వానొచ్చేట్టుంది,
పొలారిటీ మేఘాల్రెండు కొట్టుకు చస్తే
ఉరుము ముందా, మెరుపు ముందా,
ధ్వని వేగం కాంతికన్నా చాలా తక్కువట,
ఏడ తానున్నాడో..
థాంక్స్ టు ఐన్ స్టీన్,
మేఘాల్నిజంగా దొంగలే,
సంద్రపు నీటిని దోచి, దాచి,
బరువెక్కి, కదల్లేక,
మన మీదే వాంతిచేస్కుని,
ఛ, ఒక్క మంచి పోలికా దొరకదెందుకో,
అదిగో తొలి చినుకు,
టర్మినల్ వెలాసిటీ తో,
ఎవడి తల పగలగొట్టాలా అనాలోచిస్తూ,
చినుకు గోళంగానే ఎందుకుంటదో,
సర్ఫేస్ టెన్షన్ని తగ్గించుకోడానికేమో,
లేపోతే, పగల్దూ,
జీవితం నీటిబుడగంటే ఇదేనేమో,
ఆక్రమణ్, దాడి చేయండి, ప్రిపేర్ ఫర్ ద బాటిల్,
సినిమాల్లో వార్ సీన్స్ మ్యూజిక్ గుర్తుచేస్తూ,
కమ్మటి మట్టి వాసన ముక్కులోకి దూరుస్తూ,
జడి వాన..
ఎన్నిళ్ళు కూలాయో, ఎందరు చస్తారో,
"మాతృహృదయం"లో
జరిత, జరితారిల కన్వర్సేషన్ కళ్ళలో మెదిలి,
తడి తేలి..
పేపర్లో వార్త,
వర్షం ముంచిన తొమ్మిది ప్రాణాలు,
హెవీ రెయిన్స్ లీడ్ టు కలరా ఇన్ ఏజన్సీ,
వడగండ్లకు రైతు కడగండ్లు,
రంగనాయకమ్మ గారికి ఇన్ఫార్మ్ చేయాలి,
వాన బూర్జువా అని,
మరి కష్టాలన్నీ B.P.L కిందేగా,
నేను మాత్రం
బాల్కనీ గ్రిల్స్ లోంచి చినుకుల్ని చేత్తో తడుముతూ
తాదాద్మ్యంగా పకోడీ తో టీ తాగుతూనో,
వాన వల్లప్ప హమ్ చేస్తూ
కాలవల్లో కాగితప్పడవలొదుల్తూనో,
గర్ల్ ఫ్రెండ్తో ఈట్ స్ట్రీట్లో
మొక్కజొన్న పొత్తుల్ని స్కూప్స్ అంచుకు నముల్తూ
వర్షాన్నెలా అడ్వాంటేజ్ తీస్కోవాలా అని దరిద్రపాలోచన్లు చేస్తూనో,
నైన్టీ మి.లీగొంతులో పోసి
K.F.C బకెట్లో మునిగి, Mec.D బర్గర్లో నలిగి,
వర్ష విలయానికి నా వంతుగా ధారాళంగా బాధ నటిస్తూ..
మేఘమా, వన్ రిక్వెస్ట్,
నీ ప్రయారిటీ పల్లెకివ్వు, పట్నాలకొద్దు,
తిండి దొరకదు లేపోతే,
"ఒరేయ్, పిచ్చోడా,
పట్నంలో ఎత్తైన మేడలూ, సూదిలా టవర్లూ,
దుమ్మూ ధూళి, పొగా పొల్ల్యూషనుండి
నన్నాపి నీటిని కొల్లగొడ్తాయ్,
పల్లెలో ఏముంది, ఇల్లా, చెట్టా,
మీ గ్లోబలైజేషనే మీ కంట్లో పొడిచిందిరోయ్"
మోడర్న్ మేఘసందేశంలా,
విశ్వ రహస్యం విడిపిస్తూ,
కాళిదాసు,
మేం మేఘాలూ కబ్జా చేసామ్ మాష్టారు,
మీరు వేరే వస్తువు వెతుక్కోండి,
పిచ్చి పిచ్చిగా అరుస్తూ,
వర్షంలో తడుస్తూ
నా లాంటి పిచ్చోళ్ళు...
*26-07-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి