మీడియా చేస్తున్న దుర్మార్గాల్ని తప్పకుండా ఖండించాల్సిందే. అందులో ఉపయోగించే భాష, ప్రతిబింబంచే సంస్కృతి వీటన్నింటి గురించి నా మటుకు నాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. నిజానికి తెలుగు వాళ్లు చేసే భాషా పరిరక్షణ ఉద్యమాలన్నీ కేవలం టివి చానళ్ల కార్యాలయాలముందు చేయాలనేది నా వాదన. పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని వ్యంగ్యం తన రూపాన్ని పోగొట్టుకొని కించపరచడమో అవమానించడమో వ్యంగ్యమై పోయింది ఇవాళ. ఇందుకు ప్రసార మాధ్యమాల వారు ఎవరూ మినహాయింపు కాదు.పత్రికా స్వేచ్చ దుర్వినియోగమవుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయం లో ప్రభుత్వాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిమీద చట్టపరమైన లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి గాని నిషేధం ఎంతమాత్రం సబబు కాదు. మీడియా మీద నేను రాసిన కవిత ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైనది ఇక్కడ మళ్లి పోష్ట్ చేస్తున్నాను. నా దేశపు నాలుగో స్తంభం గుండె చేతబట్టుకొని అత్యంత ఉత్కంఠతో ప్రాణాలుగ్గబట్టుకొని ఒకానొక అంతర్యుద్ధాన్ని కళ్లారా వీక్షిస్తున్నాను * * * * వ్యాఖ్యలొద్దు ఊహాగానాలూ వద్దు మాటల్ని నిలువునా చీల్చి చెప్పే వాటి వెనుక మర్మాల్ని ఎవరూ బట్ట బయలు చెయ్యనవసరం లేదు వక్రోక్తులూ వ్యంగ్యోక్తులూ అలంకారాలేమో కాని నీకు నా జీవితమే వ్యంగ్యమైపోయింది సమాజం మెరుగవ్వడం కోసం నువ్వు కూల్చే వాస్తవాల గోడల మధ్య నిప్పులాంటి నిజాల్ని కాల్చి బూడిద మిగులుస్తున్నావు ప్రతి క్షణం దమ్ము తోనో ధైర్యం తోనో అందించే సమాచారం లో నిజం పాలెంత చీకటంటే నల్లగా మాత్రమే ఉంటుందని తెలుసు చీకటికి రంగులు పులుముతున్న దృశ్యాన్ని చూస్తున్నాను సరిహద్దుల కటూ యిటు నిరంతర సంఘర్షణ తెరమీది నాటకానికి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే మాటల యుద్ధాన్ని మోస్తున్నవాడ్ని ఎప్పటికీ హంసను కాలేను * * * * నా దేశపు నాలుగో స్తంభానికిప్పుడు చీడ పట్టింది మాటలే మాటల్ని హత్య చేస్తున్న వేళ మాట సూటిదనాన్ని కోల్పోయింది ముఖానికేసుకొన్న రంగుల్లో మాటలు దాక్కుంటున్నాయి అసలు మాట అక్కడ ఉండగానే మాటల నీడలు ఎల్లలు దాటుతున్నాయి తెర మీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు బలవుతున్న వాడ్ని నిర్మించబడుతున్న నిజాల మధ్య ప్రాణ విలువ వార్త కంటే తక్కువై పోయింది నీ రేటింగ్ సూచికి వేళాడుతూ నేను పోగొట్టుకొన్న ప్రాణం నీకొక రోజు పతాక శీర్షిక రేపటికది పకోడి పొట్లం నాకిప్పుడు నిజం కావాలి సూటిగా చెప్పే మాట కావాలి మాట వలన లోకం వర్ధిల్లాలి * * * *
by Bandla Madhava Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSznJb
Posted by Katta
by Bandla Madhava Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSznJb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి