ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్??
నాలాంటోడు
ఏడుపుకీ నవ్వుతూ,
గౌరవాన ముంచిన మాటల్తో,
భయం పూతేసిన చేష్టల్తో,
కుట్రకి కొత్తరంగులేస్తూ చరిస్తూ..
దెన్, దేర్ ఈజ్ నో ఇండెక్స్ ఫర్ మైండ్..
మరి మనిషాలోచన్ల
మూల క్రమ విన్యాసాల విపరీతాల గుట్టెలా..
నిజాలకు నాలుకలు మొలిచి
రహస్యాలు రీసైకిల్ బిన్లోంచి రీస్టోర్ అయేట్టు,
మనిషిని ప్రేమించినట్టు నమ్మించాలిక..
అసత్యమాడందెవరిక్కడ,
దేవుడున్నాడనీ,
ధర్మం పరిగెడుతుందనీ,
ప్లటోనిక్ ప్రణయాలనీ,
ముద్దు తీపనీ,
చావంటే భయం లేదనీ,
ఇంద్రియ నిగ్రహముందనీ..
కావాలని అమ్మాయిని తాకుతూ అమాయకపు మొహం,
తప్పు చేసి దొరికితే అయోమయపు మొహం,
చౌరస్తాలో అగమ్యపు మొహం,
చీకట్లో అరాచకపు మొహం,
తల కలిస్తే, కల స్ఖలిస్తే ఆనందపు మొహం,
నన్ను మించినోడ్ని చూసి అనుమానపు మొహం,
"హోమోసెపియన్ ఎంటర్ ప్రైజెస్,
ఎక్స్ చేంజ్ యువర్ ఓల్డ్ ఫేసెస్ విత్ న్యూ వన్స్..
కండీషన్స్ అప్ప్లై "
దేవుడికీ ఇన్ని రూపాలుండవటగా,
"అహం బ్రహ్మస్మి"
స్వ వచో విఘాతినై, స్వ ముఖ వినాశినై,
నాకు నేనెన్నోసార్లేస్కున్న I.P.C 302 Cr.P.C సాక్షిగా,
అసల్నా అసలు ముఖమేదో ?
ఫేస్ ఫౌండర్ ఉండాల్సింది
అంగారకుడి మీది పాత్ ఫౌండర్లా..
రవిగాడ్లేచాడే,
మోహాల్ని మొహాల మడతల్లో కప్పెట్టి,
కోరికల్ని కార్నియా కన్నాల్లో కుదించి,
మరో రోజులోకీదుతూ..
ఉపసంహారం :
ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ నీడ్,
మైండ్ ఈజ్ ది కాండక్ట్ ఆఫ్ ఫేస్,
పదండి తోసుకు
ముఖాలు మార్చుకు
విషాలు చిమ్ముకు
నిజాలు దాచుకు
పోదాం పోదాం రేపటికి....
*18-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి