పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

ఉషారాణి కందాళ ॥ కాలం ॥


విషాదం మనిషిని లొంగదీసుకుంటుంది!
దు:ఖం గుండెల్లో కొండలా నిలబడుతుంది!
కన్నీళ్ళు అరచేతులకు లొంగవు!
నిట్టూర్పులు ఆరని సెగలవుతాయి!
ఆకలి, నిద్ర, నవ్వు మరిచిన వేళ
అలవిమాలిన నిదానంతో సాగుతుంది కాలం!
అస్సలు నడవదు, గడవదు! ఒట్టి మొండిదనిపిస్తుంది!
ఎప్పుడూ ఎదలో గూడు కట్టుకున్న విచారమే!
జారినవన్నీ జ్ఞాపకాలుగా ముసురుతుంటాయ్!
చెదిరిన బాంధవ్యాలు స్మృతులై అల్లుకుంటాయ్!
ఆశలు నిరాశ ముసుగేసుకుంటాయ్!
కోరికలు పెదవివిరుపులో ఒదిగిపోతాయ్!
ఎప్పుడూ తడి కళ్ళే దిగులును మోసే కావళ్ళై!
ఎప్పుడూ ఎండిన బీడంటి ఒంటరి భావమే!
నాకెవరున్నారు? నాకేమి మిగిలింది? నేనెందుకింక?
వేదన, వేదన ఒకటే వేదన! వెంటపడుతోంటుంది!
అన్నీ చూస్తూ కాలం అంతకన్న భారంగా కదులుతూంటుంది!
కానీ ఎంత గడసరి దొంగ అంటే మనతో, మన ప్రక్కనే,
నిత్యం ఉంటూ మనం కనిపెట్టలేని, కనబడని వేగం తో పరుగు పెడుతుంది!
జత సంధ్యల కోలాటం తో మనలను నిశ్శబ్దంగా నడిపిస్తూ,
మన కష్టాన్ని కప్పెట్టేస్తుంది!దు:ఖాన్ని మరిపిస్తుంది!
అందుకే నేస్తం! మనోవ్యధలకు కాలాన్ని మించిన మందు లేదంటారు!

*18-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి