పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

క్రాంతి శ్రీనివాసరావు || గెలుపంతా ఆమెదే....! ||


నేను నేను గానే వున్నప్పుడు
ఆమె నాగా మారి

ఆమె ఆమె గానే వుండాలనుకొన్నప్పుడు
నన్నామెగా మార్చుతుంది

చీకటి వాకిలి దాటక ముందే
సూర్యుని రాకడ రాత్రికి రెడ్ సిగ్నల్ ద్వారా తెలపకముందే
నేనింకా నిద్రని కప్పుకొనే వున్నప్పుడు
యోగా చెయ్యమని రోజూ యాగీ చేస్తుంది

పెళ్ళయున కొత్తల్లో అమె కురుల్లో నే తురిమిన మల్లె లింకా మరచిపోనట్లుంది
తెల్ల పూల కుంపటిలా విచ్చుకున్న నులివెచ్చని శ్వాసల ఇడ్లీలను కొసరి కొసరి తినిపిస్తుంది
టీ కి ముందే మింగాల్సిన బీపీ బిళ్ళను గ్లాసెడునీళ్ళను పట్టుకు నిలబడుతుంది

మకుటం
క్షేత్రం
సైన్యం
ఎమీ లేకున్నా
మహా రాణీ నా కుందని
రోజూ దర్బారు నిర్వహిస్తూనే వుంటాను

వచ్చే పోయే వాళ్ళకు ఆఫీసు ఫైళ్ళకు పంచాయుతీ కొచ్చే పిర్యాదీ దారులకు
పూటకు పదిసార్లన్నా పొయ్యెలిగించి కప్పూ సాసర్ల సగీత కచేరీ చేస్తూనేవుంటుంది

ఎప్పుడు చేస్తుందో ఎమో వంటకాలతో నన్ను రోజు వండర్ చేస్తూనే వుంటుంది
మధ్యాహ్నం నిద్రకు చిటుక్కున నా గదిలో చీకటి వెలిగించి
ఇల్లంతా నిశ్సబ్దాన్ని పరిచి తప్పుకుంటుంది

నాలుగయ్యేసరికి నవ్వుతూ టీ కప్పుతో నడచి వస్తుంది
మొగాణ్ణి కదా నలుగురిలో తిరగాలని కాంక్రీట్ జంగిల్లో కాసేపు విహరించి

మనుషుల్ని మనసుల్ని వెతుక్కొని
రాజకీయాలు కాసేపు రుచి చూసి
అప్పుడప్పుడు మైకుల్లో నాలుగు మాటలు పోసి ఇంటికొచ్చేసరికి

ప్రేమాన్నం పళ్ళెంలో పెట్టి ,పక్కన కుర్చొని ,
మాపిల్లల సుద్దులు నుండి ఇస్త్రి పద్దుల దాకా
పెళ్ళిళ్ళు పెరంటాలు బంధువులు బాంధవ్యాలు
నంజుకు పెట్టి నన్ను అప్ డేట్ చేస్తూనేవుంటుంది
నిద్రించేసమయానికి నా దండ చెయ్యుపై తలాంచ్చి
మొహం గుండెల్లో దాచుకొని
నడుమ్మీద చెయ్యేసి
అణువణువుకు నీకొసం నే వున్నానని సందేశాన్ని పంచుతూనేవుంది

నా కోసం నా ఇంటికిపెట్టుకొన్న అయస్కాంతమై
గుండెల్లో ప్రేమ దీపం ముట్టించి
చెవులకు ధైర్యవచనాన్ని దట్టించి
తన జీవితాన్నంతా రంగరించి లేపనంగా నా శరీరామంతా అల్లుకొని
చల్లని దీవెనలిస్తూనే వుంది


.నే లక్ష్యాన్ని ఎప్పుడూ గెలుస్తూనే వున్నా
నా లక్ష్మి అనుక్షణం నన్ను గెలుస్తూనే వుంది.

*18-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి