పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Kavi Yakoob కవిత

ప్రత్యామ్నాయ తెలుగు కవిత్వం * Published: Thursday, November 9, 2006, ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే పేచేయి. కవికి దక్కిన గౌరవం వచన రచయితలకు దక్కడం లేదు. ఈ కవిత్వంలో కూడా ఉద్యమ కవిత్వానికి, ఉద్యమ కవులకు పెద్ద పీట వేస్తున్నారు. ఉద్యమేతర కవిత్వాన్ని విమర్శకులు (పాఠకులు కాదు) పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆధునిక సాహిత్యంలో మొదటి నుంచి ఉద్యమ కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వ పాయ వుంటూ వస్తోంది. ఇది బలంగా కూడా వుంటోంది. దీన్ని ప్రజా వ్యతిరేక సాహిత్యంగా కొట్టి వేస్తూ వస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడని సాహిత్యంగా దానికి ముద్ర వేస్తున్నారు. 'కేవల కవిత్వం' పేరు పెట్టి దాన్ని తృణీకరిస్తున్నారు. ఆలూరి బైరాగి 'నూతిలో గొంతుకలు', 'ఆగమగీతి' వంటి కవితా సంకలనాలు వెలువరించారు. ఆయన కవిత్వం బలమైంది. శిల్పరీత్యా, వ్యక్తీకరణ రీత్యా బైరాగి కవిత్వం పాఠకుల హృదయాలను కదిలించేది. అలాగే, బాలగంగాధర్‌ తిలక్‌ 'అమృత కురిసిన రాత్రి' కవితాసంపుటి గురించి చెప్పనే అవసరం లేదు. దాన్ని ఆదరించని సాహిత్యాభిమాని వుండడు. ఆయన భావాల్లోని బలం అది. బైరాగి అనంతమైన విషాదాన్ని తన కవిత్వంలో పలికిస్తే, విషాదాన్ని, ప్రేమను పంచే దయాపారావతాలు తిలక్‌ కవితలు. తిలక్‌ కవితలు పక్షులై మన గుండెల మీద వాలుతాయి. ఆ తర్వాత ఇస్మాయిల్‌, మో ఆధునిక కవిత్వాన్ని ముందుకు నడిపించారు. ప్రకృతి సంబంధమై ప్రతీకలతో సున్నితమైన భావాలను పలికించే ఇస్మాయిల్‌ కవిత్వం మనస్సుకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి. ఇక 'మో' వినిర్మాణ వాది. వాక్య నిర్మాణాన్ని దెబ్బ తీయడం ద్వారా సమాజ నిర్మాణాన్ని బద్దలు కొట్టే కవిత్వం వేగుంట మోహన్‌ ప్రసాద్‌ (మో)ది. అజంతా గురించి చెప్పాల్సిన పని లేదు. అజంతా కవిత్వం తెలుగు సాహిత్యంలో ఒక మైలు రాయి వంటిది. మానవ జీవితంలో చెట్లు కూలుతున్న దృశ్యాలను కవిత్వీకరించాడాయన. ఈ వరుసలో ఆ తర్వాత సిద్ధార్థ, సీతారాం వచ్చారు. సిద్ధార్థ కవిత్వం సాంద్రతతో కూడి వుంటుంది. సీతారాం 'మో' వినిర్మాణవాదాన్ని ముందుకు నడిపిస్తున్న కవి. 'మో' కవిత్వంలోని ఒక కోణం సిద్ధార్థ అయితే, మరో కోణం సీతారాం. అయితే, ఇటీవల సిద్ధార్థ తెలంగాణ కవిత్వం రాస్తుంటే, సీతారాం బిసి కవిత్వం వైపు చూపు పెట్టాడు. ఇటీవల ఇటువంటి కవిత్వ ఉధృతి పెరిగింది. ఇదంతా ప్రజా వ్యతిరేక, ప్రయోజన రహిత కవిత్వమనేది కొందరి వాదన. వర్గవాదాన్ని నమ్మి, అందుకు అనుగుణంగా రాస్తే మాత్రమే ప్రజా కవిత్వమని వీరి అభిప్రాయం. సమస్య ఏదైనా వచ్చిందంటే కవి కొంపలు కూలుతున్న దాని గురించి కవిత్వం రాయకపోతే తప్పు ఇక్కడ. అలాంటి కవిత్వమే చెలామణిలోకి వస్తోంది. ఏ కవిత్వానికి పాఠకులున్నారు, దేనికి లేరు అనే విషయం గురించి ఇక్కడ ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ఉద్యమేతర సాహిత్యం కూడా పాఠకుల సంస్కారాన్ని పెంచడానికి పనికి వస్తుందనే నిజాన్ని వీరు అంగీకరించరు. నిజానికి, సాహిత్యం చేయాల్సిన పని పాఠకుల్లో సంస్కారాన్ని పెంచి, మనిషితనాన్ని నిలబెట్టడమే. మనిషి అయింతర్వాతే అందరి కోసం కర్తవ్య దీక్షకు పూనుకుంటారు ఎవరైనా. ఈ విషయాన్ని అంగీకరిస్తే ప్రత్యామ్నాయ కవిత్వాన్ని తక్కువ చేసి చూసే పద్ధతి పోతుంది. అది పోవాలి కూడా. Read more at: http://ift.tt/1fxM9uR

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxM9uR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి