పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జూన్ 2014, బుధవారం

Jagadish Yamijala కవిత

నమ్మకం… డియర్… మొన్నామధ్య మనం కలుసుకున్నప్పుడు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. వాటిలో కొన్నింటితో మనం ఒకరికొకరం వాదించుకున్నాం. ఒక నిర్ణయానికి రాలేకపోయాం. నమ్మకం విషయానికి వస్తాను…. మా అబ్బాయో అమ్మాయో మంచి వాళ్ళే అని మనం నమ్మితే ఏ విధమైన గొడవా ఉండదు. అలాకాకుండా అబ్బాయో అమ్మాయో చెడుగా ఉన్నారేమో …ఎవరు చెప్పగలరు….ఒకవేళ నిజంగానే చెడు సహవాసాలు చెడు తిరుగుళ్ళు ఉంటే వాటి ఫలితాలను వాళ్ళు అనుభవించేతీరుతారు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. భార్య ఉత్తమురాలు…ధర్మపత్ని …అని నమ్మితే నీ వరకు నీకు ప్రేమ జీవితం సుఖమయమే. అలా కాకుండా ఆమెది తప్పుడు నడవడిక అయితే అందుకు తగు శిక్ష తానే అనుభవిస్తుంది. ఇందులో సందేహం లేదు. పనిమనిషినీ నమ్మేతీరాలి. ఒకవేళ ఆ నమ్మకానికి ద్రోహం చేస్తే అతనిని తప్పించాలి. అందుకోసం ఎవరినిపడితే వారిని అపనమ్మకంతో చూస్తే జీవితం తెల్లారినట్టే. నమ్మకంతో మనమనుకున్న గుడికో లేక పవిత్ర స్థలానికో వెళ్ళాలి. నమ్మిన వాళ్ళు చెడింది లేదు అనే నానుడిని గుర్తుంచుకో. వాస్కోడాగామా నమ్మకం కొత్త ప్రాంతాన్ని కనిపెట్టింది. కొలంబస్ నమ్మకం అతని మాతృ దేశానికి ఒక కొత్త ప్రాంతాన్ని ఇచ్చింది. ఆయుధాలు లేని చర్చిల్ నమ్మకం రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ కి విజయాన్ని అందించింది. సముద్రంలో మునిగిపోయి కొన్ని రోజులపాటు ఒక వ్యక్తి ఈదుతూ చివరికి ఒక నౌక సహాయంతో ఒడ్డుకు చేరేడన్న వార్త ఓ పత్రికలో చదివాను. నమ్మకమనేది లేకుండా ఉంటే అతను ఎప్పుడో శవమై పోయేవాడు. ప్రహ్లాదుడి నమ్మకం అతనికి దేవుడిని చూపెట్టింది. కృష్ణుడి నమ్మకం భారత యుద్ధంలో విజయాన్ని అందించింది. ఒక మనిషి చదువుతో మాత్రమే ఎదిగిపోలేడు. నమ్మకం కూడా తోడవ్వాలి. నాకు వ్యక్తిగతంగా తెలియదు కానీ ఒక మహాకవిని చూసాను. ఆయన ఒక చోట రాసుకున్నారిలా…. “అప్పుడు నాకు పదునాలుగేళ్ళు. కవితలు రాయాలని కొండంత ఆశ. ఒక రోజు తెల్లవారుజామున నిద్ర లేచి నాలుగు వాక్యాలు రాసాను…వీణానాదం ఇంకా వెలుగెక్కకముందే వినిపించింది….గానామృతం వినసొంపు….నిద్రలోనుంచి ఎగిరి గంతేసాను…. పక్క మీద నుంచే సేవించాను అమృతం…” ఈ నాలుగు మాటలు రాసిన తర్వాత ఇంకా ఏం రాయాలో తెలియలేదు. పదిహేడో ఏట ఒక కవితను పూర్తిగా రాసాను. ఆ వయస్సులో ఒక పత్రికలో పనిచేసాను. ” ఒక మిత్రుడు ఎంత డబ్బైనా ఒకడికిచ్చి దాచమంటాడు….అది అతని నమ్మకం….అతను దానిని జాగర్త చేస్తాడని మిత్రుడి నమ్మకం. నమ్మకద్రోహం చేసే వ్యక్తి కచ్చితంగా పెను శిక్షే పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. కొందరు కొందరి దగ్గర మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఆ డబ్బును సక్రమంగా ఖర్చు చెయ్యరు. అది వాళ్ళు చేసిన ద్రోహానికి దండన. దేశాన్ని నమ్ము….దైవాన్ని నమ్ము….ప్రపంచం నిన్ను కొనియాడుతుంది. “ఫలానాది నేను చెయ్యగలను…నాకది సాధ్యమే….అని నమ్ము…కచ్చితంగా నువ్వనుకున్నది జరుగుతుంది” మనోధైర్యం, వైరాగ్యం నమ్మకానికి బిడ్డలు. ఒక రంగంలో స్థిర చిత్తంతో ఉండి అంకితభావంతో నమ్మకంతో శ్రమిస్తే కృషిచేస్తే నీకక్కడ అనుకున్న స్థాయికి పేరూ ప్రఖ్యాతులూ లభిస్తాయి. సముద్రాన్ని దాటడానికి పడవ ఇచ్చింది ఎవడో…ఆ పడవతో మరో తీరం చేరగలనని మరొకడి నమ్మకం…. వీటిలో ఉన్నతమైనది దైవ నమ్మకం. దైవనమ్మకం ప్రశాంతత ఇస్తుంది. న్యాయంగా నడవనిస్తుంది. వైద్యుడిపై నమ్మకం ఉంచితే మందుల అవసరం లేకుండానే సగం జబ్బు నయమవుతుంది… నమ్మకం కలిగిన వ్యక్తే వేదాంతి అయ్యాడు. శాస్త్రవేత్త అయ్యాడు. నమ్మకం లేని వ్యక్తికి సుఖం అంతంత మాత్రమే… ఆయుష్షు తక్కువే…. నీటిని పాలు అని నమ్మితే అది పాలే. వేపాకు తీపే అని నమ్మితే అది తీయగానే ఉంటుంది. నమ్మకానికి ఎంతో అవసరమైనది మనసు. అది ఎక్కడో లేదు. మనదగ్గరే ఉంది….అందుకోసం నువ్వు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర లేదు….. ఏమంటావు మిత్రమా…మరీ ఎక్కవ చెప్పానంటావా…సరేలే ఇక్కడితో ఈ ఉత్తరం చాలిస్తున్నా…. ఇది చదివి నువ్వు నన్ను కలుస్తావనే నమ్మకంతో నీ జగదీశ్ యామిజాల 18.6.2014

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r5ZtJh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి