వాడు
మీకు బాగా పరిచయం
వాడి ముఖం
మీకు ప్రతి చోటా ఎదురు పడుతుంటుంది ...
ఒక్కో సారి వాడు
ఎదురు గాలి కి ఎగిరే
రంగు వెలసిన చిత్తు కాగితం ...
నడి రోడ్డు మధ్య విసిరేసిన
చివరాఖరి సిగరెట్ తుంట ముక్క ...
రైలు ఇనుప కమ్మి ఫై
నలిగి రూపం కోల్పోయిన రూపాయినాణెం....
తోకకు రాయి కట్టిన తూనీగా....
అగ్గి పెట్టె లోని జిరంగి.....
వీధి మలుపులో
కాళ్ళకు అడ్డం పడుతూ
దుక్కం నిండిన చేతులు
వ్యవస్థ ను ఆవిష్కరించే సూచిక !
బాలల దినం నాడు
నీ పత్రిక లో వాడొక వ్యాసం ....
ఒక ఇటుక రాయి మోస్తూ ...కంకర రాయి కొడుతూ ..ఫోటో !
హోటల్ లో ఒక పగిలిన టీ గాజు గ్లాసు ....
రంగు రంగుల ముఖ చిత్రం!
సగం పడిపోయిన గోడ చివర
చినిగిన బట్టలతో
ఆడుకునే గోలీ కాయ...!
వాడు కూడా అవతార మూర్తి…..
ప్రతి ఉదయం తప్పని ప్రయాణం
కొండ దారి లో
పశువుల వెనుక పశువు గా ..
గొర్రెల వెనుక గొర్రె గా ...
బతుకు పోరాటం లో బలి పశువు!
ఇలా
ప్రతి సారీ వాడు
ఎదురు గాలి కి ఎగిరే గాలిపటం !
.....
*27.7.2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి