ఎవరు అని ఎవరైనా అడిగితే ముమ్మాటికీ ఇద్దరమనే చెప్పు
నిప్పు పూలతో జలదరించే శరీరాలమనే చెప్పు
ప్రేమతో నిండిన మహా పాపాత్ములమనే చెప్పు
కరుణ నిండిన మహా కటినాత్ములమనే చెప్పు
ఎరుకతో తూలుతున్న మహామధుపాన
మృత్యు ప్రియులమనే చెప్పు - ఈ విగ్రహ
లోకాలనూ నిగ్రహ జనాలనూ వెక్కిరించే
పిచ్చివాళ్ళమనే చెప్పు. నేరం చేయని నేరస్థులమనీ
అకారణంగా నవ్వే పిల్లలమనీ నీ స్మృతలమనీ
దేహాల ద్రిమ్మరులమనీ, దేశం లేని వాళ్ళమనీ
దేహాలు లేని వాళ్ళమనీ
సౌందర్య బిక్షుకులమనీ
బాహువులు చాచి తిరిగే నేల బాటసారులమనీ
ఆదిమ జంతువులమనీ యిద్దరుగా కనిపించే
ఆ ఒక్కరమనే చెప్పు: మరేం లేదు ఇంతకంటే
వీచే నీడలో వాలే ఆ గడ్డిరెమ్మ కంటే
పూచే పూవు కంటే రాలే వాన కంటే
నిండైన రాత్రి కంటే ఆ కళ్ళలో నిలిచిన మెత్తటి నీళ్ళ కంటే
కొమ్మల్లోని గూళ్ళ కంటే ప్రమిదె వెలుతురు చుట్టూ తిరిగే
క్షణకాలంలో ధగ్ధమయ్యే ఆ పురుగు కంటే
ఈ నీ నా జీవితం గొప్పదేమీ కాదు.సరే సరే
నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి
ఇంతకంటే మరేం కావాలి? నాకూ నీకూ?
*18-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి