నాకేమో
ఆకు పచ్చ ఆకాశంలో
వేలాడే బంగారు చంద్రుడి మల్లె వుంది
బంగినపల్లి మామిడి ..
పడమటి తోటల్లోంచి
రహస్యంగా కోసుకొచ్చి రుచి చూసిన
పుల్లటి జ్ఞాపకం..
తలుస్తూనే నోరూరిస్తూ
ఇప్పటికీ వెంటాడుతూనే వుంది..
జ్ఞాపకాల గడ్డిని పేర్చి
బంగారు నిధిని దాచి పెట్టినట్టు
నాన్న మాకందరికీ పంచిన మామిడి రుచి
నాన్న తోనే చడి లేకుండా సెలవు తీసుకుంది ..
ఎండాకాలం
మా ధాన్యపు గది
మామిడి అత్తరు పూసుకున్నట్లు
రసాలు,బేనీషా,మల్గూబా,దిల్ పసంద్
సువాసనలుగా
మా మీద వల విసిరేది..
వేసవి సెలవుల్లో
దిస మొలలతో
దిగుడు బావుల్లో ఈతతో అలిసాక
ప్రాణం నింపుకోడానికి
చెట్టునుంచి తాజా మామిడి పండ్లు
కోసుకు తిన్నప్పుడు
కొత్త రూపును తోడుక్కున్నట్లుండేది..
పిడికెడు సద్దెన్నం తో పాటు
మా తోట మాలి కుటుంబానికి
రాలిపడిన పండ్లు పంచి
అమ్మ చేసే పసిడి విందు
మాకు కను విందు చేసేది..
మరేమో ఇప్పుడీ
కార్బైడ్ రాక్షసి రాకతో
విస్తరించాల్సిన హృదయలన్నీ
ముడుచుకు పోయినట్లు
మమతలన్నీ ఒక్కసారి చెరసాల చేరినట్లు
మూగపోయిన మామిడి దరహాసం
మండీల్లోనే మగ్గిపోతుంది ..
నగరపు వీధుల్లో కార్బైడ్ పల్లకీలో
మెరుస్తున్న మామిడి బుట్టలు
ఇవాళ ఒక గతించిన జ్ఞాపకమే
చెదరిన ఒక తియ్యని స్వప్నమే..!!
*18-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి