ఇంట్లోసామాన్లు పాతవనిపిస్తున్నాయి
పారేయాలనుకుని బయటికి తీసాను
మూడు చక్రాల సైకిలు
పెడల్స్ విరిగిపోయి సీటుచిరిగిపోయి
ఇరవైఏళ్ళ జీవితంలో విలీనమైన గతంతో పోటిపడితే
నాలుగేళ్ల కుర్రాడు సైకిలు కావాలని పేచిపెట్టడం
వాడి ఆనందం కోసం ఆసైకిలు కోసం ఎన్ని త్యాగలు
వాడికళ్లలో ఆనందంతో ఎవరస్టు శిఖరం ఎక్కినట్లు ఇద్దరం.
ఖాళి తనాన్ని మాలో నిక్షిప్తం చేసుకుని
జీవితాన్ని అర్ధం చేసుకుంటుంటే పాతసామాన్లలో సైకిలు
అల్బంలో ఒక పేజి తెరగేసింది
పాత టీషర్టు తోడుకున్న మెత్తటి దూదిబొమ్మ
పాప తలగడతో పాటూ తాను పక్కనే పడుకునేది
షాంపులతో స్నానాలు చేసి అలసిపోయిన బొమ్మ
కిచెన్ సెట్టులో ఎన్ని డిన్నర్లు లంచ్ లు చేసిందో
నోరువిప్పి రుచిచెప్పకుండా నిద్రపోయేది పాప ఒడిలో
నాచుట్టూ దారాలు అల్లుతూ పాప ఫోటొ చూసుకునేలా చేసింది.
ఆచేతనంగా కాళ్లకి అడ్డం పడ్డ గడియారం
ఆగిపోయిన ముళ్లు కదలని పెండ్యులం ఎక్కడో పారేసుకున్న తాళం
పొద్దునుంచి రాత్రిదాక గోడకి కాపలా కాస్తూ
ఇల్లంతా విస్తరించిన గంటలు.
నిశ్శబ్దం నిద్రలో ప్రవేశించి ఎన్ని రాత్రుళ్లు తోడుగానిలిచిందో
చేతులమధ్యలో స్నేహితురాలై పలుకరించింది
ఇందులో ఏవి పాత సామాన్లు
ఒక్క క్షణంలో అంతరంగం దిగుడుబావిలొ నీళ్ళకోసం
చేద వేసి తోడుకున్న అనుభవాలు.
మిగిలిపోయినవి ఆమహాజీవితంలోనివే
పారేయాలా ఉంచుకోవాలా?
.....
*27.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి