తెలి మబ్బు తునకలాంటి
ఆమె నుదుటి పై
తొలి ముద్దిచ్చాడతను
తమకంగా...
తన్మయించింది ఆమె
ఉదయారుణ కిరణాల
ఆమె సూర్య తిలకం పై
మలి ముద్దు...
వెన్నెల లా చిర్నవ్వింది
పరవశాన వాలిన కన్రెప్పలపై
ముచ్చటైన మూడవ ముద్దు
మమేకతలోకి ఒరిగింది
మెరిసే నక్షత్ర
ముక్కు పుడక పై
ఒక వజ్రపు ముద్దు
మురిసింది ...ముక్కెర
సిరి నవ్వులు విరిసే
నును చెక్కిలి పై
చిరు ముద్దు .....చిలిపిగా
చేమంతి ...మారింది
గులాబిగా ....
శీతవేళ వణికే
చివురుటాకుల్లాంటి
అధరాలపై ...
అనురాగ రంజిత
అనంత అగాధాల
అంత్య శోధనగా
ప్రజ్వలించే
ఆదిమ మానవ
సహజత్వపు సరాగాల ముద్దు
జీవన లాలసని
మార్మిక మధురిమను
కనుగొనే చిరంతన
యాత్రలోకి అతను ఆమె
జీవన సాంధ్య సమయాన
పయనిస్తూ ....నిరంతరంగా
అంతరంగాల లోకి
అద్వైత తరంగాలలా...అనూచానంగా...!!!
.....
*27.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి