నాకెప్పుడూ
తొందరే
సంతోషాన్ని పొందాలని చేసే
కష్టంలో
రాల్చాల్సిన
చివరి చెమట చుక్క
రాల్చాకుండా
ఎదురుచూపుల వెచ్చదనంలో
ఉత్సాహపు తడిని
ఆవిరి చేస్తూ
నాకెప్పుడూ
తొందరే
కలల్ని ఫొటో తీసి
నాకోసం
ఆల్బం చేసుకునే క్రమంలో
కనురెప్పల
పరదాన్ని
తలుపు తడుతున్న సూర్యుని
నిరుత్సాహ పరచొద్దని
త్వరపడి ఘడియ తీస్తూ
కలల్ని చెదరగొట్టేస్తూ
నాకెప్పుడూ
తొందరే
రేపటి అబద్దాన్ని
ఈరోజు నిజంతో పోలుస్తూ
నిన్నటి పద్దుల్లో
నన్ను నేను తీసేసుకుని
గతాన్ని జ్ఞాపకాల గుంజకి
కట్టి
భవిష్యత్తు దారుల్ని
ఇప్పట్నుంచి వెతుకుతూ
నన్ను నేను
నేటికి దూరం చేసుకుంటూ
నాకెప్పుడూ
తొందరే
బాల్యం నుంచి యవ్వనానికి
యవ్వనం నుంచి ముసలితనాన్ని
ఇప్పుడు బ్రతకాల్సిన
క్షణాలు చూడకుండా
జీవితం నుంచి కొనాల్సిన
వస్తువులు కాకుండా
నన్ను నేను వెచ్చించుకుని
నాకు కాని వాటినేవో కొంటూ
బ్రతుకు సంచి నింపుకుంటూ
అందులో
నన్ను నేను కొల్పోతున్నా .....
*18-08-2012
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి