమరుగయ్యా
నీ నుండి నురగలా

వర్ణలేఖ - 

*27.7.2012

వేంపల్లి గంగాధర్||వాడొక వ్యాసం ....||


వాడు
మీకు బాగా పరిచయం
వాడి ముఖం
మీకు ప్రతి చోటా ఎదురు పడుతుంటుంది ...

ఒక్కో సారి వాడు
ఎదురు గాలి కి ఎగిరే
రంగు వెలసిన చిత్తు కాగితం ...
నడి రోడ్డు మధ్య విసిరేసిన
చివరాఖరి సిగరెట్ తుంట ముక్క ...
రైలు ఇనుప కమ్మి ఫై
నలిగి రూపం కోల్పోయిన రూపాయినాణెం....
తోకకు రాయి కట్టిన తూనీగా....
అగ్గి పెట్టె లోని జిరంగి.....
వీధి మలుపులో
కాళ్ళకు అడ్డం పడుతూ
దుక్కం నిండిన చేతులు
వ్యవస్థ ను ఆవిష్కరించే సూచిక !

బాలల దినం నాడు
నీ పత్రిక లో వాడొక వ్యాసం ....
ఒక ఇటుక రాయి మోస్తూ ...కంకర రాయి కొడుతూ ..ఫోటో !
హోటల్ లో ఒక పగిలిన టీ గాజు గ్లాసు ....
రంగు రంగుల ముఖ చిత్రం!

సగం పడిపోయిన గోడ చివర
చినిగిన బట్టలతో
ఆడుకునే గోలీ కాయ...!
వాడు కూడా అవతార మూర్తి…..


ప్రతి ఉదయం తప్పని ప్రయాణం
కొండ దారి లో
పశువుల వెనుక పశువు గా ..
గొర్రెల వెనుక గొర్రె గా ...
బతుకు పోరాటం లో బలి పశువు!

ఇలా
ప్రతి సారీ వాడు
ఎదురు గాలి కి ఎగిరే గాలిపటం !
      .....
*27.7.2012 

జిలుకర శ్రీనివాస్||ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ||

ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ

స్వర్గానికి దూరంగా
నరకానికి చాలా దగ్గరగా
రోజు నేను చిక్కని చీకటిగా మాసిపోతున్నాను
దూరంగా ఉంచుతున్నవో
నువ్వే దూరం అవుతున్నవో
ఎంతకీ అర్థం కాని కవితలా మారిపోతున్నావు

తెల్లవారక ముందే దిగిలు ముసురు నన్ను కమ్మేస్తూంటది
పగలంతా ప్రాణం నీ మాటలను మననం చేసుకుంటూ మురిసిపోతది
రాత్రంతా కలలకు ఆహరం అవుతూ దేహం మురిగిపోతది
కులం కత్తులకు రాలిపడిన కోట్ల కొద్ది స్వప్నాలు ఎండిపోతాయి
ఎండా పొద విచ్చుకున్నాక నీ తీయటి మాటల పూలు పరిమలించాక
అస్పృశ్య హృదయమొకటి నా మెరుపుల చూపుల కోసం చిక్కని కవితొకటి రాసుకుంటది

ప్రేమంటే పత్రికా ప్రకటన కాదు
హక్కుల దేబిరింపు లేఖ కాదు
మనసును చంపుకొని బతకటం కాదు
ఎవరికోసమో నిర్జీవంగా పరిగెట్టడం అంత కంటే కాదు

నేను నీకోసం రాసిన తీయటి కవితా సంతకం ప్రేమ
నిత్యం నిన్ను స్మరిస్తూ బతకటం ప్రేమ
నిజ్జంగా నువ్వు నన్ను నిరాకరించటం ప్రేమ
నా మనో లోకం మీద నువ్వు విసిరినా నవ్వుల తునుక ప్రేమ
ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ
ఎలా చింపి చూపేది తెంచి నీ చేతికిచ్చేది మొండి?
            .....
*27.7.2012

రేణుక అయోల ||పాతసామాన్లు||


ఇంట్లోసామాన్లు పాతవనిపిస్తున్నాయి
పారేయాలనుకుని బయటికి తీసాను

మూడు చక్రాల సైకిలు
పెడల్స్ విరిగిపోయి సీటుచిరిగిపోయి
ఇరవైఏళ్ళ జీవితంలో విలీనమైన గతంతో పోటిపడితే
నాలుగేళ్ల కుర్రాడు సైకిలు కావాలని పేచిపెట్టడం
వాడి ఆనందం కోసం ఆసైకిలు కోసం ఎన్ని త్యాగలు
వాడికళ్లలో ఆనందంతో ఎవరస్టు శిఖరం ఎక్కినట్లు ఇద్దరం.
ఖాళి తనాన్ని మాలో నిక్షిప్తం చేసుకుని
జీవితాన్ని అర్ధం చేసుకుంటుంటే పాతసామాన్లలో సైకిలు
అల్బంలో ఒక పేజి తెరగేసింది

పాత టీషర్టు తోడుకున్న మెత్తటి దూదిబొమ్మ
పాప తలగడతో పాటూ తాను పక్కనే పడుకునేది
షాంపులతో స్నానాలు చేసి అలసిపోయిన బొమ్మ
కిచెన్ సెట్టులో ఎన్ని డిన్నర్లు లంచ్ లు చేసిందో
నోరువిప్పి రుచిచెప్పకుండా నిద్రపోయేది పాప ఒడిలో
నాచుట్టూ దారాలు అల్లుతూ పాప ఫోటొ చూసుకునేలా చేసింది.

ఆచేతనంగా కాళ్లకి అడ్డం పడ్డ గడియారం
ఆగిపోయిన ముళ్లు కదలని పెండ్యులం ఎక్కడో పారేసుకున్న తాళం
పొద్దునుంచి రాత్రిదాక గోడకి కాపలా కాస్తూ
ఇల్లంతా విస్తరించిన గంటలు.
నిశ్శబ్దం నిద్రలో ప్రవేశించి ఎన్ని రాత్రుళ్లు తోడుగానిలిచిందో
చేతులమధ్యలో స్నేహితురాలై పలుకరించింది

ఇందులో ఏవి పాత సామాన్లు
ఒక్క క్షణంలో అంతరంగం దిగుడుబావిలొ నీళ్ళకోసం
చేద వేసి తోడుకున్న అనుభవాలు.

మిగిలిపోయినవి ఆమహాజీవితంలోనివే
పారేయాలా ఉంచుకోవాలా?
    .....
*27.7.2012

పులిపాటి పరమేశ్వరి || గొడుగు ప్రేమ ||

ప్రతిరోజు నిన్నే చూస్తుంట..
నీ మాటే వింటుంట..
నీ హడావుడి తెలుసుకొంటుంట..
నీ పరుగులు పని అనుకొంట..
నీ వురకలు ఎందుకనుకొంట..
నీ కోసం ఎదురుచుస్తుంట...

నిన్ను నాదరికి రమ్మనాలనుంటది
నీతో ఒకే తేరంలో నడవాలనుంటది
నీలి నింగిలో ఎగరాలనుంటది
పూవూ తావిలా నిలవాలనుంటది
గాలిలో గంధమై తీరాలనుంటది
నిన్నోసారి కప్పాలనుంటది
నా గుండె ముడి విప్పాలనుంటది


కాని సమయం కాదే...
తరునోపాయం లేదే...


నీ మనసాకాశంలొ మబ్బులు కమ్మాలి..
మోహం మెరుపై మెరవాలి..
అగ్గిలా ఆవేశం ఉరమాలి..
అన్య ఆలోచనలు ఆగాలి..
సవాలక్ష వ్యాపారాలు సద్దుమనగాలి..
చిన్మయానందం
చినుకు చినుకుగా రాలాలి..
తమకం తనువంతా తడమాలి..
మనసు తేలికై తేలిపొవాలి..
ఆశల హరివిల్లు నింగి నిండా నిండిపొవాలి..

అప్పుడుగాని
నన్ను వెతకవు.....
నన్ను తడమవు.....
నన్ను విప్పవు......
నన్ను పట్టవు......


ఆహా ఎంత సంతోషం..తరచి చూస్తే...

నావి రెండే లోకాలు..
ఆ వర్షం... నీ హర్షం...

నావి రెండే మోహాలు..
నేను విప్పుకోవాలి...నిన్ను కప్పుకోవాలి...

నావి రెండే తమకాలు..
నువ్వొడిసి పట్టాలి...నే తడిసిపొవాలి...

నావి రెండె గమకాలు..
పూ మొగ్గనై ముడుచుకోవాలి...
నెమలి పురిలా విచ్చుకోవాలి...

*26-07-2012

కరణం లుగేంద్ర పిళ్ళై || మౌనవ్యథ ||

ఎన్నాళ్లని దాచుకోను
కంటిరెప్పలు అదిమిపట్టి
కన్నీటి బిందువులను
ఎంతకాలం ఓర్చుకోను
పంటి బిగువున అదిమిపట్టి
గుండె రేపుతున్న మంటలను
ఏమి చేసి చల్లార్చగలను
పిడికెడు గుప్పెట్ట మూసిపెట్టి
సలసలా రేగుతున్న నా ఆవేశపు లావాలను..
మౌనం ఫలదీకరణకు
అవమానం బహుమతయినప్పుడు
దానిని బతుకంటారా ?
విధేయత ,వినమ్రతకు
బానిసత్వం బలిపీఠమవుతున్నప్పుడు
దానిని జీవితమంటారా ?
విత్తు గింజెల కోసం అర్రులు చాచినప్పుడే
మన జాతి మరణించినట్టు
ఇంకా భయపడమంటావా ?
బతకడానికి భూమిని సెజ్ లకు అమ్ముకున్నప్పుడే
మన ప్రాణం కోల్పోయినట్టు
ఇంకా పోయేదేముంది?
మౌనం గోడలు బద్దలు చేసుకుందాం..
కరువు నేలలో రెండు విత్తనాలై మొలకెత్తుద్దాం
నింగికి శిరస్సులెత్తే జీవితాలకు అంకురం అవుదాం..

26-07-2012

జుగాష్ విలి || అద్వైతం ||

అనేకానేక దుఖాలకు
అలవాటుపడినవాడిని
ఒకే ప్రేమతో సరిపుచ్చుకోలేను

బహుప్రేమల్ని స్పృశించాను
దుఖాన్ని ఇవ్వని ప్రేమను
అసంపూర్ణంగా భావించాను

దుఖమంటే మరేమీ కాదని
ఎడతెగని సుఖమని తెలుసుకున్నాను.
*26-07-2012

రామాచారి బంగారు || రక్తాశ్రువులు ||

కళ్ళకు గంతలు కట్టించుకుని
పడదోసే ఎత్తులకు పై ఎత్తులతో
నేను విశ్వచదరంగ విజేతను
ఆలోచనలు సాగి మూగభావాల
సుడిగుండంలో సుళ్ళు తిరుగుతుంటే
గడియ తీయకుండా తలపుకోస్తావు
మూసిన తలుపులు తెరిచేదెవరు?
వ్యధల తో(డి) రాగాలు జతకట్టేనా?
వేసవి వేడిమికి వాడినది చిగురులత
ఎదలో పొంగుతున్న కన్నీరే ఈకవిత
జ్యోతి జ్వాలగా ఎగసినప్పుడు
వెన్నెల వెలుతురును హరిస్తుంటే
చుక్కాని లేక తీరం చేర (లే) క
చింతల కాష్టంపై కుములుతూ నేను
నిష్క్రమణ ఘడియలు నీడలా
సాగి నన్ను వెంటాడుతుంటే
లోతు తెలియని నీ ప్రేమ కడలిలో
తేలిపొతూ మునకలు వేస్తున్నా
పరిమళ రస రమ్య* స్మ్రుతులలో
స్వాతిచినుకుకై ముత్యపుచిప్పలా
చల్లని మ్రుత్యువు కరుణకోసం
కరాలు జోడిస్తువేడుకుంటున్నా
ఆదేవుడే కోరుకోమంటే
మనిషిగా నాకు మాత్రం
మరో జన్మ వద్దంటాను.

(*రమ్య " యండమూరి వీరేంద్ర నాధ్ " నవల "వెన్నెల్లో ఆడపిల్ల" నాయిక.)
*26-07-2012

జ్యోతిర్మయి మళ్ళ || అన్‌టచబుల్ అటాచ్మెంట్ ||

నువ్వు నాలాకాక
నేను నీలాకాక
భిన్నంగా
ఉన్నా..

నాకిష్టం
నువ్వు
నీకిష్టం
నేను

నువ్వెక్కడో
నేనిక్కడ
వేర్వేరుగా
ఉన్నా..

నాతో
నువ్వు
నీతో
నేను
*26-07-2012

జుగాష్ విలి || ఆమె కనిపించింది ||


ఆమె కనిపించింది
ఒకానొక పురాతన సమయంలో
నేను మోహించిన ఆమె
నన్ను ఇష్టపడిన ఆమె

నాలుగు దశాబ్దాల కిందట
యవ్వన ప్రాంగణం తలుపుతట్టిన నన్ను
తలుపుతీసి స్వాగతించిన ఆమె
మళ్ళీ ఇన్నాళ్ళకు
ఇక్కడ ఇప్పుడు కనిపించింది

కాలం సానపెట్టిన
సౌందర్యపు మెరుపుతో
సుడిగాలిలా గట్టిగా చుట్టేసుకున్నది ఆమె
నన్ను ఇప్పుడు ఇక్కడ

జుట్టు వెనక్కిజారి విశాలమైన
నా ముడుతల నుదిటికి
ఒక సుదీర్ఘ చుంబనాన్ని కానుకగా ఇచ్చినది ఆమె

కాలం కనుమరుగు చేయలేని కరుణ
కళ్ళనిండా నింపుకొని ఆమె
నా కళ్ళలో తన చూపును నిలిపినప్పుడు
ఇక్కడ ఇప్పుడు కూడా
అపరాధ భావన ఆవరించి... అవధరించి...
నాకళ్ళు తడబాటుతో తలదించుకున్నాయి

ఇన్నాళ్ళ విరామం తరువాత
కాదు
ఎడబాటు తరువాత
నాలుగు పదుల కాలాంతరమున కూడా
నను గుర్తుపెట్టుకున్నది ఆమె
తన ఆత్మతోను... దేహంతోను...
*26-07-2012

విసురజ కవిత || "ఎద రోదన" ||

ఎద రొదతో సతమతమయ్యెగ మదిలో
మనసులోనున్నది చెలికి చెప్పలేకను
భయంమయ్యేగ నా గుండెలో..
తనతో చెప్పిన పిమ్మట ఏమగునోనని
పలకరింపు పులకరింపుగ పల్లవించున
లేక వికటించున జలదరింపై విసిగించున
మరులుకోల్పు ఊసులన్ని
మల్లెపూలై వికసించున
చిరాకుతో మోము వడిలిపోవున
వాడిపోయిన మందారమల్లే కనిపించున
చాలా ఉత్తరాలు నీకై రాసివుంచిన
అంపడానికి ధైర్యం లేకపోయే
నేరుగ నీ కళ్ళలోకి చూస్తు
హృదిమదిఘోష చెప్పలేనాయే
సఖి నా మౌనగానం తెలుసుకో
నా నిశీధిలోకొచ్చిన ఉషస్సువి నీవు
చెలి నీ మమతలపల్లకి ఎక్కించుకొ
నీ మనసువీధిలో ముత్యాల రంగవల్లి నేనవుతా.
*26-07-2012

వంశీదర్ రెడ్డి || ‎* మేఘసందేశం *.||


వానొచ్చేట్టుంది,
పొలారిటీ మేఘాల్రెండు కొట్టుకు చస్తే
ఉరుము ముందా, మెరుపు ముందా,
ధ్వని వేగం కాంతికన్నా చాలా తక్కువట,
ఏడ తానున్నాడో..
థాంక్స్ టు ఐన్ స్టీన్,

మేఘాల్నిజంగా దొంగలే,
సంద్రపు నీటిని దోచి, దాచి,
బరువెక్కి, కదల్లేక,
మన మీదే వాంతిచేస్కుని,
ఛ, ఒక్క మంచి పోలికా దొరకదెందుకో,

అదిగో తొలి చినుకు,
టర్మినల్ వెలాసిటీ తో,
ఎవడి తల పగలగొట్టాలా అనాలోచిస్తూ,
చినుకు గోళంగానే ఎందుకుంటదో,
సర్ఫేస్ టెన్షన్ని తగ్గించుకోడానికేమో,
లేపోతే, పగల్దూ,
జీవితం నీటిబుడగంటే ఇదేనేమో,

ఆక్రమణ్, దాడి చేయండి, ప్రిపేర్ ఫర్ ద బాటిల్,
సినిమాల్లో వార్ సీన్స్ మ్యూజిక్ గుర్తుచేస్తూ,
కమ్మటి మట్టి వాసన ముక్కులోకి దూరుస్తూ,
జడి వాన..
ఎన్నిళ్ళు కూలాయో, ఎందరు చస్తారో,
"మాతృహృదయం"లో
జరిత, జరితారిల కన్వర్సేషన్ కళ్ళలో మెదిలి,
తడి తేలి..

పేపర్లో వార్త,
వర్షం ముంచిన తొమ్మిది ప్రాణాలు,
హెవీ రెయిన్స్ లీడ్ టు కలరా ఇన్ ఏజన్సీ,
వడగండ్లకు రైతు కడగండ్లు,
రంగనాయకమ్మ గారికి ఇన్ఫార్మ్ చేయాలి,
వాన బూర్జువా అని,
మరి కష్టాలన్నీ B.P.L కిందేగా,

నేను మాత్రం
బాల్కనీ గ్రిల్స్ లోంచి చినుకుల్ని చేత్తో తడుముతూ
తాదాద్మ్యంగా పకోడీ తో టీ తాగుతూనో,
వాన వల్లప్ప హమ్ చేస్తూ
కాలవల్లో కాగితప్పడవలొదుల్తూనో,
గర్ల్ ఫ్రెండ్తో ఈట్ స్ట్రీట్లో
మొక్కజొన్న పొత్తుల్ని స్కూప్స్ అంచుకు నముల్తూ
వర్షాన్నెలా అడ్వాంటేజ్ తీస్కోవాలా అని దరిద్రపాలోచన్లు చేస్తూనో,
నైన్టీ మి.లీగొంతులో పోసి
K.F.C బకెట్లో మునిగి, Mec.D బర్గర్లో నలిగి,
వర్ష విలయానికి నా వంతుగా ధారాళంగా బాధ నటిస్తూ..

మేఘమా, వన్ రిక్వెస్ట్,
నీ ప్రయారిటీ పల్లెకివ్వు, పట్నాలకొద్దు,
తిండి దొరకదు లేపోతే,

"ఒరేయ్, పిచ్చోడా,
పట్నంలో ఎత్తైన మేడలూ, సూదిలా టవర్లూ,
దుమ్మూ ధూళి, పొగా పొల్ల్యూషనుండి
నన్నాపి నీటిని కొల్లగొడ్తాయ్,
పల్లెలో ఏముంది, ఇల్లా, చెట్టా,
మీ గ్లోబలైజేషనే మీ కంట్లో పొడిచిందిరోయ్"
మోడర్న్ మేఘసందేశంలా,
విశ్వ రహస్యం విడిపిస్తూ,

కాళిదాసు,
మేం మేఘాలూ కబ్జా చేసామ్ మాష్టారు,
మీరు వేరే వస్తువు వెతుక్కోండి,
పిచ్చి పిచ్చిగా అరుస్తూ,
వర్షంలో తడుస్తూ
నా లాంటి పిచ్చోళ్ళు...
*26-07-2012

కట్టా సుదర్శన్ రెడ్డి || రాగరంజితము ||

అదిగదిగో అటు చూడొకసారి
సరిమల కాంతుల పండువెన్నెల
నీలుగు జిలుగుల తోయజవైరి
విరియబాఱెను మధుర చిన్నెల
.. ..
నెలవొందినవి తీపితలపులు
పూలపొలపిత వలపురాగములు
మెలివేసినవి ప్రేమపలుకులు
కిలారించినవి తనువుతాపములు
.. ..
మలయిస్తున్నవి మోహవేదనలు
నిలువబారెను తాపపుతనువులు !
వలపు జంటకివి రాగసౌధములు
మలయమారుతపు ప్రేమభానువులు !!

‎(ఈ కవితలో ప్రతి పాదములోని అంత్యాక్షరద్వయమును (చివరి రెండు అక్షరాలను) అనుసరించింది తరువాత పాదములో (మొదటి రెండక్షరాలు) పదప్రారంభము జరిగినది.. గమనించగలరు. )
*26-07-2012

స్వాతి శ్రీపాద || సమాగమం ||

ఇద్దరిమధ్య ఒక ఉలిపిరి ఊపిరి అడ్డుగోడ
అటో ప్రపంచం ఇటో ప్రపంచం
కనుచూపు మేరా మసక దృశ్యాల తెర వెనక
ఇనుప తెరలా ఒక పల్చని స్పటికపుగోడ
మౌనానికి మాటలు నేర్పే తాపత్రయం ఒకరిది
మాటలకు మనమద్దే వేదన మరొకరిది
ఉండీ లేదనిపించే మధురోహల ప్రపంచం ఒకరు
ఎదుటుండీ ఎడబాటు తప్పని కన్నీటి సముద్రం ఒకరు
ఆకులు రాలిన శిశిరపు వృక్షం ఒకరు
చిగుళ్ళుతొడిగే వసంతపు తొలి చూపు మరొకరు
సమాంతరంగా సాగే ఈ ప్రయాణం కలయిక
ఏ యుగాంతానికి?
*26-07-2012

ఏకాంత సిరి కవిత

కొంత మందికి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా.. అవలేము
మరికొంత మందికి ఎంత దూరం అవ్వలనుకున్నా.. కాలేము.
ఈ దగ్గర దూరాలను నిర్ణయించేది ఏమిటో..
ఎంత వెతికినా... దొరకదు నాకు.
26-07-2012

ప్రకాష్ మల్లవోలు || నేను ఇంటికెళ్తున్నానోచ్ ... ||

మదిపొరల గురుతులని గబగబా తవ్వేస్తూ ,
గుండె లోతుల భావనల్ని తపనతో తడిమేస్తూ,

కంటి పాపల ముంగిళ్ళను దబదబా తడిపేస్తూ
కన్నోళ్ళు కానరాక ఉబికెడి కన్నీళ్ళని గలగలా పారిస్తూ

ఇలా ఇలా ఇంటితో దూరం మదినే కలచివేస్తోంది ...

కలతలను కాలరాయడానికి అవకాశం దొరికింది
కన్నీళ్లను అమ్మ చేత్తో తుడిపించుకొనే సమయం వచ్చింది

పట్టరాని బరువైయున్న గోడు తీరే వేళయింది
తేలికైన నా హృదయం చిరువసంత వేళయింది

నిశ్శబ్దానికి నెలవైయున్న గుండెలో మేళా మొదలై౦ది
నిస్సత్తువ కొలువైయున్న మనసులో కళకళయే మొదలై౦ది

ఘడియ ఘడియకీ గూడు రారమ్మని అంటోంది
గుసగుసగా వినిపిస్తూ గురుతులనే కదిలిస్తూ

అమ్మ చేతి గోరు ముద్దని ,
నాన్న చేతి చిరు స్పర్శని
తమ్ముని మోమున నవ్వుని
చేరువవుతున్నానన్న తలపుని

మరలమరల కలిగిస్తూ ,
మదినే ఉక్కిరిబిక్కిరి చేస్తూ

నడిరాతిరి మెలుకువలో నాన్న పిలుపు
చిరుగువ్వల కువకువలో అమ్మ తలపు

ఇలా ప్రతి తలపు తెలుపుతున్నది ఇంటి తలపునే
ఇలా ప్రతి ఉదయం తలపుతెస్తున్నది ఇంటి వలపునే

ఇలా ప్రతి వేకువ తలుపు తీస్తున్నది ఇంటి కొరకనే
ఇలా ప్రతి క్షణమూ పరిగెడుతున్నది ఇంటి వైపుకే .
*26-07-2012

యజ్ఞపాల్ రాజు కవిత

సాయంకాలాలు ఎంత బాగుంటాయో....
ఒకే అమ్మాయి ప్రతి రోజూ కొత్తగా కనిపించినట్టుగా....
దీన్నే ప్రేమ అంటారేమో....
*26-07-2012

రమేష్ ఊడుగుల || మిథికల్ ఫిలాసఫీ ||


"గ్లోబలైజ్డ్ వరల్డ్ లో సపరేట్ ఉద్యమాలా ??"
ఇది లోకమంతా వినిపించిన గ్లోబల్ ఒపీనియెన్.

ఊహకందని కొత్త తుఫాన్ కు
ఆలోచనలో పడిన ప్రపంచం.

వేర్లని ఊడబీక్కుని వచ్చి ...
వీదుల్లో తుమ్మ చెట్ల శాంతి యాత్రలు

రెక్కలతో కంజీరలు మోగిస్తూ ...
పాల పిట్టల పాటల కవాతులు

జ్వలించీ జ్వలించీ...
విస్ఫోటనం చెందిన భావోద్వేగాలు
అవి,ఆగిపోతున్న శ్వాసకు వాయుప్రవాహాలు
బిగుసుకున్న పిడికిల్లకు ఇత్తడి పూతలు
నాల్గో తరం తంతెల ఫై -
కలుపు తీసే తల్లుల కడుపు కోతలు
ఎర్రటి కలువలై పూచాయి.
***
వేల క్యూసెక్ ల కన్నీటిని కంటూన్న ఊట చెలిమల్లో-
ఘనీభవించిన రుధిరం హిమద్రవమై కరుగుతోన్న క్రమంలో
పచ్చనాకుల సాక్షిగా -
పసుపుపచ్చని బీభత్సం - లెక్కలేనన్నిసమ్మెటపోట్లు.

రెక్కలు తెగిన తుఫాను అనుకోవద్దు
తిరిగి లేచే ఫీనిక్స్ పక్షి నా తెలంగాణ

సూర్యుడికి కాసేపు
అడ్డోచ్చినంత మాత్రాన
కారు మబ్బులు గెలిచినట్లా ?

త్యాగాల తీరాల్లో
తారాడుతున్న అలలపైన
అలవోకగా అపహాస్యాన్ని చిమ్ముతున్నారుగానీ ..
మావి,
రాళ్ళని మేల్కొల్పిన స్వచ్ఛమైన ప్రాణాలు
ఒక మహొజ్వల స్ఫూర్తిని విరజిమ్మిన వజ్రాయుధాలు
కాబట్టే కదా .....
ఇక్కడ మరణాలు
మహాకావ్యాలయి పుడుతూ వుంటాయి
మేం రామని - ఇక కనబడమని భ్రమపడొద్దు
రాతి స్తూపాలే మా శరీరాలు
మా ఆత్మలు అఖండ కాంతిపుoజాలై --
అక్కడ నిక్షిప్తమై వుంటాయి
మా ఆలోచనలు
దళితబహుజనడప్పులై --
గర్జిస్తూ వుంటాయి
తర్కం ఏమిటంటే -
స్వయం పాలన కోసం...
"మా లోపలి కి మేము వెళ్ళిపోవటమే".
****
"అసవన్త ఇమే దేహా నిత్యస్యోక్తా శ్శరీరిన:
అనాశినో ప్రమేయస్య తస్మాద్యుద్ధ స్వభారత "
ఇది కృష్ణ తత్వం.
ఇక మీరు అడ్డుకోవడం - మేము ధిక్కరించడం లాంటి -
రెగ్యులర్ లొల్లిని అప్ డేట్ చేసుకుందాం
ఈ మిథికల్ ఫిలాసఫీని అడాప్ట్ చేసుకుందాం
మీరు బ్రతుకు రహస్యమెరిగిన వాళ్ళు కదా
ఇక్కడ బహిరంగ యుద్ధమొకటి
పడిగాపులు కాస్తోంది
నిలువెత్తు కత్తులతో సిద్ధమవండి.

మన కత్తులు రెండు
రాసుకున్నప్పుడు
రాజుకునే మెరుపులలో శబ్దాలలో
పొలికేకలు కలగలుస్తాయి - ఎవరివైనా కావొచ్చు.
హోరుగాలి కి గులాబి రేకులు ఒక్కొక్కటి రాలి పోయినట్లు...
దేహాల నుండి తెగిపడుతోన్న భాగాలతో - నెత్తురు తో
యుద్ధ భూమి భీతిల్లిపోతుంది
ఎవరి భాగాలు ఎక్కడ పడ్డాయో తెలియదు
ఆ ఎర్రటి చెరువులో
చచ్చిన చేపల్లా తేలుతోన్న అవయవాల నడుమ
ఏ మాంసం కండలైతే
పౌరుషం తో ఎగిరెగిరి పడుతూoటాయో
అవి తెలంగాణ బిడ్డలయని తెలుసుకోండి
*****
మేం మృత్యు రహస్యమెరిగిన వాళ్ళం
భగ్గున మండే గుణమున్న భాస్వరాలం
we know how to feel the heat
we know how to feel the death
పోరాడుతూ అంతమొంధటం - మాకు చిన్న విషయం
మరి మీ సంగతి?
* * *
ఇవాలో రేపో, తలవంచక తప్పదు
గాయపడ్డ పాలపిట్టల కాల్లుమొక్కి
తుమ్మచెట్ల పాదముద్రల్లోని
ఇంత మట్టిని గుప్పిట పట్టి
ఎదల ఫై రుద్దుకుని చూస్తే
ఆత్మగౌరవం అర్ధమవుతుంది
మనుసు పరిశుద్ధమవుతుంది .
*26-07-2012

జయశ్రీ నాయుడు || *కొన్ని* ||

కొన్నిటిని వదలాలి..
అనుకున్నాను..
.
.
.
.
.
.
.
ఆ *కొన్ని* లోనే వుంది
అన్నిటినీ కలిపే దారం
అన్నిటికీ ఆధారం

మరి కిం కర్తవ్యం????
*26-07-2012

రామ్మోహన్ డింగరి || నువ్వు యెండి పోయిన తోరణంలా .. ||

వాడిన శరీరాన్ని వీధి వాకిట్లో ..పారేసి,
.బతుకున్న శవంలా....
యెదిరి చూస్తుంటావ్ ...

కడుపులో ఇథోపియాలు దాచుకొని ..

ఇంకొకడి ఆకలి తీర్చడానికి ..
నీకంటూ కోరికలుండవు ..
కానీ కోరికలు ..తీరుస్తుంటావ్
రాత్రుల్లు నిద్ర లేక
పగలు కలలు కనలేక ..

నీకంటూ జీవితం లేక
యెవడో విత్తిన విత్తనాన్ని

వ్రణం చేసుకొంటావ్ ....

చితికిన సంధ్య అయిపోతావ్..

అసలెవరు నువ్వు ..

నీకంటూ యేదీ లేదు

నువ్విలాగే ...తినేసి పారేసే విస్తరి .
*26-07-2012