మరువం ఉష | గోదారమ్మ పరవళ్ళు, కృష్ణమ్మ ఉరవళ్ళు అచ్చంగ నావేనమ్మా! --------------------------------------------------------------------------- గోదారమ్మా! మరుమల్లె తోట మారాము చేయక మారాకు వేసినట్లు, ఏడాదికోమారు ఎర్రెర్రని కొత్తనీరు గట్లుతెంపుకుని తోడిపోస్తావు. ఆనకట్ట కట్టినా, కాలువలుగా నిను చీల్చినా ఆగిందా నీ వేగం? చెలిమిచేయ నీకెవరు సాటి, కనుకే సాగరసంగమం నీ అమరగానం! గౌతమి నీలో లీనం, తన తోటి నెచ్చెలులకీ అదే వేదం. కలిమిలొసగ సరిలేరు నీకు, అందుకే అనుపమానం నీ అనురాగం. నదీనదాల్లో జాతివజ్రం నీవు, పైరుపచ్చల పరువానివి నీవు. చిట్టడవుల విడిదిచేయ వెనుదీయవు, కొండాకోనల పరుగిడ అలుపెరగవు. మునిమాపుల మౌనికవైనా, వేకువవేళల మేలుకొలుపులు పాడినా, నీకే కాదా తగును, నీ వొడిన మునక నా బ్రతుకు నోచిన భాగ్యమమ్మా. కృష్ణమ్మా! అలలతో అల్లికలల్లి ఆకాశానికి అందివ్వాలనేనా ఆ ఆత్రం? ఆవేశం అనంతమై సాగే నీ పయనం అంబుధిరాజ అంతఃపురానికా. మరి ఉండుండి వచ్చేటి ఆ మేఘరాజు పరుగు నీ ఒడిని చేరటానికేమో! భాష్యం లేని నీ గీతాలకి వాద్యాలు ఆ దేవదుంధుబులా? మెరుపునురుగుల ఆణిముత్యాలు అంచలంచలుగా ధరపై ఒలికిస్తూ ఏమా పరుగు, ఎందుకా బిరబిరలు, ఏమిటా మేనివిరుపులు? అస్థిరవై, అంచలంచల అనీషవై దరిలేని తీరాలకడుగులేస్తూ, ఏ అదృశ్యప్రియునితోనో గుసగుసల గుంభన నవ్వు లొలికిస్తూ ఉరవడిలోనూ తడబడుతూ ఏ ఓడిని చేరేవు, ఒక్కసారి గుట్టువిప్పమ్మా. నిన్నే అనుసరించే నాకు నావాడి జాడ ముందుగా నువ్వే చెప్పమ్మా! చిన్న మాట: (రచనాకాలం 1982-86)పుట్టింది గోదావరి ఒడిలోనైనా పెరిగింది ఎక్కువగా కృష్ణ నీరు తాగే. ఉద్యోగరీత్యా నాగార్జున సాగర్, ధవళేశ్వరం, భీమవరం, అనంతపురం మొదలుకుని యడ్లపాడు, చీమకుర్తి వంటి చిన్న ప్రాంతాల్లో కూడా నివసించి, నదీ పరివాహిక ప్రాంతాల్లోను, నీటికోసం అంగలార్చే జనాల్లోనూ మసలే వైవిధ్యభరిత జీవితాన్ని రుచి చూపిన నాన్నగారికి కృతజ్ఞతలతో... ఈ చిరు కవిత. 28/02/2014
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MC9bDX
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MC9bDX
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి