పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జూన్ 2014, బుధవారం

Nanda Kishore కవిత

అనుకోకుండా 32 పడిలేచిన కెరటం పాదాల్ని కడుగుతుంది. హోరెత్తిన కెరటం చేతుల్ని కలుపుతుంది. సముద్రం పిలుస్తుంది. వెన్నెలస్నేహితా! నిజం. సముద్రం పిలిచినట్టు ఎవ్వరూ పిలవరు. సముద్రం మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడరు.సముద్రపు హోరు అనంతం. వెన్నెలస్నేహితా! ఉన్నంతసేపు ఊపిరి నిలవదు. అయినా సరే. అక్కడే ఉంటాం.అలల్ని తడుపుకుంటూ అక్కడక్కడే సంచరిస్తాం. అక్కడే- భూమికి చివర నిలుచుని, తడితాకని కన్నులకింద ఆకాశాన్ని అదిమిపెడతాం. వెన్నెలస్నేహితా! ఆడుగులు చెరిగిపోతాయ్. ఆడుకున్న పిల్లలందరూ ఒక్కో దిక్కుకి చెదిరిపోతారు. ఇసుక మెరవదు. సూర్యుడు నవ్వీ నవ్వీ అలసిపోతాడు. ఒకానొక కల్లోలం తర్వాత- జంటగా కూర్చున్న మనుషులందరూ ఒకరిలోకి ఒకరు తప్పిపోయినా- సముద్రం తప్పిపోదు. సముద్రం సమస్తమై మనల్ని తప్పిపోనివ్వదు. వెన్నెలస్నేహితా! తీరం దాటి వెళ్ళిపోతాం. సుదూరతీరంలో దాహంతీరే చోటు ఒకటి తప్పక ఉంటదనే పిచ్చి నమ్మకంతో- ఎంతదూరమైనా కదిలిపోతాం. వెన్నెలస్నేహితా! అలలు చెలరేగడం ఆగదు. ఎంత వేడుకున్నా, సముద్రపుగాలి మన ఊపిరిలోచేరి కొట్లాడటం ఆపదు. 18-06-14

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1neDEmU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి