కొత్త గొంతుకలో…..//వాసుదేవ్// --------------------------------- రాత్రిలాంటి నల్లచీరకట్టుకున్న నింగీ, ఒళ్ళారబెట్టుకుంటున్న నేలా రెండూ సాపేక్షసిధ్ధాంతాలకతీతమే ఐన్‌స్టీన్ మళ్ళీ వెనక్కెళ్లాల్సిందే...మనిషి మనుగడలోకి! మరికొత్త గొంతుకలేం పాడుతాయి జీవితమూ, బాధా నాణెనికి చెరోవైపూ ప్రతీ శతకం ఎవడో ఒకడు చెప్పినదో, చేసినదో మాటే వేరు-- గుండెలోంచి పొంగుకొచ్చే మాట గుండెని కోసుకొచ్చే మాట…… *** ఓవాక్యాన్ని చెక్కుతున్నప్పుడల్లా కొన్ని పదాలపై రక్తపు మరకలని చూడకుండా ముందుకెళ్లలేం గుమ్మానిక్కట్టిన చామంతులన్నీ ఒకే పాటందుకున్నాయి.... మా కంట్లోంచి జారిన కన్నీళ్ళని పట్టే కెమేరా ఉందా అని! మళ్ళీ ముందుకెళ్ళాలి --కన్నీళ్ళకి భాషని వెతుకుతూ *** రెండు పూలమధ్యైనా రెండు తొడల మధ్యైనా అదే వాసన కోర్కె వాసన....స్వార్ధపూరిత కోర్కె వాసన జీసస్‌ని శిలువేసిన ఆ జెస్టింగ్ పైలేట్ కీ అదే సమస్యనుకుంటా నిజాన్ని చెప్పనివ్వకుండానే వెనుతిరిగాడు *** ఐన్‌స్టీన్నీ, జీసస్నీనీ వెనకేసుకొద్దాం మరి మరో కొత్త గొంతుకలో... *** వికసించిన చీకట్లలో వెలుగుని ముద్దాడాను వికటించినవాటిల్లో ఫీనిక్స్ అస్థికలకోసం వెతికాను రెండూ దొరికాయి..... మరో కొత్త గొంతు మొహమ్మీదకొచ్చింది అదే గళం, అదే స్వరం కానీ మాటమార్చాల్సొచ్చింది గ్రాఫీటీ పైనో, గ్రాఫుల్లేని వ్యవస్థపైనో ఇక రాయాలి ఇక హోలోకాస్ట్ కథలొద్దు, జాతివైరపు రంపపుకోతలూ వద్దు మాటని పంచుకుందాం, మనసుతో మాట్లాడుకుందాం! ఓ కొత్తగొంతుకలో....
by Srinivas Vasudev
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kmN6IB
Posted by Katta
by Srinivas Vasudev
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kmN6IB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి