కవిత్వంతో నా అనుభవం : ---------------------------- కవిత్వం వొక గొప్ప చలనభూతమైనది. మనిషిని అది అత్యంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. నిర్మిస్తుంది. ప్రంపంచ దేశాలలో అన్ని కాలాలలో కవిత్వం మనిషిని తలవంచని వీరుణిగానే నిలబెట్టింది. వొకొక్కప్పుడు కవిత్వం కొందరికి చెందిన సరుకుగా చెలామణి అయినా చివరకు అది చేరాల్సిన వాళ్ల చేతుల్లోకే చేరింది. చేయాల్సిన పనినే చేస్తుంది. కవిత్వం వొక ఆయుధమైంది. గాయాన్ని మాన్పే ఔషధమైంది. తల నిమిరే జాలి చేయి అయ్యింది. కవిత్వమంటే ప్రపంచ మానవ సమూహాలపై తెరుచుకున్న చైతన్యపు కన్ను. అలాంటి కవిత్వంతో ఈ ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా నా అనుభవం మీతో పంచుకోవాలనిపించింది. నేను చదివిన తొలి కవిత్వ సంపుటి - 'మహాప్రస్థానం'. మా ఊర్లో మా ఇంటి దగ్గర బీరువా నిండా పుస్తకాలు. మార్క్సిస్ట్ మహా గ్రంధాలు. 'కార్ల్ మార్క్స్ -ఎంగెల్స్' పేర్లు అక్కడ తెలిసాయి. రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలాక - తొంబై ఒకటిలో విజయనగరం కోట దగ్గర చవగ్గా అమ్మితే నాన్న కొన్నవవి. రెండు మూడు కాగితాలు తిప్పి పెట్టేసేవాడిని. కానీ వాళ్ల గొప్పతనాన్ని నాన్న చెప్పేవారు. స్కూల్ డేస్ లో అల్లూరిని, గాంధీజీ జీవిత చరిత్రను చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లూరి పోరాటం నచ్చేది. దానిని పక్కవాడికి Explain చేసేవాడిని. వాణ్ణీ ఉద్యుక్తున్ని చేయడమే నా ఉద్దేశం. తర్వాత మార్క్స్, మావో, చేగువేరా, ఫైడల్ కాస్ట్రో, లెనిన్, స్టాలిన్ ల రచనలు చదివాను. చదువుతున్నాను. ఈ మహానుభావుల రచనలను నేనైతే మనల్ని ఊపేసే కవిత్వంగానే భావిస్తాను. వొక గొప్ప ఆలోచనను కలిగించి మనపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయవి. నాకు అత్యంత ప్రేరణ, బలం యిచ్చిన కవిత్వం కె. శివారెడ్డి గారిది. 'గగనమంతా తలతో.. ' - చదివాక నా ఆలోచనల్లో మార్పుని గుర్తించాను. చర్య, అతను చరిత్ర - కవిత్వం చదివాక పోయిట్రీ సొబగు తెలిసింది. ఆ తర్వాత.. శివసాగర్ కవిత్వం నన్ను సమ్మోహితున్ని చేసింది. అరణ్యం మీద, పోరాటాల మీద వొక రకమైన curiasity ని పెంచింది. నగ్నముని 'కొయ్యగుర్రం' చదివాక - ఆ కవిత్వ వస్తువుకు, వ్యక్తీకరణకు, కవి దృక్పథానికి గాల్లో తేలిపోయాను. హెచ్చార్కె 'వానలో కొబ్బరి చెట్టు' కవిత్వ నిర్మాణం, అందులో ఆర్థ్రత నన్ను విపరీతంగా కదిలించాయి. అఫ్సర్ 'ఊరి చివర' చదవడం - వొక అనుభవంగా మిగిలిపోయింది. యాకూబ్ 'ప్రవహించే జ్ఞాపకం'లో సున్నితత్త్వం నా కవిత్వానికీ కావాలనుకుంటాను. అలెక్స్ హెలీ 'Roots' - నవల చదివాక గుండె బిగబట్టీసింది. ఆ రోజు రాత్రంతా దుఃఖపీడనంతో ఏడ్చుకున్నాను. నా ఆలోచనను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకమది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇతర మార్క్సిస్ట్ పుస్తకాలు - ఆ కోవలో వచ్చిన అనేక వ్యాసాలలో కవిత్వాన్ని నిర్మించే గొప్ప వ్యూహముంటుంది. అవి కచ్చితంగా చదవాల్సినవి. ఇటీవల నేను చదివిన వొక అద్భుతమైన పుస్తకం- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్ గారి - 'నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ? అయితే సంతోషం !' - .కొత్త ఆలోచనను, దృక్పథాన్ని యిచ్చింది. నెరూడా, అంద్రాదె, లాంగుస్టన్ హ్యూగ్యూస్ లాంటి వివిధ దేశాల కవులను చదవడం వలన మన ఆలోచనల్లో , కవిత్వ వస్తువుని తీసుకోవడంలో, కవిత్వ నిర్మాణ వ్యూహాలలో విస్తృతి పెరుగుతుంది. * నా పాఠశాల నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. పిల్లల్లో నుంచి Poets ని, artists ని బయటకు తీసే పనిలో వున్నాను. నాకు దొరికిన అద్భుతమైన కవిత్వపాదాలు వాళ్లు. వాళ్లతోనే నన్ను నేను వ్యక్తం చేసుకుంటాను - వాళ్లలోనే నన్ను నేను శోధించుకుంటాను - నన్ను నేను సానబెట్టుకుంటాను. Expression is more important to poetry - నా పిల్లల మధ్య పాఠ్యాంశ విషయాలను - ప్రాపంచిక అంశాలతో, వర్తమాన సామజిక స్థితిగతులతో మిళితం చేసి , నా దేశాన్ని గురించి సైద్ధాంతిక శాస్త్రీయ అవగాహన పొందేటట్టు.. చెబుతూ - లీనం కావడం నాకు అమితమైన యిష్టం. అది నా టీచింగ్ శైలి. రానున్న కవిత్వ యాత్రలో నా కవిత్వ వ్యక్తీకరణకు పిల్లల మధ్య వుండడం అనేది - ప్రధాన కారణంగా వుంటుందని నమ్ముతున్నాను. అన్ని దేశాల ప్రజాసమూహాలను కలిపి వుంచే గొప్ప వంతెనగా వున్న కవిత్వమా... జయహో ! మామూలు మనుషులను మహా శక్తివంతులుగా తీర్చిదిద్దే కవిత్వమా జయహో ! కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రను తిరగరాస్తుంది. కవిత్వం చరిత్రగా మిగిలిపోతుంది. -------------------------- 21 మార్చి 2014
by బాలసుధాకర్ మౌళి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X7Lz
Posted by Katta
by బాలసుధాకర్ మౌళి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5X7Lz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి